కంభంవారిపల్లి : గిరిజనుడైన కంపా భాస్కర్‌కు చెందిన స్థలం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం ఎపి గిరిజన సంఘం, ఎకలవ్య ఎరుకల సంక్షేమ సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల స్థలం కబ్జా చేయమేకాకుండా దాడి చేసిన పెత్తందార్లు అయిన మహేష్‌రెడ్డి, రాజారెడ్డి, రెడ్డప్పరెడ్డిలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కబ్జాదారుల నుండి కంపా భాస్కర్ కుటుంబానికి రక్షణ కల్పించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.హరినాథ్ మాట్లాడుతూ కె.వి.పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 536లో 02.5 సెంట్లు ఖాళీ స్థలం జయచంద్రారెడ్డి, నారాయణరెడ్డి వద్ద 1986 సంవత్సరంలో కంపా చిన్నప్ప కొనుగోలు చేశారు. ఆ స్థలంలో బండ్ల మిద్దె నిర్మించుకున్నారన్నారు. కొంత ఖాళీ స్థలం ఉండటంతో పెత్తందార్ల కన్ను ఆస్థలంపై పడిందన్నారు. ఈ ఏడాది జనవరి 10వ తేదీన కె.వి.పల్లి పోలీస్ స్టేషన్‌లో కంపా భాస్కర్ ఫిర్యాదు చేయడంతో మహేష్‌రెడ్డి, రాజారెడ్డి, రెడ్డప్పరెడ్డి పైన ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు మూడు నెలలు అవుతున్న నిందితులను అరెస్టు చేసి జైలుకు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరామయ్య, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్ర, ఏకలవ్య ఎరుకల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు రాజేష్, ఎర్రయ్య, ఈశ్వరమ్మ, రఘు, సులోచన, రమేష్, చంద్ర, కిరణ్, విజరు, అమర, భాస్కర్, వినోద్, శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు. అనంతరం కబ్జాకు గురైన కంపా లక్ష్మమ్మ ఇంటి స్థలం వద్దకు వెళ్లి నాయకులు పరిశీలించారు.










