Jun 24,2023 22:30

సాయుధ తిరుగుబాటుకు యత్నం
సోషల్‌ మీడియాలో ఆడియో, వీడియో క్లిప్పింగ్స్‌ వైరల్‌
కుట్రలను ఐక్యంగా తిప్పికొడదాం: జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో పుతిన్‌
బాసటగా చెచెన్యా, కజకిస్తాన్‌, బెలారస్‌ తదితర దేశాలు

మాస్కో: రష్యా దక్షిణ ప్రాంత నగరమైన రొస్తోవ్‌ అన్‌ డాన్‌లో యెవెగిన్‌ ప్రిగోజిన్‌ నాయకత్వంలోని వాగర్‌ ప్రైవేట్‌ మిలిటరీ గ్రూపు శుక్రవారం సాయుధ తిరుగుబాటుకు యత్నించింది. తమ స్థావరాలపై రష్యన్‌ ఆర్మీ రాకెట్‌ దాడులు చేసిందని, దీనికి ప్రతిగా తాము సాయుధ తిరుగుబాటుకు పాల్పడినట్లు వాగర్‌ గ్రూపు బాస్‌ ప్రిగొజిన్‌ తన టెలిగ్రామ్‌ చానెల్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. రొస్తోవ్‌ అన్‌ డాన్‌ ప్రాంతంలో యూనిఫాం దుస్తులు ధరించిన సైనికులు గస్తీ తిరుగుతుండడం, ఇంధన ట్యాంకు దగ్ధం వంటి దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యూనిఫాంలో ఉన్న సైనికులు ప్రైవేట్‌ మిలిటరీ కంపెనీ (పిఎంసి) వాగర్‌ కు చెందినవారా? లేక రష్యన్‌ ఫెడరేషన్‌ ఆర్మీకి చెందినవారా అనేది ఇదమిత్థంగా తెలియరాలేదు. వాగర్‌ గ్రూపు అధిపతి ప్రిగొజిన్‌ చర్యను రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ తీవ్రంగా పరిగణించారు. శుక్రవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రైవేట్‌ మిలిటరీ కంపెనీ (పిఎంసి) వాగర్‌ చర్యను 'వెన్నుపోటు', 'ద్రోహం' గా అభివర్ణించారు. తిరుగుబాటు యత్నాన్ని చెచెన్‌, కజకిస్తాన్‌, బెలారస్‌ తదితర రిపబ్లిక్కుల నేతలు తీవ్రంగా ఖండించారు.రష్యాకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఉక్రెయిన్‌, బ్రిటన్‌ నేతలు రొస్తావ్‌ అన్‌ డాన్‌లో పరిణామాలను గమనిస్తున్నామని అన్నారు. అవసరమైతే సంకీర్ణ భాగస్వాములతో దీనిపై చర్చిస్తామని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రైవేట్‌ మిలిటరీ గ్రూపు వాగర్‌ తిరుగుబాటు యత్నం నేపథ్యంలో మాస్కో సిటీ, మాస్కో రీజియన్‌, వొరొనెజ్‌ రీజియన్లలో కౌంటర్‌ టెర్రరిస్టు రిస్క్‌ ఆపరేషన్‌ను చేపట్టాలని రష్యన్‌ నేషనల్‌ యాంటీ టెర్రరిస్టు కమిటీ శనివారం ఆదేశించింది. వాగర్‌ గ్రూపు దళాలు ఇంకెంత మాత్రం జాప్యం లేకుండా రష్యన్‌ సైన్యానికి లంగిపోవాలని, అలా లంగిపోయిన ప్రతి ఒక్కరి రక్షణకు గ్యారంటీ ఇస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చెచెన్యా రిపబ్లిక్‌ అధ్యక్షుడు రంజాన్‌ కద్రిరోవ్‌ శనివారం టెలిగ్రామ్‌లో ఒక పోస్ట్‌ పెడుతూ, ఉద్రిక్తత నెలకొన్న రొస్తావ్‌ అన్‌డాన్‌ ప్రాంతం దిశగా రష్యన్‌ నేషనల్‌ డిఫెన్స్‌, చెచెన్‌ రిపబ్లిక్‌ నేషనల్‌ కోస్ట్‌ గార్డు దళాలు దూసుకెళ్తున్నాయని తెలిపారు.
అంతర్గత విభేదాలు పక్కన పెట్టి
బాహ్య శత్రువుపై ఐక్యంగా పోరాడుదాం: పుతిన్‌
రష్యా భవిష్యత్తు కోసం నియోనాజీలు, వారి యజమానులతో భీకర పోరు సాగిస్తున్న సమయంలో వాగర్‌ గ్రూపు తిరుగుబాటుకు యత్నించడం ఈ పోరాటానికి వెన్నుపోటు పొడవడమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. పశ్చిమ దేశాలు మిలిటరీ, ఆర్థిక, సమాచార యంత్రాన్ని మొత్తం శక్తిని రష్యాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన ఈ తరుణంలో జాతీయ ఐక్యత చాలా ముఖ్యమని అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ , రష్యన్ల మధ్య చీలిక తెచ్చే శత్రువుల ఎత్తులను చిత్తు చేయాలన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం మధ్యలో అంటే 1917లో ఇదే విధమైన దృష్టాంతం చోటుచేసుకుందని పుతిన్‌ గుర్తు చేశారు. కుతంత్రాలు, గొడవలు, వెన్నుపోటు రాజకీయాలు ఎలా పతనానికి దారి తీశాయో వివవరించారు. రష్యన్లు రష్యన్లనే చంపుతున్నారని, భ్రాతృ హత్యలకు పాల్పడుతున్నారని విదేశీ శక్తులు మనపై విష ప్రచారం చేసేందుకు అవకాశమివ్వరాదని అన్నారు. కొంత మంది వ్యక్తులు తమ వ్యక్తిగత ఆశలు, ఆసక్తుల కోసం దేశానికి, దేశ ప్రజలకు ద్రోహం తలపెడుతున్నారని ప్రిగోజిన్‌నుద్దేశించి అన్యాపదేశంగా ఆయన పేర్కొన్నారు. అంతర్గత తిరుగుబాటు రష్యా ప్రజలకు, దేశానికి ప్రమాదకరమని అన్నారు.తిరుగుబాటుకు యత్నించిన వాగర్‌ గ్రూపు బాస్‌ పై క్రిమినల్‌ విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు పుతిన్‌ తెలిపారు. మాస్కోలోను, ఇతర ప్రాంతాల్లోను ప్రత్యేక యాంటీ టెర్రరిస్టు ప్రోటోకాల్‌ అమలు చేయనున్నామన్నారు. ప్రసంగం ముగింపులో దేశాన్ని రక్షించేందుకు, రాజ్యాంగ క్రమాన్ని , జీవన భద్రతను, పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు తాను చేయగలిగిందంతా చేస్తానని పుతిన్‌ హామీ ఇచ్చారు.