మన మాతృభాష తెలుగు నేడు సాక్షాత్తూ పాలకుల చేతనే నిర్లక్ష్యానికి, నిరాదరణకూ గురవుతోంది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తెలుగు రాష్ట్రంలో తెలుగుభాష మాధ్యమాన్ని మొత్తానికి ఎత్తేసి ఆంగ్లభాషా మాధ్యమంలోనే చదవాలని హుకుం జారీచేయడం ఎంతవరకు సమంజసం? ఇంటర్నేషనల్ లాంగ్వేజ్‌గా పేరొందిన ఆంగ్ల భాషను వద్దనే మొండి వాదన కాదిది. కానీ అసలు విద్యార్థి తెలుగు మాధ్యమంలో చదువుతానంటే నువ్వు చడవటానికే వీల్లేదు, ఒక సబ్జెక్ట్ అంతే అనటం అది మన రాజ్యాంగ నిర్దేశానికి వ్యతిరేకం. ఆంగ్ల భాష అవసరాన్ని గుర్తిస్తే విద్యార్థుల్లో ఆ భాషపట్ల పట్టును పెంచే ప్రయత్నం చేయాలేకాని, తెలుగును ఒక సబ్జెక్ట్‌గా మార్చటం విచారకరం. తెలుగు భాషా దినోత్సవాలు ఎందుకు జరుపు కుంటున్నామో మరొకసారి మననం చేసుకోవాలి.
అర్ధ శతాబ్దం క్రితం పండితులకు మాత్రమే పరిమితమైన తెలుగు ... వ్యవహారిక భాషగా అవతరించడానికి గిడుగు రామమూర్తి పంతులు చేసిన కషి ఎనలేనిది. తెలుగు ప్రాచీన భాషా హౌదాకు నోచుకున్నా నిర్లక్ష్య ధోరణులతో మరుగున పడుతుంది. 1863 ఆగస్టు 29 న జన్మించిన వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా సోమవారం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఐతే తెలుగు భాషాభివృద్ధికి మనమంతా ఎంతగా కృషి చేస్తున్నామన్నదే ప్రధాన విషయం. ప్రతి తెలుగు వాడు దేశభక్తితో పాటి తెలుగు భాషా వికాసానికి తమవంతు బాధ్యతను ప్రకటించుకోవల్సిన అత్యవసర సందర్భం నేడు ఏర్పడింది.
క్రీస్తుశకం ఒకటో శతాబ్దం నాటికీ శాతవాహన చక్రవర్తి హాలుడు తన 'గాధాసప్తశతి'లో తెలుగు పదాలు ప్రయోగించాడు. ప్రపంచ కథానికల్లో మొట్టమొదటిది గుణాఢ్యుడు రాసిన తెలుగు కథే. తెలుగు భాషలో ప్రతి ఉచ్ఛారణకీ ఓ ప్రత్యేకాక్షరం వుంది. పదం చివరలో అచ్చులు చేర్చుకునే సులువుండటం వల్ల ఏ భాషాపదాలైనా ఇట్టే సొంతం చేసుకోగల సత్తా తెలుగుకు ఉంది. అందుకే 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' అని హలెన్, దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఆకాశానికెత్తారు. మాతృభాష కన్నయితే ఇంగ్లీషు కళ్లజోడులాంటిదని ఎవరన్నారో కానీ ఆ మాట నూటికి నూరుపాళ్లు నిజం. అసలు కన్నంటూ వుంటేనే కదా కళ్లజోడుతో పనిపడేది.
అమ్మభాషలోనే ప్రాథమిక విద్యా బోధన చేపట్టాలని 'యునిసెఫ్' ఏనాడో దిశానిర్దేశం చేసింది. మాతృభాషలో బోధన సంగతి అలావుంచి మాట్లాడితేనే దండనలకు తెగబడే అరాచక సంస్క ృతి నేడు తిష్ట వేయటం నిర్ఘాంతపరుస్తున్న అంశం. తెలుగు బోధనా ప్రమాణాల పట్ల అనురాగం సైతం సన్నగిల్లుతున్న ధోరణి కనిపిస్తుంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక తమ మాతృభాషల్లో బోధన పాలనా విషయాల్లో ఎంతో పురోభివృద్ధిని సాధించాయి. తెలంగాణలో తెలుగును ఇంటర్మీడియట్ వరకూ మాధ్యమంగా ఉంచటం హర్షణీయమైనా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు చోటుచేసుకుంటున్నాయి. 2003 నాటికే ప్రభుత్వ ఉత్తర్వులు జీఓ 86 ప్రకారం అప్పటినుంచే ఆ రాష్ట్రంలో తెలుగు తప్పనిసరి అయ్యింది. అమలు మాత్రం అటకెక్కింది. ఉన్నత విద్యాస్థాయిలో సైతం ప్రాంతీయ భాషల్లోనే బోధన జరగాలని ఆరున్నర దశాబ్దాల క్రితమే రాధాకృష్ణన్ కమిషన్ సూచించింది. ఒకటిన్నర పుష్కరాల తరువాత ఆ వాదనకు కోఠారీ కమిషన్ ఓటేసింది. ఇన్నేళ్లు గడిచినా వాటికి మన్నన దక్కని పరిస్థితి మనది.
ఆధునిక కాలంలో తెలుగు భాష ప్రపంచ భాషల్లో పది ప్రధాన భాషల్లో ఆరవ స్థానంలో వుందని భాషా పరిశోధకుల అభిప్రాయం. భారతదేశంలో హిందీ మాట్లాడేవారి తరువాత తెలుగు భాష రెండవ స్థానంలో వుందని నిన్నటి వరకూ గర్వంగా చెప్పుకున్నాం కానీ ఈనాడు దేశంలో బెంగాలీ భాష రెండవ స్థానానికి చేరుకొందని భాషా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచంలోని 6 వేల భాషల్లో 3 వేల భాషలు మృతభాషలుగా మారాయని, కనుక మాతృభాషలకు రక్షించుకునేందుకు పూనుకోవల్సిందిగా 1999లో యునెస్కో హెచ్చరించింది. పరాయి భాషల ఆధిపత్య ధోరణుల వల్ల, వ్యామోహం వల్ల మాతృభాషలు మృతభాషలుగా మారుతున్నాయన్నది యథార్థ సత్యం. బ్రౌన్, వేమన, గిడుగు రామమూర్తి, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, మాహాకవి శ్రీశ్రీ, సినారె లాంటి వారు తెలుగు భాషకు చేసిన కృషిని కొనసాగించాల్సి ఉంది. మాతృభాష తల్లిపాల లాంటిది పరాయి భాష పోతపాల లాంటిదని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. తల్లి పాలతో పెరిగిన బిడ్డ బాగా ఆరోగ్యంగా ఉంటాడని శాస్త్రం చెబుతుంది. భారతదేశంలోని మిగతా భాషలపై కూడా ఈ ప్రపంచీకరణ ప్రభావం పడినప్పటికీ వారు తమ భాష అస్థిత్వాన్ని కోల్పోకుండా కాపాడుకోగలుగుతున్నారు. తెలుగు విషయంలో మాత్రం మనం వెనకబడిపోతున్నామనే విమర్శ కొంతకాలంగా వినపడుతోంది.
గ్రాంధిక, వ్యవహారిక భాషా భేదాలు రెండూ 20వ శతాబ్దం ఆరంభంలో తీవ్ర వాదోపవాదాలకు దారితీశాయి. కావ్య భాష మారదనీ దాన్ని మార్చకూడదనీ ఒక బృందమూ, శిష్టవ్యవహారంలో ఉన్న భాషా రూపాన్నే గ్రంధ రచనలో ఉపయోగించాలని మరో బృందమూ వాదించడంతో కవి పండితలోకం రెండుగా చీలిపోయింది. వ్యవహారిక భాషా ప్రయోగంలో వున్న సజీవత, సౌలభ్యాలను దృష్టిలో వుంచుకొని దాని వ్యాప్తికి నడుం కట్టుకున్న వారిలో ప్రథముడు గిడుగు రామ్మూర్తి పంతులు. ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిన గురజాడ సదా స్మరణీయులు. కొండల్లో, అడవుల్లో అనేక కష్టాలకు బాధలకు ఓర్చి 'సవరు'ల మధ్య ఏండ్లుగా జీవించి, సవరుల భాషను లిపి ఏర్పరచి, వాచకాలు రాసి, వారి విద్యాభివృద్ధికి కషి చేసిన గిడుగు భాషా సేవ అభినందనీయం. ఆయన పోరాటం ఫలితంగా అమల్లోకొచ్చిన వ్యవహారిక భాషే ప్రజలకు వెలుగు దారి చూపింది. భావ ప్రకటనకు పనికి వచ్చే మరెన్నో పదాలను కలుపుకుంటూ, సృష్టించుకుంటూ, పనికిరాని వాటిని విసర్జించుకుంటూ నిరంతర ప్రవహంలా సాగుతూ వచ్చిందే భాష.ఈ ప్రవాహ ఝరి కొనసాగుతూనే వుంటుంది ఇదే ఆధునిక భాషాలక్షణం కూడా.
''భాషే నేను తెచ్చుకున్న తియ్యని వరం..
భాషే నేను కట్టుకున్న జీవన గోపురం'' అని సినారె అన్నారు. ఎవరి మాతృభాషపట్ల వారు శ్రద్ధ వహించాలి. అది మరుగున పడిపోకుండా జాగ్రత్త పడాలి. మనిషి వ్యక్తిత్వ నిర్మాణానికి భాష ఎంతో అవసరం. ప్రచార ప్రసార మాధ్యమాల్లో తెలుగు వాడకాన్ని విస్తృత పరిచి జనజీవనంలో తెలుగును కాపాడుకోవడం కోసం సభలు, సదస్సులు, చర్చలకు నిత్యం భాషాభిమానులు నాంది పలుకుతూ వుండాలి. తెలుగు భాషను సమకాలీన అవసరాలను తీర్చగల స్థాయికి అభివృద్ధి చేసుకోవల్సిన అవసరం వుంది. ప్రజల్లో భాషాభిమానాన్ని పెంపు చేసుకునే సమగ్ర ప్రణాళికల్ని రచించాలి. రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలన్నీ తెలుగులోనే జరగాలి. కంప్యూటర్లలో తెలుగు సాఫ్ట్‌వేర్‌లను ప్రవేశపెట్టాలి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలి. జానపద సాహిత్యాన్ని సరళం చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి. ప్రాంతాల వారీగా మాండలిక పదకోశాలు రూపొందించి అమ్మ భాషను నేర్పించాలి. భాషాప్రాధికారిక సంస్థలు నెలకొల్పి భాషా విస్తతిని తెలిపే గ్రంధాల ఆవిష్కరణకు కృషిచేయాలి. మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు భాషా ప్రవహిస్తుంది. అందుకనుగుణంగా భాషా సరళిని ఆట పాటలుగా గానం చేయాలి. కోర్టు తీర్పులు, ఉత్తర్వులు తెలుగులో వెలువడాలి. కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలి. మాతృభాషపై మమకారం పెరిగేలా ప్రభుత్వం చర్యలు గైకొనాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పదజాలాన్ని ఎప్పటికప్పుడు తెలుగు భాషలోకి తర్జుమా చేయాలి. ఇలా విస్తృతంగా చాలా అంశాలలో అవసరమైన పద్ధతుల్లో తెలుగు భాషా వికాసాన్ని అందరం ప్రోది చేసుకోవాలి. అమ్మ ఒడిలో నేర్పే భాష బడిలో ఆలంబనై బతుకు బాటలో దివిటీగా మారి విరాజిల్లాలి. అటువంటి వాతావరణం కోసం తెలుగు భాషోధ్యమ కారులు, పాలకులూ కృషి చేయాలి. అప్పుడే తెలుగు భాషాభివృద్ధికి వెలుగుల అడుగులు పడతాయి.
('నేడు తెలుగు భాషా దినోత్సవం; వ్యవహారిక భాషా పితామహుడు 'గిడుగు' జయంతి)
- డా.కటుకోఝ్వల రమేష్
99490 83327










