Oct 03,2022 07:44

నేనేమో పారవశ్యంతో
కన్నులు విప్పార్చి నిన్నే చూస్తుంటానా
ఎవరో నల్లని మేఘాల్ని
నా ముందు నుంచే తోసుకెళ్తుంటారు

నేనేమో ప్రవాహంలా
నీ దగ్గరకే వడివడిగా పరిగెత్తుకొస్తుంటానా
భావావేశానికడ్డుపడతూ
కాళ్ళకెవరో గుదిబండల్ని తగిలిస్తుంటారు

నేనేమో మౌన సంగీతంలా
నీ స్వరాన్నే సాధన చేస్తుంటానా
గార్ధబాలేవేవో
అపస్వరాల్ని జతకలుపుతుంటాయి

అయినా నువ్వెక్కడున్నా
నేనిక్కడెలా ఉండగలను చెప్పు
కట్టెనిక్కడే మిగిల్చి
నీ కంటిపాపలోనే దాగిలేనా !

- దార్ల వెంకటేశ్వరరావు