- అభివృద్ధి చెందిన దేశాలకు చైనా విజ్ఞప్తి
జెనీవా : బ్రిటన్‌తో సహా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు వలసదారుల హక్కులను ఉల్లంఘించడంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. వారి హక్కులను సమర్ధవంతంగా కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ దేశాలను కోరింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 53వ సమావేశంలో ఈ మేరకు చైనా ఒక ప్రకటన జారీ చేసింది. బాగా చదువుకున్న, అత్యంత నైపుణ్యాలు కలిగిన వలసదారుల వల్ల కలిగే ప్రయోజనాలను కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు పొందుతున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. అయితే ఈ దేశాలు, అంతర్జాతీయంగా వలసదారులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో బృహత్తర పాత్ర పోషించడానికి బదులుగా దేశీయంగా వలసదారుల హక్కులను ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ శరణార్ధుల., ఇమ్మిగ్రేషన్ సంక్షోభానికి చోదక శక్తిగా మారుతున్నాయని చైనా విమర్శించింది. ఆశ్రయం కోరుతూ వచ్చిన వారిని బ్రిటన్ ఇతర దేశాలకు పంపడం ఆందోళన చెందే విషయమని ఆ ప్రకటన పేర్కొంది. దేశంలో ఇలా ఆశ్రయం కోరుతూ వచ్చే పిల్లల ఆచూకీ గల్లంతయ్యే ప్రమాదముందని, వారిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించే ముప్పు పొంచి వుందని ఆ ప్రకటన హెచ్చరించింది. దీనిపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి, అనుబంధ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని పేర్కొంది. వెంటనే, అక్రమ ఇమ్మిగ్రేషన్ బిల్లును అత్యవసరంగా సవరించాల్సిందిగా ఇటీవల బాలల హక్కులపై ఐక్యరాజ్య సమితి కమిటీ బ్రిటీష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇతర దేశాలు కూడా ఈ విషయంలో ఉల్లంఘనలు విడనాడాలని, మైగ్రేంట్ల హక్కులను కాపాడే చర్యలు తీసుకోవాలని కోరింది. a










