ప్రముఖ కవి, విమర్శకులు, సమీక్షకులు దాస్యం సేనాధిపతి ఇటీవల వెలువరించిన లిదిక్సూచి గ్రంథం సాహితీ రంగంలో ఓ వినూత్న కోణంలో రచించిన గ్రంథం. సేనాధిపతి స్వతహాగా మంచి వచన కవి, నేటివరకూ ఎన్నో గ్రంథాలను రచించి ప్రచురించారు. కానీ అన్ని గ్రంథాల్లోకెల్లా ఈ గ్రంథం ఓ ప్రత్యేకతను సంతరించుకున్నది. రచయిత ఈ పుస్తకంలో వచన కవిత్వం రాయాలని ఉత్సాహం వున్నవారికి ఎంతో ఉపయోగపడే విషయాలన్నీ సవివరంగా పేర్కొన్నారు.
కవితా కన్యకు.. ఏడు వారాల నగలలా కవితా వస్తువు, కవితా శీర్షిక, కవిత ఎత్తుగడ, కవిత నిర్వహణ, అలంకారాల ప్రయోగం, భావగణాల వాడుక, గుప్తత.. క్లుప్తత ఉండాలని చెప్పారు. రచయిత కవితా వస్తువు ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సందర్భం సహితంగా, కవితా వస్తువుకి అనుగుణంగా కవితా శీర్షిక ఉండేలా తీసుకోవలసిన జాగ్రత్తలు, కవిత ప్రారంభం (ఎత్తుగడ) పాఠకునికి శీర్షికని చూసిన వెంటనే కవిత చదవాలనే కుతూహలం కలిగించేదిలా ఉండేలా తీసుకోవలసిన నియమాలు, కవితా వాహిని సందర్భ సహితంగా సాగేలా ఉండేలా తీసుకోవలసిన సూత్రాలు, అలంకారాల ప్రయోగం సమంజసంగా ఉండేలా గమనించవలసిన విషయాలు, భావగణాల వాడుకలో పాటించవలసిన పద్ధతులు, కవితలో గుప్తత పాటిస్తూ క్లుప్తంగా కవితా వస్తువును అర్ధవంతంగా పాఠకునికి అందించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.. రచయిత చక్కగా వివరించారు.
రచన సరళమైన భాషలో సామాన్య పాఠకునికి కూడా అర్థమయ్యే స్థాయిలో వుంది. వచన కవిత్వం రాయడం అంటే తెల్ల కాగితాలను నల్లగా చేయడం కాదని, చెప్పదలుచుకున్న విషయాన్ని తేట తెల్లంగా మనసుకు హత్తుకునేలా ఎలా చెప్పాలి అనే విషయాన్ని రచయిత అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ దిక్సూచి.. వచన కవికి ఉత్తమ మార్గం చూపే దీపమే అని వక్కి నొక్కాణించి చెప్పవచ్చు. 196 పుటల్లో వచన కవిత్వ రంగంలో ఘనాపాటీలుగా కీర్తింపబడుతున్న ఎందరో మహానుభావుల కవితలను ఉదహరిస్తూ దిక్సూచిని రచించడంలో సేనాధిపతి గారి పుస్తక పఠనం అభిరుచి ఎంత ఉన్నతంగా ఉందో మనం గ్రహించవచ్చు. వచన కవిత్వం రాయాలని అనుకునేవారే కాదు.. సాహితీ అభిరుచి గలవారు ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకం.
సేనాధిపతి గారు తాను స్వయంగా కవిత్వం రాయడమే కాకుండా.. ఇప్పుడిప్పుడే కవితలు రాయడంలో ఓనమాలు దిద్దుతున్న నూతన కవులను ప్రోత్సహించడంలో ప్రముఖులు. నేటి కవిత అనే అంతర్జాల సమూహానికి ముఖ్య సలహాదారులుగా వ్యవహరిస్తూ ఎందరో కవులను కవయిత్రులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రముఖ కవి ద్రాస్యం లక్ష్మయ్య గారి సారథ్యంలో నడుస్తున్న నేటి కవిత అంతర్జాల సమూహంలో సేనాధిపతి 'మనలో మనం' అనే శీర్షిక కింద కవితలను విశ్లేషణ చేస్తూ లోపాలను విశదీకరిస్తున్నారు. తమ శైలిలో పరిణతి సాధించడానికి అమోఘమైన సలహాలనిస్తూ.. సాహితీ విలువలు పెంచే విధంగా.. ఒక గురుకుల పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న మాదిరిగా శిక్షణనిస్తూ... అద్భుతమైన సేవనందిస్తున్నారు.
దిక్సూచి వచన కవిత్వానికి ఉపయోగకరమైన.. ప్రామాణిక గ్రంథంగా పేర్కొనవచ్చు. మదిలో మెదిలిన ఆలోచనలకు అక్షర రూపం కట్టడంలో వుండే మెళకువలను ఉగ్గుపాలతో రంగరించి కలిపి తాగించినట్టు ఇందులో వివరణలు అందించారు. ఈ గ్రంథం చదవగానే ఏదో ఒక కవిత్వ నిఘంటువు చూసిన భావన కలుగుతుంది. విద్యాభ్యాసంలో మొట్టమొదట అచ్చులు హల్లులు నేర్పించి, తదుపరి గుణింతాలు నేర్పించినట్టు... రచయిత ఈ గ్రంధంలో అసలు కవిత అంటే ఏమిటి? కవిత్వం అంటే ఏమిటి? ఎలాంటి అంశాలను కవితా వస్తువులుగా తీసుకోవాలి? ఎంపిక చేసుకున్న అంశాన్ని పాఠకునికి నచ్చేలా ఎలా విపులీకరించాలి? పాఠకుని మదిలో సుస్థిర స్థానం ఏర్పర్చుకునేలా కవితను ఎలా ఆవిష్కరించాలి? అనే అంశాలను ఒక క్రమపద్ధతిలో రూపొందించారు. కవితా శిల్పం చెక్కడంలో కవి తన కలమనే ఉలిని ఎలా ఉపయోగించాలి? కవితా కన్య అద్భుతమైన సొబగులతో అత్యంత ఆకర్షణీయంగా పాఠకుని మదిని దోచేలా ఎలా రూపొందించాలి? అనే విషయాలను మనసుకు హత్తుకునేలా వివరించారు.
కవన కన్యకు పట్టు వలువలు వంటి ప్రతీకలు, భావగణాలు, అలంకారాలు ఎప్పుడు ఎలా అలంకరించాలి అనే అంశం రచయిత వివరించారు. పద బంధాల కూర్పుతోనే కవితకు పాఠకుని మదితో అనుబంధం ఏర్పడుతుందేమో అనే ఆలోచన కలిగేటట్టు చేశారు. ఈ గ్రంథం మొత్తం సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే... ఇది వచన కవిత్వానికి రాజ్యాంగం లాంటిది. సమాజంలో ఒక వ్యక్తి ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా జీవించడానికి రాజ్యాంగంలో రూపొందించిన నియమావళి మాదిరిగా వచన కవిత్వ రచనలో పాటించవలసిన నియమాలు, సూత్రాలు, పరిమితులు, వచన కవిత్వం రాసే ప్రతి ఒక్కరూ ఎలా ఏమేమి పాటించాలి అనేది అత్యద్భుతంగా విశదీకరించారు. ప్రతి కొత్త కవి చదవదగిన అద్భుతమైన గ్రంథం ఇది. పేజీలు : 196, వెల రూ.200. ప్రతులకు : దాస్యం సేనాధిపతి, 94405 25544.
- లక్ష్మీ పద్మజ దుగ్గరాజు
98663 28747










