Jun 24,2023 13:45

మాస్కో : ప్రైవేటు మిలటరీ గ్రూప్‌, రష్యా సైన్యంపై దాడులకు పాల్పడుతోంది. శుక్రవారం రాత్రి నుంచి జరుగుతున్న వరుస దాడుల వల్ల రష్యావ్యాప్తంగా అల్లకల్లోల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌ మీడియాతో మాట్లాడనున్నట్లు క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ టాస్‌ అనే న్యూస్‌ ఏజెన్సీకి వెల్లడించారు.
కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో వాగర్‌ ప్రైవేట్‌ మిలటరీ గ్రూప్‌ సైనిక నియంత్రణను తన చేతుల్లోకి తీసుకుంటోందని అమెరికన్‌ బేసిక్‌ టెలివిజన్‌ ఛానెల్‌ సిఎన్‌ఎన్‌ వార్తల్ని ప్రసారం చేస్తోంది. ఇప్పటికే రోస్టోవ్‌ ఆన్‌-డాన్‌లో ఉన్న వైమానిక కేంద్రాల్లోని సైనిక సౌకర్యాలను మిలటరీ గ్రూప్‌ తన నియంత్రణలోకి తీసుకుందని సిఎన్‌ఎన్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రోస్టోవ్‌లోని సైనిక శిబిరంపై దాడి చేసి భారీ సంఖ్యలో సైనికులను హతమార్చినట్లు వాగర్‌ మిలటరీ గ్రూప్‌ చీఫ్‌ యెవ్వెనీ ప్రిగోజిన్‌ తన టెలిగ్రామ్‌లో వరుస సందేశాలిచ్చినట్లు సిఎన్‌ఎన్‌ తెలిపింది. ఈ సందర్భంగా ప్రిగోజిన్‌ 'మేము ఉదయం 7.30 గంటల సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్నాము. రోస్టోవ్‌లోని సౌనిక సౌకర్యాలు, వైమానిక కేంద్రాలు మా నియంత్రణలో ఉన్నాయి' అని ఆయన తన టెలిగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో పేర్కొన్నారు. అలాగే ఈ వీడియోలో 'యుద్ధ విమానాలు, వైద్య విమానాలు యధావిధిగా బయలుదేరుతాయి. ఉక్రెయిన్‌ మాపై దాడి చేయకుండా ఆ దిశలో సైన్యాన్ని నియంత్రణలోకి తీసుకున్నాము. అలాగే రోస్టోవ్‌లోని పాలనా కేంద్రంలోని అధికారులను తమ విధులను చేసేందుకు అనుమతినిచ్చాము.' అని ఆయన అన్నారు. రష్యా మిలటరీ వ్యతిరేకంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రిగ్జోన్‌ ఈ సందర్భంగా తెలియజేశారు.