కోడి పిల్లలు తోడు పిల్లలై
దిక్కులన్నిటిలో నాటిన
అమరావతి హక్కుల మొక్కలు
కాపు కాయకుండా గింజ పట్టకుండా
కాకిలలో దూరిన గద్దలు
ధర్మ దేవత తీర్పునే పొడిచి పొడిచి
నెత్తుటి గడ్డలు రాలుస్తుంటే
ప్రతిపక్షులు కొన్ని ప్రజాస్వామ్య గానం
గొంతు చించుకు ఆలపించాయి
విశాఖ ఉక్కు, నెల్లూరు థర్మల్ విద్యుత్తులో
చీమలు సాగించే పోరుపై
ఢిల్లీ పాములు బుస కొడుతూ
పక్కపక్కలకు పడగలు తిప్పి
కాటు మీద కాటు వేస్తుంటే
అమరావతి ప్రజాస్వామ్య ప్రతిపక్షులు
గాయం చూడకుండా ఏ గానం లేకుండా
ఢిల్లీ బావుల్లో తానమాడుతూ
కమలారాధన చేస్తూ కూడా
అవి 'ప్రజా'స్వామ్య గానం చేస్తున్నాయా?
కార్పొరేట్ల ధ్యానంలో తల దూర్చాయా?
అక్కడా ఇక్కడా ప్రజదే పోరు
ఒకచోట ప్రజాగానం మరోచోట మౌన రాగం
ఏ నీతికీ ఏ గీతకీ నిదర్శనం?
'ప్రజా' గానంపై కోకిలకుండే హక్కు
కాకులు పోటీకి దిగితే దక్కుతుందా?
ఏ రోటికాడ ఆ పాట పాడితే
అది ప్రజాస్వామ్య గీతమౌతుందా ?
- ఉన్నం వెంకటేశ్వర్లు










