రాయచోటి : జవాన్ దేవరింటి రాజశేఖర్‌కు గుర్తుగా స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. మంగళవారం కలెక్టర్ గీరీషా , ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఇండో టిబేటన్ బార్డర్‌పై ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో అన్నమయ్య జిల్లా, సంబేపల్లి మండలం, దేవపట్లకు చెందిన దేవరింటి రాజశేఖర్ (34) అనే ఆర్మీ జవాన్ మతి చెందిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సంబేపల్లి మండలం, దేవపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమర జవాన్ దేవరింటి రాజశేఖర్ గుర్తుగా స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. స్థూపం వద్ద పలువురు నివాళులర్పించారు. సందర్భంగా కలెక్టర్ గీరీషా అమర జవాన్ దేవరింటి రాజశేఖర్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వం చూపించిన భూమిలో వ్యవసాయ సాగు చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్మీ జవాన్ రాజశేఖర్ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కలెక్టర్‌తో పాటు ఐటీబిపి బెటాలియన్ కమాండెంట్ అమిత భాటియా, డిప్యూటీ కమాండెంట్ ఆయుష్ దీపక్, ఇంజినీర్ రంజాన్, సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి, డిఎస్‌పి శ్రీధర్, సంబేపల్లి తహశీల్దార్ మహేశ్వర్ బారు, రూరల్ సిఐ లింగప్ప, ఎస్‌ఐ మహ్మద్ షరీఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










