ప్రజాశక్తి-వాల్మీకిపురం : వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన వాల్మీకిపురం శ్రీ పట్టాభిరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని టిటిడి డిప్యూటీ ఇఒ వరలక్ష్మీ అన్నారు. గురువారం స్థానిక శ్రీ పట్టాభిరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజాప్రతినిధులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 26వ తేది నుంచి ప్రారంభం కానున్న శ్రీ పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. ఏప్రిల్ 1న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి తోటవీధి నందు ఆరు బయట ఉన్న టిటిడి స్థలాన్ని ముస్తాబు చేస్తున్నామన్నారు. 2వ తేదీ రథోత్సవం, 3వ తేదీ పార్వేట ఉత్సవం, 5వ తేదీ పుష్పయాగంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ మునిచెంగల్‌రాయులు, సిబ్బంది దుశంత్, నాగరాజు, జడ్‌పిటిసి నిర్మల, సర్పంచ్ గంగులమ్మ, మానవతా సంస్థ జిల్లా అధ్యక్షులు క్రిష్ణమూర్తి, వైసిపి నాయకులు చింతల ఆనంద రెడ్డి, కేశవ రెడ్డి, నీళ్లభాస్కర్, ఆనంద్, సురేష్ రెడ్డి పాల్గొన్నారు.










