సామాన్య జనాల కోసం కథలు రాసిన పేదల పెన్నిధి రాచకొండ విశ్వనాధ శాస్త్రి. తన భావాల్ని, అభిప్రాయాల్ని తనదైన ధోరణిలో నిర్మొహమాటంగా, నిర్భయంగా కొండ బద్దలు కొట్టినట్లు చెప్పగలిగిన ధీశాలి.
ప్రభుత్వం సారా నిషేధించే కాలంలో దొంగ సారా వ్యాపారం మంచి జోరుగా సాగేది. కొందరు బడా నాయకులు వెనక వుండి నడిపిస్తారు. ప్రభుత్వ యంత్రాంగం అండదండలు, సహాయ సహకారాలు, వెనక నుంచి పుష్కలంగా వుంటాయి. సారా నిషేధ జీవోలు తెచ్చేది, ఇప్పించేది నాయకులే. సారాను దొంగచాటుగా బినామీ పేరుతో అమ్మేది నాయకులే, దొంగ సారాతో సమాజాన్ని నాశనం చేసేది నాయకులే. అనుకోకుండా పోలీసులకు పట్టుబడితే జైలుశిక్ష అనుభవించడానికి అమాయకులకు డబ్బు ఇచ్చి రిక్రూట్ చేసుకునేవారు. సారా వ్యాపారం వల్ల అమాయకులు బలి అయ్యేవారు. ఇలాంటి వ్యవస్థపై ధ్వజమెత్తి, ఎదురు తిరిగి, తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన మహామనీషి రావిశాస్త్రి. ఆయన రాసిన ఆరు సారా కథలు చాలా ప్రసిద్ధి చెందాయి.
శాస్త్రి గారి వచన రచనా విధానం ప్రత్యేకమైంది. విలక్షణమైంది. పాపి, మాయ, న్యాయం, మోసం, పుణ్యం, మోక్షం అనే ఆరు సారా కథలు రాశారు ఆయన. అన్నీ సారా ఇతివృత్తం కలిగిన కథలే అయినప్పటికీ ఈ కథల్లో అనేక ముఖ్యమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ఈ కథలను నిశితంగా అధ్యయనం చేస్తే పెట్టుబడిదారీ విధానం కన్పిస్తుంది. మనకు కన్పించేది పైపైకి సారా వ్యాపారమైనా, ఇందులో అనేక ఆర్ధిక లావాదేవీలు వుంటాయి. ఈ కథల్లో దొంగతనంగా సారా తయారు చేయడం, కొనడం, అమ్మడం, లాభం, నష్టం మొదలైన అంశాలు వుంటాయి. సామాన్య ప్రజలను, పేద ప్రజలను ఏదో ఒక రకంగా బడా నాయకులు, దోచుకోవడం కన్పిస్తుంది. సారా నిషేధం వున్నా, తెర వెనుక బినామీ పేర్లుతో నాయకులు సమాజాన్ని ఎలా దోచుకు తింటారో ఈ కథల్లో మనం చూడవచ్చు.
'పాపి' కథలో రామదాసు, నీలయ్య; 'మాయ' కథలో ముత్యాలమ్మ, పెద్ద ప్లీడరు, మూర్తి లాయరు; 'న్యాయం' కథలో ముద్దాయి అమ్మయి (పేరు లేదు); 'మోసం' కథలో రాకెట్ అప్పారావు, గురయ్య; 'పుణ్యం' కథలో పోలమ్మ, లంపెన్ ప్రోలిడేరియట్, కరుణాకరం, కథ చెప్పిన పాత్ర; 'మోక్షం' కథలో మేజిస్ట్రేట్ ముఖ్యమైన పాత్రలు. ఏకకాలంలో పాఠకునికి విభిన్న రసాల వల్ల కలిగిన అనుభూతికి శ్రీశ్రీ 'రసన' అని పేరు పెట్టారు. అలాంటి 'రసన'ను ఈ సారా కథలు తనకు కలిగించినట్లు చెప్పారు. 'పాపి' కథలో రామదాసు ప్రతిజ్ఞ, 'మాయ' కథలో ముత్యాలమ్మ ప్రసంగం, 'న్యాయం' కథలో ముద్దాయి అమ్మాయి ఆక్రందన, 'మోసం' కథలో రాకెట్ అప్పారావు ఉపదేశం, హెడ్ కానిస్టేబుల్ ఉపన్యాసం, సాహితీ శిఖరాలుగా పేర్కోదగ్గవని శ్రీశ్రీ అభిప్రాయపడ్డారు.
1. పాపి : ఈ కథలో ప్రధాన పాత్రలు రామదాసు, నీలయ్య. సారా వ్యాపారంలో వున్న దగుల్బాజీతనానికీ, దౌర్జన్యానికి ఈ ఇద్దరూ మంచి ఉదాహరణ. రాజకీయ నాయకులు ఊళ్ళను పంచుకున్నట్లే, ఈ ఇద్దరూ ఒకటై ఊరిలోని, బజార్లను పంచుకొని ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటూ హాయిగా, ఆనందంగా బతుకుతారు. రామదాసు తూర్పు ప్రాంతాన్ని, నీలయ్య పడమటి ప్రాంతాన్ని పంచుకొని సారా వ్యాపారాన్ని సాగిస్తారు.
రామదాసు బతుకే దొంగ బతుకు. ఇతని జీవితమే పెద్ద మాయ. జీవితాంతం మాయతోనే బతుకుతాడు. ఇతని జీవితం రంగునీళ్ళు అమ్మడంతో ప్రారంభమవుతుంది. చేయరాని ఎన్నో చెడు వ్యాపారాలను చేశాడు. చివరకు దొంగసారా వ్యాపారం చేసి పెద్దవాడు అవుతాడు. ఊరిలో సారా ముఠా నాయకుడిగా చలామణి అవుతాడు. నీలయ్య కేటుగాడు. చిప్పలు కడుక్కుంటూ బతికేవాడు. దొంగల గూర్చి పోలీసులకు సమాచారం ఇచ్చి కొన్నాళ్ళు బతికాడు. కోర్టుల్లో దొంగ సాక్ష్యాలు చెప్పాడు. డబ్బు కక్కుర్తితో బాగా డబ్బు వున్న, పూర్తిగా ఆరోగ్యం క్షీణించిన ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. ఆమెకి విషం పెట్టి చంపేస్తాడు. ఆమె డబ్బును తాను స్వంతం చేసుకుంటాడు. చివరకు సారా ముఠా నాయకుడుగా వుంటాడు.
వీళ్ళద్దరి వల్ల ఊరంతా అన్ని స్థలాల్లో, ఊరంతా సారా చకచకా సరఫరా ఔతుంది. ఈలోగా ఊరిలోకి 'కార్నివాల్' వస్తుంది. దానితో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. రామదాసు భార్య నూకాలమ్మ 'కార్నివాల్'కి వెళుతుంది. నీలయ్య మనుషులు నూకాలమ్మను దీపాలార్పేసి మరీ అల్లరి చేస్తారు. నూకాలమ్మ పొందిన అవమానం ద్రౌపది వస్త్రాపహరణం లాంటి అవమానం. దాని ఫలితంగా నీలయ్య శివరాత్రినాడు హత్య గావించబడతాడు. 'మరైతే ఆడు... ఆడు... ఆ లంజి కొడుకు ఆ నీలయ్యగాడు. ఆడా పాపాలన్నీ ఏటైనట్టు?' అని రామదాసు ప్రశ్నతో కథ ముగుస్తుంది.
2. మాయ : ఈ కథలో ప్రధాన పాత్ర ముత్యాలమ్మ. కూలిపని చేసుకుంటూ బతికేది. ఎక్కువ లాభాల కోసం సారా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతుంది. పెద్దలకు, పోలీసు వాళ్ళకు కావలసినంత లంచాలు ఇస్తూ వ్యాపారం చేస్తూ వుంటుంది. ఎన్నో సార్లు కోర్టుకు వెళుతుంది. కోర్టులో బాగా వాదించడానికి పెద్ద పెద్ద ప్లీడర్లను పెట్టేది. పరిస్థితులు మారి, సారా వ్యాపారంలో పోటీ ఎక్కువైపోతుంది. వ్యాపారంలో నష్టం వస్తుంది. పోలీసులే తెర వెనుక నుంచి దొంగ సారా వ్యాపారాన్ని చక్కగా నడిపిస్తారు. ముత్యాలమ్మ దగ్గర డబ్బులు వుండవు. బతుకు చిందరవందర అవుతుంది.
ఈ పరిస్థితుల గురించి ఆమె పూచగుచ్చినట్లు మూర్తి లాయరుతో మాటలాడుతుంది. ''ఈ సారా యాపారంలోకి దిగిన తరువాత బాబూ! నాకెన్ని యిసయాలు తెలిసొచ్చినాయో సరీ సెప్పలేను, ప్లీడరు బాబూ! సెప్తున్నాయిను. నువ్వే కాదు ఈ బాబే కాదు, ఏ మనిషి మంచోడని ఒవురు చెప్పినా నాను నమ్మను. ఈ లోకం డబ్బూ యాపారం తప్ప మరేట్నేదు. డబ్బు కోసం నోకం నోకవంతా పడుచుకొంటోంది. డబ్బుకు నాను సారా అమ్ముతున్నాను. డబ్బుకు సదివిన సదువంతా నువ్వమ్ముతున్నావు. డబ్బుకి పోలీసోళ్ళు న్యాయన్నమ్ముతున్నారు. మందుకోసం పెద్దాసుపత్రికెళ్తె అక్కడ మందులమ్ముతున్నారు. మంచాలమ్ముతున్నారు. లంజెలు రోడ్లంట, రిచ్చాలంట, కార్లంట తిరిగి ఒళ్ళమ్ముకుంటున్నారు'. అంటుంది. ఇలా ముత్యాలమ్మ పాత్ర ద్వారా కథకుడు సమాజంలోని లొసుగులను బట్టబయలు చేశారు.
3. న్యాయం : ఈ కథలో ముద్దాయి అమ్మాయి, మెజిస్ట్రేటు ముందు కోర్టులో చెప్పిన మాటల్లో గూడుకట్టుకున్న వేదన రోదన చాలా స్పష్టంగా కన్పిస్తుంది.
4. మోసం : 'మోసం' కథలో ప్రధాన పాత్రలు గురయ్య, రాకెట్ అప్పారావు. గురయ్య ప్రారంభంలో సారా కూలీలకు పైలట్‌గా వుండేవాడు. ఇతని వల్ల అనేకమంది కూలీలు జైలుకు కూడా వెళతారు. గురయ్య తరువాతా కాలంలో స్వంతంగా సారా వ్యాపారం చేస్తాడు. అందులో చాలా నష్టాలు వస్తాయి. రాకెట్ అప్పారావు నమ్మక ద్రోహి. అడ్డదారులు తొక్కి అయినా, షావుకారు అవదామని అనుకుంటాడు. ఎవరి దగ్గర కూలీగా వుంటాడో, ఆ యజమాని గురయ్యనే మోసం చేసిన దుల్బాజీగాడు. ఆ డబ్బుతో స్వంతంగా సారా వ్యాపారం ప్రారంభిస్తాడు.
రాకెట్ అప్పారావు ఈ కథలో గురయ్యకు చేసిన హితబోధ చెప్పుకోదగ్గది. 'నువ్వెర్రి పీరువి. బావుపడే నచ్చనాలు నేవంటే నేవు. నువ్వు బావుపడాలంటే శిశువుని గురువుకి బోధ చేస్తున్నాను. ఇనుకో నువ్వే కాదు నోకంలో ఎవరూ ఈ రోజుల్లో బావుపడాలన్నా డబ్బుండాలి. మాయుండాలి. దబాయింపు సెక్షనుండాలి. బోధ పడిందా? డబ్బులో దేవుడున్నాడు' అని అంటాడు. ఈ కథలో పోలీసు కానిస్టేబుల్ స్వగతంగా మాటలాడిన మాటలు, పోలీసు డిపార్ట్‌మెంటుకు, ప్రభుత్వంకు సంబంధించిన అనేక పచ్చి నిజాలకు నిలవుటద్దం.
5. పుణ్యం : ఈ కథలో పోలమ్మ సారా వ్యాపారం వల్ల పూర్తిగా పతనమవుతుంది. కారణం సారాతో పోలీసులకు దొరికిపోతుంది. పోలీసులు పోలమ్మ పేదరాలని కనికరించి ఆమెపై కేసు పెట్టరు. దొరికిన దొంగ సారాను కావాలని ఆమెతోనే పోలీసులు నలభై రూపాయలకు అమ్మిస్తారు. ఇరవై పోలీసులు తీసుకుని, మిగతా ఇరవై కోర్టులో జరిమాను కట్టిస్తారు. ఇక్కడ పోలీసులు, గవర్నమెంటు వారు బాగుపడతారు. పోలమ్మ బతుకు గుండు సున్నా అవుతుంది. పోలీసుల తీరుతెన్నులు ఎలా వుంటాయో ఈ కథలో అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులో సంభాషణలు ఎక్కువగా కరుణాకర అనే లాయర్‌కూ, కథ చెప్పిన పాత్రకు మధ్య జరుగుతాయి. 'లోకంలో పాపపుణ్యాలు లేవు. లాభనష్టాలే ఉన్నాయి' 'లోకంలో మనుషులున్నారు. పుణ్యాత్ములంటూ ఎవరూ లేరు'. అన్న మాటలు మనకు గుర్తుండిపోతాయి.
6. మోక్షం : ఈ కథలో ఆరు వేలకు పైగా సారా కేసుల్లో తీర్పులు జెప్పి జెప్పి చివరకు ఒక మేజిస్ట్రేటుకు పిచ్చెక్కుతుంది. అతడు గవర్నమెంటు పిచ్చాసుపత్రిలో ప్రవేశిస్తూ 'మర్చిపోయాను. గవర్నమెంటుకి పాపం పిచ్చెక్కింది కదూ? ఎలా ఉందో ఏమిటో పదండి చూద్దాం' అంటూ పిచ్చాసుపత్రిలో జాయినవుతాడు. న్యాయవ్యవస్థలోని లోపాలను, లొసుగులను కథకుడు బట్టబయలు చేస్తారు ఈ కథలో. ఈ సమాజంలో కోర్టుల పని తీరు ఎలా వున్నాయో? మెజిస్ట్రేట్‌లు ఎలా వున్నారో? తీర్పులు ఎలా వున్నాయో? అన్నీ చాలా వివరంగా చెప్పుతాడు రావిశాస్త్రి.
ఈ కథల్లో సారా వ్యాపారులు, దొంగలు, పీడిత ప్రజలను మోసం చేసే నాయకులు, పోలీసులు, ప్లీడర్లు, మెజిస్ట్రేటులు మొదలైనవారు వుంటారు. ఎవరి ధోరణి వారిది. ఎవరి దోపిడి వారిది. అందరూ సమాజాన్ని పీక్కు తిన్నవారే, జుర్రుకున్నవారే. వీళ్ళ దగ్గర న్యాయం అన్యాయంగా మారుతుంది. కారణం కోర్టులో నిజానికి తావు వుండదు కాబట్టి. కేవలం సాక్ష్యాలే పరమ ప్రామాణికం కాబట్టి. సాక్ష్యాలను డబ్బుగలవారు సృష్టించగలరు. తమ్మిని బమ్మిని చేయగలరు. పేదవాళ్ళు ఏమి చేయగలరు.
ఈ విషయాలన్నీ కోర్టు వారికి తెలుసు. అయినా వారు పేదవాళ్ళకు న్యాయం చేయలేరు. వాళ్ళకు సాక్ష్యాలే ముఖ్యం. మనిషి ఎంత నీచానికైనా దిగజరుతాడు అనే దానికి ఈ సారా కథల్లోని పాత్రలు ఉదాహరణ. ఇలాంటి సజీవ పాత్రలను సృష్టించారు కాబట్టే రావిశాస్త్రి గొప్ప కథకులు అయ్యారు. అందుకే కె.వి. రమణారెడ్డిగారు 'మళ్ళీ మళ్ళీ చదివించి కూడా ఇంకోమారు చదివితే బావుణ్ణని అనిపించే రచన మంచి రచన. రావిశాస్త్రి ఆరు సారా కథలు అలాంటి వాటికొక తార్కాణం' అని అన్నారు. ఇది నిజం.
(జులై 30 : రావిశాస్త్రి జయంతి)
- ఆచార్య వెలమల సిమ్మన్న
94406 41617










