Jun 13,2022 07:22

చాలా సేపటి నుంచీ
కాదు కాదు
కొన్ని వారాల నుంచీ
వీధుల నిండా కమురు వాసన

కాంక్ష ఎలాటిదైతేనేం ?
అది శారీరకమనే భ్రమల్లోనే
చాలా శాతపు ప్రపంచం బతికేస్తూనే ఉంది
దానివల్ల పెద్దగా నష్టమేమీ లేదు కూడా !

కానీ కాంక్ష
నేలమీదా, ఆనేలచుట్టూ అల్లకున్న
వ్యాపారపు తావుల మీదా
ఐనప్పుడే కదా కుదేలై కూలబడేదీ !?

జీవికలు అస్తవ్యస్తమయేలా
హింస ఉన్మాద స్థాయికి చేరేలా
మనిషిని మనిషి చంపయినా సరే
నేలమీద ఆధిపత్యాన్ని
దానిచుట్టూ అలుముకున్న అహంకారాన్ని
తృప్తి పరచుకోవాలి

ఇళ్లూ, వీధులూ, ఊర్లూ,
వాటిలో దోగాడే పిల్లల దగ్గర్నించి
వీల్‌ చెయిర్‌కి వీలునామా రాసిచ్చిన
ప్రాణాల దాకా కుప్పకుప్పలుగా పడ్డా సరే
చిన్నదైతేనేం,పెద్దదైతేనేం,
దేశమేదైతేనేం... మనిషి బతగ్గూడదు అంతే !

విరమణ ప్రకటించడం అంటే
కూడదీసుకుని కుళ్లబొడవటానికి సిద్ధమవడం
అనే అర్థం చెప్పగల
తంత్రాలూ, వ్యూహాలూ నడుస్తున్న వేళ
దేశమంటే మట్టికాదోయ్ గేయం
వరుస మారి వినబడుతోంది !

దేశమంటే ఆయిలోయ్
దేశమంటే ఆయుధమోయ్
దేశమంటే... దేశమంటే...
చితి మీద కూడా కాయగల వెన్నెలోయ్ !
నాకెందుకో ఇపుడా వెన్నెల
భయవిహ్వలయై కనిపిస్తోంది !
చితిమీది వెన్నెల
ఛిద్రమైన శరీరాల్లా ముక్కలై కనిపిస్తోంది !
 

- కోసూరి రవికుమార్‌
94913 36488