ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: ఎన్‌టిఆర్ జిల్లా ఐద్వా 20వ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఎన్‌టిఆర్ జిల్లా ఐద్వా ప్రధాన కార్యదర్శి కె.శ్రీదేవి కోరారు. కొండపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో జరిగే ర్యాలీ, ప్రతినిధుల సభను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక క్రాంతి హైస్కూల్‌లో సోమవారం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వమే మొట్టమొదటిగా ఆంధ్రమహిళా సంఘం పేరుతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో మహిళా సంఘం ఏర్పాటు చేశారని, తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాల్లో అఖిల భారత మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుతం 1.80 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద సంఘంగా అవతరించిందని, మహిలా సమస్యలపై అనేక పోరాటాలు నిరంతరం కొనసాగిస్తుందని అన్నారు. మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్న ఐద్వా పోరాటాల్లో అందరూ భాగస్వామి కావాలన్నారు. మహాసభకు ఆహ్వన సంఘాన్ని 25 మందితో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆహ్వాన సంఘం అధ్యక్షురాలిగా లయన్ దేవినేని జోనికుమారి, కార్యదర్శిగా వెనిగళ్ల అమ్మాజీ, ఉపాధ్యక్షులుగా కె.శ్రీదేవి, జడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి తదితరులతో ఆహ్వాన సంఘం ఏర్పడిందన్నారు.










