Jun 24,2023 12:33

మాస్కో : రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం ఏడాదికిపైగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యాకి పుతిన్‌ సైన్యంతోపాటు, వాగర్‌ ప్రైవేటు మిలిటరీ గ్రూపు అండగా నిలబడ్డాయి. అయితే ప్రస్తుతం ఈ రెండింటిటి మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. తాజాగా వాగర్‌ ప్రైవేటు మిలిటరీ గ్రూపు, రష్యా సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు తెగబడింది. రష్యా రక్షణ మంత్రిపై ఆగ్రహంతో ఉన్న వాగర్‌ మిలటరీ గ్రూపు శుక్రవారం పలు నగనరాల్లో దాడులు చేసింది. దీంతో అక్కడ సెక్యూరిటీ పెంచేశారు. ఇంటర్నెట్‌ను కూడా కొన్ని ప్రాంతాలకే అధికారులు పరిమితం చేశారు.
కాగా, మాస్కో నాయకత్వాన్ని కూల్చివేస్తానని వాగర్‌ గ్రూప్‌ చీఫ్‌ యెవ్జెనీ ప్రమాణం చేశారు. దీంతో మిలటరీ గ్రూపు దాడులకు తెగబడుతుందనే ఆందోళనలో అధికారులు రాజధాని మాస్కోతో సహా పలు ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే తమకు అందిన సమాచారం మేరకు మాస్కోలో ఇన్‌కమింగ్‌ సమాచారానికి సంబంధించి భద్రత మరింత పటిష్టం చేస్తున్నామని, ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ప్రారంభించామని మాస్కో మేయర్‌ సెర్గి సోబియానిన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దక్షిణ రష్యాలోని రోస్టోవ్‌, లిపెట్స్క్‌ అనే పరిపాలనా కేంద్రాల వద్ద కూడా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే రోస్టోవ్‌ అధికారులు నివాసితులందరినీ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. అయితే వాగర్‌ చర్యకు వ్యతిరేకంగా ఎఫ్‌ఎస్‌బి (ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌) క్రిమినల్‌ కేసును పెట్టనుంది. అతన్ని అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకోనుంది.