ఆకలి చెట్టుకు వేలాడుతూ
బతుకు గోదారిలా పారుతుంటే
కెరటంలా ఎగసిపడుతున్న కన్నీటికి
ఆనకట్ట కడుతున్నాం
అరువు రాకాసి కోరల కింద నలిగిపోతూనే
కరువు కడుపులోకి దిగజారిపోతున్నాం
ఒట్టి మాటల కట్టెలు నెత్తిన పెట్టుకుని
చితి వరకూ బరువును మోస్తున్నాం
ఆర్థిక తూట్లు అంగీకి మరమ్మత్తులు చేసుకుని
సమాజంలో మనుషుల్లా తిరుగుతున్నాం
బతుకు గాయాలకు మన్ను రాసి
సంక్షోభాల కావడి మోస్తున్నాం
నాలిక విధిలించే మాటల్ని భద్రంగా దాచుకుని
ఏలికకు ఏకరువును ఏకం చేస్తున్నాం
అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా
బురద రొచ్చుల ఉచ్చుతనాలే
ఇప్పుడు అప్పుడు ఎప్పటికైనా
బూడిదలో దూకిన పన్నీటి కాలువలే
వెక్కిళ్లు పెట్టి మొక్కుతా
నొక్కుల్లకు తలలు వాల్చుకుంటున్నాం
అంతా మంచే ఎక్కడా చెడ్డ లేదు
ఇసుమంత పనికి తాటికాయంత ఇచ్చి
కూసింత వెసులుబాటుకు అలసిపోతున్నాం
వైరస్ లన్నీ అవలీలగా దాటేస్తూ
మైనస్ లను కూడికల్లోకి ఎక్కిస్తూ
రాబడి పాటకు కోరస్ అందిస్తున్నాం
గడప గడపలో కన్నీటి కడగళ్ళను కొలుస్తూ
అడపా తడపా ఆఖరి క్షణాలను గుర్తు చేస్తూ
లాలనకు పాలన తోడైతే
జోల పాటకు పల్లవిలవుతున్నాం
గూడు చెదిరిన రాత్రి గురుతు మిగిలాక
మోడు వారిన చెట్టుకు
వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాం
జీవన కల మార్గంలో బ్రతుకును ఈడ్చుతూ
పగిలిన గుండెల్ని అతికించుకుంటున్నాం
రాలిపోయిన పిందెల్లా పథకాలు చెల్లాచెదురైతే
ముక్కలైన కాయల్ని ఏరుకుంటూనే
గాలిని భోంచేస్తూ భ్రమల వాకిట్లో ఎల్లకాలం
కట్టెల్లా జీవనం సాగిస్తున్నాం
రేటు కట్టే ఓట్ల పడగలకింద నక్కి నక్కి పోతూ
గరళాన్ని ఒంట్లో దాచిన సర్పాలకు
సింహాసనాన్ని కట్టబెడుతున్నాం
ఆంక్షలతో అట్టడుగున స్వేచ్ఛ కూరుకుపోయి
నినదించే కాలం చుట్టూ వలయం చుట్టుకున్నాక
నినాదపు జెండా పక్కన పొంచి కూర్చున్నాం
బువ్వ కరువైన పొట్టకు
మెతుకులు విదిలించే తీరు ఉన్నంత కాలం
అర కడుపులతో భారం మోస్తూనే వున్నాం
బతుకు చక్రపు తిరుగుబాటు పొదిలో
ఒదిగిపోతూనే తిరగబడుతుంటాం.
- నరెద్దుల రాజారెడ్డి,
సెల్: 9666016636










