Jun 29,2023 07:29
  •  భగ్గుమన్న ఫ్రాన్స్‌ ప్రజానీకం
  •  సర్వత్రా నిరసనాగ్రహాలు
  •  క్షమించరాని నేరమన్న అధ్యక్షుడు మాక్రాన్‌

పారిస్‌ : పారిస్‌ నగర శివారైన నాన్‌టెరె ట్రాఫిక్‌ స్టాప్‌ వద్ద పోలీసులు మంగళవారం తెల్లవారు జామున 17ఏళ్ల వాహనదారుడిని అమానుషంగా కాల్చి చంపడంపై ఫ్రాన్స్‌ ప్రజలు భగ్గుమన్నారు. పారిస్‌తో సహా అన్ని ముఖ్యమైన పట్టణాలు నిరసనలతో హౌరెత్తాయి. పోలీస్‌ కాల్పుల్లో మరణించిన టీనేజర్‌ని నేల్‌ ఎం గా గుర్తించారు. మంగళవారం తెల్లవారు జామున నేల్‌ కారును ఆపాల్సిందిగా పోలీసులు ఆదేశించారని, అయినా పట్టించుకోకుండా కారును ముందుకు తీసుకెళ్లడంతో పోలీసులు కారు విండో గుండా నేల్‌పై కాల్పులు జరిపారని, బులెట్లు ఛాతిలోకి దూసుకుపోయిన కొద్ది సేపటికే ఆయన చనిపోయాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. కారులో డ్రైవర్‌ సీటులో ఉన్న నేల్‌పైకి అతి సమీపం నుంచి పోలీసులు కాల్పులు జరుపుతున్న చిత్రాలను బంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ వీడియోను తిలకించిన ఫ్రాన్స్‌ ప్రజలు పోలీసుల అమానుషత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేల్‌ను వెంబడించిన ఇద్దరు పోలీస్‌ అధికారుల్లో ఒకరు డ్రైవర్‌ సీటులో వున్న నేల్‌పై తుపాకీ గురిపెట్టి వుండడం స్పష్టంగా కనిపిస్తోంది. కాల్పుల్లో కుప్పకూలిన ఆ యువకుణ్ణి కాపాడేందుకు అత్యవసర సహాయక సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నేల్‌ హత్యకు నిరసనగా పారిస్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల కార్లకు నిప్పంటించారు. బస్‌ స్టాప్‌లను ధ్వంసం చేశారు. పోలీసులపైకి పేలుడు సామాగ్రిని విసిరేశారు. దాంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. గ్రెనెడ్లను ఉపయోగించారు.
మరింతగా నిరసనలు తలెత్తగలవన్న భయాలతో బుధవారం వేలాదిమంది పోలీసులను నగరంలో మోహరించారు. నేల్‌ హత్య తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఓ మహిళ వ్యాఖ్యానించారు. ఈ నిరసనల్లో ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఫ్రెంచి ఫుట్‌బాల్‌ స్టార్‌ క్లియాన్‌ బాపె పోలీసుల దాష్టీకాన్ని ఖండించారు. నేల్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నటుడు ఓమర్‌ సై పిలుపిచ్చారు.
ఫ్రెంచి పోలీసుల వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. గతంలో పెన్షన్‌ ఆందోళనల సమయంలోనూ వారు ఇలాగే దారుణంగా వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. గతేడాది కాలంలో ట్రాఫిక్‌ స్టాప్‌ల వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో 13మంది చనిపోయారు. ఈ ఏడాదిలోనే ఇలాంటి సంఘటన ఇది రెండవది.
'యావత్‌ దేశం కదిలిపోయింది' అంటూ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ ఈ సంఘటనపై వ్యాఖ్యానించారు. ఈ ఘటన క్షమించరానిదని ఆయన అన్నారు. . ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని, ప్రజలు శాంతంగా వుండాల్సిందిగా కోరారు. ప్రదర్శనల సందర్భంగా జరిగిన అల్లర్లకి సంబంధించి 31మందిని అరెస్టు చేశారు. ఈ ఘర్షణల్లో 25మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. మొత్తంగా 40కార్లు తగలబడ్డాయని చెప్పారు.కాల్పులు జరిపిన పోలీసు అధికారిని అరెస్టు చేశారు. హత్యా అభియోగాలు మోపినట్లు నాన్‌టెరె ప్రాసిక్యూటర్‌ కార్యాలయం తెలిపింది.