వృక్షాలు కూలిపోయాయి
పక్షులింకా
పాటల్ని వెతుక్కుంటూ
నీడల చుట్టూ తచ్చాడుతూనే వున్నాయి
నదులు ఇంకిపోయాయి
మోకాళ్ళ మీద వంగి
నాలుకతో మూతిని నాక్కుంటూ
మేకపిల్లల గుంపొకటి
నీళ్ళ అలికిడి కోసం చూస్తోంది
ఇళ్లు ధ్వంసమైపోయాయి
గోడలింకా
మొండిగా నిలబడి
నేలను కాళ్ళ కింద దాచుకుంటున్నాయి
రోడ్లు శిథిలమైపోయాయి
మళ్ళీ ఇప్పట్లో చిగురించేలా లేవు
క్షతగాత్రుల కోసం వచ్చిన వాహనం
బురదలో ఇరుక్కుపోయింది
జీవితం రొదలో
ప్రపంచం యుద్ధాన్నెప్పుడో మరిచిపోయింది
సైనిక పటాలాలు రాలిపోయాయి
ఆయుధాలు మాత్రం
గురి చూసి పేల్చే చేతుల కోసం
ఎదురుచూస్తూనే వున్నాయి
తెలుసా -
నిరీక్షణా యుద్ధమే
కలలు బతికుండడం కూడా !
- సాంబమూర్తి లండ
96427 32008










