Mar 27,2023 21:07

జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న డ్వాక్రా మహిళలు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే వైయస్సార్‌ ఆసరా కింద నిధులు మంజూరు చేయడం జరుగుతోందని శాసనసభ్యులు మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డి తెలియజేశారు. సోమవారం పట్టణ పరిధిలోని సిటీ కల్యాణ మండపంలో డ్వాక్రా సంఘాల మహిళలకు వైయస్సార్‌ ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా సంఘాల మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్‌కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ మండల పరిధిలోని 25 పంచాయతీల, 724 డ్వాక్రా మహిళా సంఘాలకు గాను రూ.5.93 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులను డ్వాక్రా సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటేనే కుటుంబాలు బాగుంటాయని, తద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని భావించిన జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆసరా నిధులను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు ఆకేపాటి మురళిరెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పోలి వెంకటసుబ్బారెడ్డి, కొండూరు శరత్‌ కుమార్‌ రాజు, మిరియాల సురేఖ, వెలుగు ఎపిఎం మదన్మోహన్‌రెడ్డి, సిసిలు, యానిమేటర్లు, డ్వాక్రా మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.