సమ్మర్థంగా పోగైన శోకకుడ్యాలకు తోడు
పల్చగా గుడిసెలేసుకున్న
కొన్ని నిస్సత్తువ దేహాలుంటాయక్కడ !
నగరీకరణ, నాగళ్లకు సమాధులు తవ్వే చోట
నిశ్శబ్దం ముళ్లకంచెలా అల్లుకుంది
ప్రశాంతత అనుకోవాలో తెలియదు
నిరాదరణ గూడకొంగ
గూడు కట్టిందనుకోవాలో తెలియదు
కనబడని కన్నీటి గుబురేదో
ఆ ఆవరణ చుట్టూ దడి కట్టుకుంది!
బహుశా పెద్ద పండక్కి
బట్టలు చూపినప్పుడు
ఇంటికి వచ్చిన పెద్దలు తిరిగి వెళ్తూ
పొలంలో బతుకు లేని రైతు బిడ్డల్నీ..
చెమటధైర్యం కోల్పోయిన మట్టి పొరల్నీ..
చూసి, ఊరి పొలిమేరల్లోనే ఎక్కడో
ఏడ్చీ ఏడ్చీ నిద్రపోయుంటారు
వారికి నిద్రాభంగం వొద్దనుకుందేమో
పగలని లేకా రాత్రని లేకా
ఊరి వెలుతురు సద్దుమణిగిపోయింది!
జనపదాల్లో ఇప్పుడు జీవితం లేదు
పొడిబారిన పొలం గుండెలోని
బృహద్ధమని తెగిపోయింది కదా!
వడగాలుల విసురు తప్ప
హాయిగా పలకరించే చిరుగాలుల ఆశలేదు
పంట గింజల కొత్త రుతువు కోసం
అప్పు చినుకులు ఎప్పుడు రాలతాయా అని
ఎదురుచూసే నేలకళ్ళలో జీవం లేదు -
అక్కడ ఏ రంగు జెండాలెగిరినా
వాటి కనుసన్నల్లోనే
చెరువులు కొండలు నదులు అడవులు
అత్యాచారానికి గురవుతాయి
ఏ బులుపు నిషా పెత్తనం చెలాయించినా
ఖద్దరు నురగల దారంతో
పచ్చని పిడికిలి గొంతుల పెదవులు
కుట్టివేయ బడతాయి!
ఒక్కొక్కటిగా
అన్ని ఆభరణాలనూ అమ్ముకున్న తరువాత
పంట మడిని బిక్షాపాత్రగా మార్చుకుంది
అమృతోత్సవ పల్లె భారతం!
ఇపుడు, విశాల భయానక చీకటి గుట్టల్లో
పులి నోట్లోంచి తప్పించుకున్న మేకపిల్ల.. పల్లె
ఇలా గాయాల ముద్దలాంటి దీనబిక్షువొకడు
వణుకుతూ చాచిన చేయిలా..!
- కంచరాన భుజంగరావు
94415 89602










