Jun 15,2022 09:35

నెత్తిన ఆకాశం నిర్మలంగా వుంది
ఎక్కడ వేసిన పనిముట్లు అక్కడే
నిశ్శబ్దంగా తొంగున్నాయి
పైసా సకిలింతలకు
అరువు వెక్కిరింతలకు
జుట్టు లాక్కుంటున్న రైతును చూసి
సెలక పకపకా నవ్వింది
విత్తు మొహం ఎరుగని ముంగారు
ఓ మూలకు ఒరిగిపోయి కూర్చునుంటే
నాగలి ఏకరవు పాట పాడింది
చుట్టని తలపాగాతో తల
బోసిపోయినట్టు కనిపిస్తుంటే
గంప కరువు రాగం ఆలపించింది
కూలికి వెళ్ళే కాళ్ళను మడిచినట్టు
నోటికెళ్ళే ముద్ద గొంతులో ఇరక్కపోతే
కుండ అంగలార్చింది
పై చూపులు తప్ప
నేల చూపు లేని రైతు కళ్ళల్లో
తటాకం తొణికిసలాడుతుంటే
చూరు మీద పెట్ట పెడరెక్కలేసింది
గింజల్తో పురుడోసుకోవాల్సిన నేల
ఒట్టి కడుపుతో మదనపడుతుంటే
పశువు చిత్రంగా ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చింది
వాన కార్తి కాళ్ళకు చక్రాలు కట్టుకుని
పరుగు పరుగున వస్తుంటే
రైతు గుండె వేగం పుంజుకుంది
గట్టి పడిన దుక్కి దుమ్మును మీదేసుకుని
రాయి రప్పను కప్పుకుని వుంటే
ఏరువాక ఏకరువు పెట్టుకుంది
సదును చేయని చేను సెలకను
అదును దాటిన విత్తు పూడికను
పీకల దాకా భరిస్తూ
సాయానికై ఏలిక వైపు రైతు
రెండు చేతులు చాస్తూ నిలబడి వుంటే
సెలక పగలబడి నవ్వేసింది.
 

- నరెద్దుల రాజారెడ్డి
సెల్‌ : 9666016636