వాషింగ్టన్ : అమెరికాలోని అరిజోనా రాష్ట్రం అడవులకు నిలయం. దట్టమైన అడవులతోపాటు, పర్వతాలు, పీఠభూములు కలిగి ఉన్న ఈ రాష్ట్రంలో మంగళవారం స్కాట్స్‌డేల్ సమీపంలోని అడవుల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని అగ్నిప్రమాద అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... మంగళవారం సాయంత్రం ఫీనిక్స్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని స్కాట్స్‌డేల్ సమీపంలోని అడవుల్లో సాయంత్రం 5.15 గంటల సమయంలో గాలివాటున మంటలు చెలరేగాయి. దీంతో అడవుల్లోని గడ్డికి కూడా నిప్పు అంటుకోవడంతో మంటలు దావానంలా వ్యాపించి దాదాపు పది కిలోమీటర్ల మేర చెట్లు కాలిబూడిదైపోయాయని అరిజోనా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంగళవారం రాత్రి 100 పైగా ఇళ్లను, 1,145 నివాసితులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. ఈ ఘటనతో ఫైర్ సిబ్బంది అగ్నిప్రమాదం ఏ ప్రదేశం వరకూ జరిగిందో తెలిపేలా కంటైన్‌మెంట్ లైన్‌ని తవ్వినట్లు అధికారులు వెల్లడించారు. అడవుల్లోని మంటలను అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 300 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేశారని, ఇప్పటికీ వారి ప్రయత్నాలని కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు.
కాగా, అడవుల్లో మంటలు చెలరేగడానికి అధిక వేడి, గాలులు, వాతావరణ పరిస్థితుల రీత్యా అడవుల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని ఫైర్ విభాగం పేర్కొంది. ఇక ఈ ఘటనపై అరిజోనా ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టిఫనీ డేవిలా బుధవారం మాట్లాడుతూ.. 'మేము మంగళవారం రాత్రి అడవుల్లోని మంటలను చాలావరకు అదుపుచేశాము. అగ్నిప్రమాదం చుట్టూ కంటైన్‌మైంట్ లైన్‌ని తవ్వాము. సమీపంలోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాము. ఇంకా అడవుల్లో మంటలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు' అని ఆయన అన్నారు.










