Oct 10,2022 07:58

''ఎగిరే గాలి పటాన్ని నేను/ రెక్కలు మొలిచిన గాయాన్ని నేనే../ నా జీవితంలో అడిగేందుకు ప్రశ్నలు లేవు/ చెప్పేందుకు సమాధానాలు దొరకవు.'' ఇంత స్వచ్ఛంగా, నిర్భీతిగా తన జీవన ద్ణుఖాన్ని ప్రకటించుకున్న కవయిత్రి ఎవరై ఉంటారు? ఈ మాటల్లో నిజాయితీ తప్ప నిర్వేదం వినిపించదు/ ఆత్మ విశ్వాసం తప్ప బేలతనం కనిపించదు. ఎప్పటికీ ఎన్నటికీ కలవని సమాంతర రేఖల మధ్య జీవన బంధం. ఆ బతుకు ఛట్రంలోంచి పలికిన అంక గణిత సూత్రమే 'రెండొకట్ల పదకొండు'. సుద్ద ముక్కతో అలికిన పిచ్చి గీతల్లాంటి కవిత్వం. ఎక్కడా దాపరికం, మొహమాటం లేని కవిత్వం. వెరీజ్‌ మై స్పేస్‌ అంటూ ఆర్తిగా పలవరించి, ప్రశ్నించిన కవిత్వం.
    'ఉయ్   డోంట్‌ వాంట్‌ జస్టిస్‌, ఉరు వాంట్‌ పీస్‌' అంటూ ఆర్ధ్రంగా నినదించిన కవిత్వం. కామానికీ, ప్రేమకూ ఒకే పర్యాయ పదమా? ఈ ప్రశ్నాత్మక గొంతు తోట సుభాషిణి కవిత్వానిదే. సందేహం లేదు. ఈ అంకెల్లో తన కళ్లని దాటి ద్ణుఖ సముద్రాల చెక్కిలి మీదికి జారుతున్న నదీ మూల గొంతుకల ప్రతిధ్వనులున్నారు. చదివిన తరువాత ఈ కవిత్వం నన్ను బాగా హంట్‌ చేస్తోంది. నాలుగు మాటలు రాసి ఈ భారాన్ని దింపుకోవాలనిపిస్తోంది. కవిత్వమెప్పుడూ అనుభవైక వేద్యమేనన్నాడు కదా శ్రీశ్రీ. అనుభవైక జీవితంలో గాయాల సలపరమే గుణ పాఠాలు నేర్పుతుందనేది 'రెండొకట్లు పదకొండు' చదివితేనే అర్థమౌతుంది.
           స్త్రీ జీవిత కోణంలోంచి రాసిన కవిత్వంలో ఒకరు 'నిషిద్ధ స్వప్నం'. మరొకరు నిషిద్ధాక్షరి అన్నారు. ఇక్కడ మన కవయిత్రి .. 'ఆమెలందరూ/ అణచివేత గొడుగు కింద/ తలదాచుకుంటున్న చీకటి లతలు' అన్నారు. పసి దేహాలపై మానవ మృగాల లైంగిక హింసలు, అత్యాచారాల పట్ల తీవ్రంగా స్పందిస్తారు. 'బావుల్లో నీళ్లుండవు/ ఇప్పుడు బావులు తవ్వితే/ ఆడపిల్లలపై అత్యాచారాలు/ పసికందుల ఆర్తనాదాలే.. విన్పిస్తారు/ దేవతగా కన్పించిన శ్రీమతి దెయ్యంగా మారి, పతి నోట వినకూడని భాషేదో వింటున్నప్పుడు, భార్య స్థానంలోంచి ఇలా మాట్లాడుతున్నారు. 'నేను నీతోనే ఉండాలని స్వార్ధపు చిరునామా నువ్వు/ నీతో కాసేపు లేకున్నా నిస్వార్ధంగా కుళ్లుకునే మనసు నీది/ నాలో ఉన్న ధైర్యమే నీ భయం' పుట : 28
           అంతే కాదు; తనకు మిత్రుడు, ప్రియుడు, సన్నిహితుడైన సహచరునికి విన్నపం చేస్తుంది. 'నా ప్రేమకు స్వస్తి చెప్పలేను/ అలా అని నన్ను నేను కోల్పోను/ నాలోని విరక్తి నిన్ను రాతిగా మలిచేందుకు నేను శిల్పిగా/ ఉలిని సమకూర్చుకుంటున్నా/ సహకరిస్తావు కదూ..'/ పుట 30
'గతకాలంబు మేలు వచ్చు కాలంబు కంటెన్‌' అని పల్కిన నన్నయ లాగా.. గడిచిపోయిన జీవితాన్ని, అప్పటి రోజుల్ని బాగా ఇష్టపడతారు ఈ కవయిత్రి. నిజమే.. ఓ హిందీ కవి అన్నట్లుగా బీతే హుయే దిన్‌ నహీ ఆతే.. 'వెళ్లిపోయిన రోజులే బాగుంటాయి/ మొండి గోడల జ్ఞాపకాల పుస్తకాల్లో అచ్చయిన ప్రతి పేజీ ఆసక్తిగా/ చదువూరిస్తుంది/ ఈ రుతువులన్నీ మనం రాసుకున్న జాతకాలే/ అందుకే అయిపోయిన రోజులే బాగుంటాయి' పుట : 31
       'రోజుకొక్కసారే మరణించే నాకు/ జన్మించడమూ తెలుసంటారు/' ఎక్కడా కామా పుల్‌స్టాప్‌ లేని, శుద్ధ వచనంలో ఓ ఉత్తరాన్ని తన నుంచి అందుకుంటుంది ఈ కవయిత్రి. అందులో.. 'ప్రేమా, బాధా వైరాగ్యమూ లేదు/ ఏ తాత్వికతకూ చోటు లేదు/ ఏ జ్ఞాపకాన్నీ గుర్తు చేసుకోలేదు../' అంటూనే చివర్లో ఒక గొప్ప కవి భావనకు తెరతీస్తుంది. 'అది ఉరి గొంతుకు నది నీటిలా/ చెద చెట్టుకు ఇగురులా ఉంది' పుట : 36. 'ఎక్కడైనా అతను కనపడితే/ ఉత్తరాన్ని తిరిగి తీసుకోమని చెప్పరూ.. ' అంటూ అన్యాపదేశంగా తన బాధను వ్యక్తం చేస్తారు. 'బతకాలని ఉంది. తెగిన కాలాన్ని అతికించి చిరిగిన కలల్ని కలిపికుట్టి/ నీలో లీనమవ్వాలని ఉంది../ నమ్మవు కదూ, మరణించడమంటే ప్రేమలేక/ పోవడం.. అని ఇంకెప్పుడు తెలుస్తుంది నీకు..' ఈ కవిత్వ సంభాషణ ప్రేమ రాహిత్యంలో ఆరాధ్య భావన తలపిస్తుంది. 'ప్రయాణం అనివార్యమని/ తెలిసాక కూడా/ నీ కోసం నాలుగడుగులు వెనకేసి వస్తావేమో నని చూస్తాను చూడు' అన్న మాటల్లో గడ్డ కట్టిన గుండెళ్ళో ప్రేమ లేని జీవితం ధ్వనిస్తుంది. 'అందం శాపం ఒకప్పటి మాట/ ఇపుడు ఆడతనమే శాపం/ వివక్ష కోరలు ఆమెను కాటెయ్యనిదెక్కడ/ అవి పంటిగాట్లా, చూపుల గాట్లా మాటల గాట్లా అన్నది తర్వాత విషయం' పుట : 42. 'కవయిత్రి రహస్య గది/ రాత్రిని అల్లుకున్న వెన్నెల/ చెరసాలలో ఊపిరి బిగపట్టినట్లు/ ఉడుకుతున్న కన్నీళ్ళతో ఉంటుంది/ అవతలి మనిషి మీద నమ్మక మున్నపుడే అందంగా నవ్వగలం' అంటారు. 'అడవికి ప్రేమికురాలినై/ ఋతుచక్రాన్ని మొలిపించుకునేందుకు/ నాకు కొన్ని గుడ్డముక్కలు కావాలి/ మరికొన్ని నాప్కిన్స్‌ కావాలిగా ఎరుపు సింధూరమే కాదు/ ఇక్కడ సిగ్గుబిళ్ళ కూడా..' పుట : 48. 'నీ దప్పిక చూపుల దాహం నాకెప్పటికీ గుర్తుంటుంది.
        ఔష్ట్రవతీవ ఱర ఎy రజూaషవ అంటూనే వెతుకులాట మొదలు పెట్టింది/ ఎక్కడా నాకంటూ చోటును సంపాదించుకోలేని పేద మనసు నాది' అంటున్నారు. 'నాకు కొన్ని మగపదాలు కావాలి...' ఎందుకు కావాలో తానే వివరిస్తున్నారు. 'సహజమైన వ్యక్తీకరణలు అదుపు చేయలేనపుడు/ నేను కొన్ని ఆయుధాలు సమకూర్చుకుంటాను/ వాటికై నాకు కొన్ని మగపదాలు కావాలి' పుట : 54. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు కనీస ధర్మాలను మర్చిపోతుంటే మాకు న్యాయమెలా జరుగుతుంది. అందుకే ఉరు డోంట్‌ వాంట్‌ జస్టిస్‌.. ఉరు వాంట్‌ పీస్‌.. అంటున్నారు ఈ కవయిత్రి. 'సమాన హక్కులు కల్పించలేని రాజ్యం/ విలువైన మానాలని కాపాడుతుందా/ న్యాయాన్ని కోరకండి ఎవ్వరూ/ శాంతిని పొందలేని మనిషి/ ఎప్పటికీ భ్రాంతిలో బతికెయ్యాలి.' పుట : 56. 'నేను సీతను కాదు సావిత్రిని, పతివ్రతను కాదు; పురుష సూక్తమా/ ఆటబొమ్మను కాదు, ఎవరూ స్పృశించని స్త్రీ కోణం నాది. ప్రతి స్త్రీవాదం కూడా నాదే..' అంటూ తన్ను తాను ధైర్యంగా నిర్వచించుకున్నారు. తనలో తన రచనలో ఉన్న స్త్రీ వాద దృక్కోణాన్ని సైతం నిజాయితీగా ప్రకటించుకున్నారు. అంతే కాదు, ఒక్కోసారి కరుడు కట్టిన తీవ్రవాదినై పోవాలన్న భావోద్రేకం ప్రకటించారు. 'హృదయ స్పర్శను కోరి, ప్రేమస్పర్శకు లొంగిపోతుంటాను' అన్నారు. 'నా అనుభవాలన్నీ చదవాల్సిన పుస్తకాలే/ అమ్మ చాటు బిడ్డను నేను/ బిడ్డను కన్న అమ్మను నేనే/ గడప దాటి గడుసు దాన్నైన/ ఆడను నేను/ పంజరంలో బిగుసుకున్న ఆమెను నేను..' పుట : 83.
        'ఒక్కోసారి గట్టిగా ఏడ్వాలనిపిస్తుంది/ గొంతు జీరబోయేలా అరవాలని పిస్తుంది/ ఒకప్పుడు కవి ఎలా ఉండేవాడు?/ వాన చినుకుల్ని తెచ్చి రైతును చేసేవాడు/ నీలిమబ్బుల్ని కమ్మి/ నేలకు పూసేవాడు/ పరిమళాన్ని కళ్ళకు, పరిసరాల్ని గుండెకు, అరువిచ్చేవాడు/ ఒకప్పుడు ఆ కవి తుపాకుల్ని/ ఎర్రపూల తోటలో నాటేవాడు/ ప్లవాన్ని చిగురించే మొలకల్లో చూసేవాడు/ తనకైన గాయాలే ఇతరులకు మందుగా రాసేవాడు/ తన గాయాలకు లేపనాన్ని/ తన అక్షరాల్లో దాచుకునేవాడు' పుట : 95. నదులు, కవులు ఈ భూగోళపు రక్త నాళాలు అని శేషేంద్ర గారంటే... 'నది నా దేశాన్ని కన్న అమ్మ/ నదిపై పేటెంట్‌ ఏ ఒక్క మతానిది కాదు/ మనుషులందరిదీ తెలుసా/ ఈ ప్రపంచం ఒక మహానది దేశాలన్నీ ఉపనదులు/ మీ ఊరు నా ఊరు పిల్ల కాలువలు సెలయేర్లు/ దేశమేదైనా పాదాలు ప్రవహించే/ నది కనిపిస్తే నమస్కరించు' అంటున్నారు సుభాషిణి. కవిత్వమంతా చదివి పుస్తకం మూసేసి కాసేపు కళ్ళు ముసుకున్నా 'కంపనం' కొనసాగుతూనే ఉంది. కవయిత్రి భావోద్వేగాల అలజడి, తుఫాను చిత్తడిలా ముసురు పట్టే ఉంది. కారణ మేమిటి? ఈ కవిత్వంలో అనుభూతుల కంటే గాయాల సలపరింతలే ఉండడం, కవితల్లోని సంభాషణాత్మక శైలి దృశ్యాలు దృశ్యాలుగా మారి ఆయా పాత్రలు కళ్ళ ముందు నిలబడతారు. ఆర్తీ, ఆవేదనా,ఆక్రోశం కలగలిసి నపుడు ఈ కవయిత్రి వీర ఫెమినిస్ట్‌ గా నాకు కనపడ్డారు.
        జి.లక్ష్మి నరసయ్య గారన్నట్లు.. 'స్త్రీ పురుష సంబంధాల్లో ఉక్క పోత సారమే.. వీరి కవిత్వం. ప్రసేన్‌ గారు.. యుద్ధభూమిలో పూలకొమ్మ అన్నారు. 'కొన్ని జ్ఞాపకాలు కళ్ళ చివరి సంతకాలు/ నేనూ కలా కవల పిల్లలం/ కాలమెప్పుడూ నాకు శత్రువే..' అంటారు కవయిత్రి. 'ఒకానొక పొద్దుటి పూట/ అతను కమ్మని కాపీ కప్పులా ఊరిస్తాడు/ మౌనంతో నిశ్శబ్దంలో/ నన్ను ఊరేగిస్తాడు/ గుబురు పొదల్లో గువ్వను చేసి పచ్చని పాట కడతాడు/ రాత్రి కలలను తురిమి/ రెప్పల కింద కాటుక వేస్తాడు' పుట : 70. నాకు వీరి సంభాషణాత్మక శైలి నచ్చింది. అనుభూతుల అంతర్వేదన మనం స్పష్టంగా వినగలం. ఒక్కోసారి ఉత్తుంగ తరంగంలా వీరావేశం ప్రదర్శిస్తారు. మరోసారి మలయ సమీరం లా చల్లగా స్పర్శిస్తారు. 'ప్రచ్ఛన్న యుద్ధం ఎక్కడో కాదు/ నాలోనే/ పర్లేదు../ నువ్వు అడవిని ప్రేమించు/ భరోసా నాది/ నీతో పాటు నా కలం నడిచొస్తున్నాది/ పుట:98. ఇలా తోట సుభాషిణి కవిత్వంలో పరవశం కంటే పదునే ఎక్కువ. జ్ఞాపకాల కంటే గాయాలే బదులిస్తాయి. అంతర్మథనం, ఆవేశం కలగలిసిన గరుకుదనం సుభాషిణి కవిత్వం.

- డా. రాధేయ
82475 23474