వాళ్ల్లు ప్రాణంతోనే ఉన్నారు
అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నారు
మునుపటిలా
కళ్ళలోకి కళ్ళు పెట్టి
మెడ చుట్టూ చేతులేసి
ముఖ్యంగా గుండెను గుండెతో కలిపి
మాట్లాడలేకున్నారు
కొందరసలు నేనెవరో
తెలియనట్టే వెళ్లిపోతున్నారు
బాల్య యవ్వనాల్లో
గొడుగుల్లా ఉన్న చేతులు
నీడల్లా వెంట ఉన్న చేతులు
చప్పట్లులా మోగిన చేతులు
చుట్టూ దడి కట్టిన చేతులు
వయసు పెరిగే కొద్దీ
చేతులన్నీ ముందుకు రాలేక
మాయం కావడం విషాదం !
చంద్రుడితో కలసి సినిమా చూసిన రోజులు
చీకటితో చేరి చెట్టిక్కి కొబ్బరికాయలు కొట్టేసిన రోజులు
తార్రోడ్డు కాళ్ళ ని కాలుస్తున్నా
భుజాన బ్యాటు పెట్టి
ఊరారా తిరిగి ఆటల్లో నెగ్గిన రోజు
మనసులన్నీ గుమిగూడేవి
ఎగిరేవి దుమికేవీ పడేవి లేచేవి లేపేవి
కాలం గడిచే కొద్దీ
దూరం ఎందుకు పెరిగినట్టో తెలియట్లేదు
అదిగో అక్కడ నాటిన మొక్కలు
గాలి భాషలో ఉత్తరాలు రాసుకుంటున్నారు
ఊరి చుట్టూ కాలువల నుండి చెరువులో చేరిన నీరు
నీటిలిపిలో హత్తుకుంటున్నారు
పెద్దగా దూరమేమీ లేదు
గడ్డలు కట్టిన క్షణాల్ని బద్దలు కొట్టడమే
తెలిసో తెలియకో అడ్డుపెట్టుకున్న గోడల్ని
అలా ముక్కలు చేసి
గతాన్ని రంగు రంగుల చిత్రంగా
ప్రపంచానికి చూపడమే !
- డాక్టర్ సుంకర గోపాలయ్య
94926 38547










