Aug 15,2022 07:45

       రొక్కం కామేశ్వరరావు ఇదివరకూ బ్లో-అవుట్‌ (1997), పదహారు (2004), అంతర్వీక్షణం (2008), చిదాకాశం (2011), క్షతగాత్ర (2017) అనే కవితా సంపుటాలు ప్రచురించారు. ఇటీవల ముఖారి (2022) వెలువరించారు. ఈ మధ్యలో అంతర్వీక్షణం, చిదాకాశం రెండింటి సమాహారంగా అంతర్ముఖం (2020) ప్రచురించారు. ఆయన బ్లో-అవుట్లో వ్యంగ్యపు ఉబ్బనీళ్ళలో ఉడికించి రాజకీయాల్లోని అవకతవకల్నీ, పౌరులపై రాజ్యం చేస్తున్న అకృత్యాల్నీ, పౌరుల్లోని బాధ్యతారాహిత్యాన్నీ ఉతికారేశారు. పదహారు, క్షతగాత్ర, ముఖారుల్లో రైతుల పక్షాన నిలబడ్డారు. కార్మికులకు వత్తాసు పలికారు. ఫ్యూడలిస్టు చాదస్తపు భావజాలాన్ని ఎండగట్టారు. దేశంలో పెరిపోతున్న ఫ్యాసిస్టు పోకడల్ని, ఫ్యాసిస్టుల ఆగడాల్ని ఎదిరించారు. వాళ్ళ ఆగడాల్ని ఎదిరించని 'మేధావుల మౌనం/ దేశద్రోహం కన్నా నేరం' అని నిందించారు. పాలక వర్గాల దోపిడీలను నిరసించారు. విద్యార్థులకు రాజకీయాలు ఎందుకన్న ఏలికల లోపాయికారితనాన్ని నిలదీశారు. అందుగురించి పేచీల్లేవు. కానీ వారు తమ పాత దృక్పథాలకు ప్రాతినిధ్యం వహించే అంతర్ముఖం మళ్ళీ ప్రచురించడంతో దాని పునాదులపై తన కవిత్వాన్ని మళ్ళీ సమీక్షించుకోవాల్సిన అవసరమేర్పడింది. అంతర్ముఖం గుండా చూస్తే అప్పటికి కామేశ్వరరావు గారిది ఆత్మశోధన చేసుకుంటున్న కవిత్వం, వెలుగుదారుల్ని వెతుక్కుంటున్న కవిత్వం, నిస్సహాయతని నిందించుకుంటున్న కవిత్వం, ఖాళీలని నింపుకోడానికి తపిస్తున్న కవిత్వం, వెలుగుల ప్రస్థానం చేస్తున్న సత్తా ఉన్న కవిత్వం. ఇప్పుడు వారి కవిత్వంపై చేస్తున్న విశ్లేషణలో 'అప్పటికి' అనే ప్రమేయం సర్వత్రా వర్తిస్తుంది.
క్లుప్తత కామేశ్వరరావు గారి కవిత్వంలో కనిపించే ముఖ్య లక్షణం. తన కవిత్వంలో చిన్న పద్యాలు, వాటిలో చిన్న చిన్న వాక్యాలు కనబడతాయి. ఏకపద పాదాలు మరీ ఎక్కువ. చిన్న చిన్న మాటలే ఐనప్పటికీ ఆయన మాటల్లోని పదును, భావ గాంభీర్యం, లోతైన తాత్వికత గొప్పగా ఆకట్టుకుంటాయి. జీవితంలో ఎదురైనా అనుభవాల్ని విశ్లేషించుకోవడం, ఆత్మపరిశీలన చేసుకోవడం నేర్పిస్తాయి. ఐతే వారి అవగాహనా క్రమంలో, అందులోంచి పుడుతున్న తత్వంలో ఉండాల్సిన ఒకానొక సూత్రత లోపిస్తునట్టు తోస్తుంది. 'అన్నీ పక్కన పెట్టా/ మళ్ళీ కొత్తగా చూడటం మొదలు పెట్టా (స్మ ృతి)' అన్న ఎత్తుగడ చూసినప్పుడు, 'గోడల్ని/ పగులగొడుతున్నా/... ఏదైనా/ వేదికితేనే/ దొరికేది/ హృదయం/ రసాత్మకమయ్యేది/... పదార్థాల యదార్థ స్వరూపాన్ని/ తెలుసుకుంటూ సాగితే/ ప్రతి మలుపులో/ ఓ పిలుపు వినిపిస్తుంది (బుద్ధుడ్ని)' అన్న ఆయన అవగాహనని చదివినప్పుడు ఒక ప్రగతిశీలవాది ఈ కవి మీద చాలా ఆశలు పెంచుకుంటాడు. ఆ తర్వాతి వాక్యాల్లో ఆ ఆశలకు గండిపడకుండా కవి జాగ్రత్త పడాల్సింది. గతాన్ని తీసి విసిరికొట్టానని అన్నాక మరిచిపోయిన నన్ను నేనే గుర్తు చేసు కుంటూ అనడం గత స్టేట్మెంటుని బాధిస్తున్నదని గుర్తించా ల్సింది. ధ్యానం, దివ్యకాంతి లాంటి పదాలు, 'సాధనంటే/ అంతరంగ శోధనే' లాంటి వాక్యాలు ప్రగతిశీలత్వానికి అవరోధాలు. ఖాళీగా శూన్యంగా ఉండటాన్ని అభిమానిస్తున్నా నని అన్నారు. ఈ నైరాశ్యం సంప్రదాయంలోంచి బయటపడి ప్రగతిశీలపథంలోకి అడుగిడలేని వ్యాకులతలోంచి వచ్చింది. దీన్ని 'అనుభవం క్లుప్తమైనప్పుడు/ అనుభూతి విస్తృతమౌతుంది' అన్న మాటలు స్పష్టం చేస్తున్నాయి.
     'తపన' కవితలో పేర్కొన్న 'నవీన సౌందర్యం' ఆధ్యాత్మికమైనదని అనుకోడానికి అందులో ఎల్లలే లేని అతీతం, పరిమితిలేని అనంతం, ప్రార్థన కూడా ద్ణుఖమే లాంటి వాక్యాలున్నాయి. కాదు అది శ్రీశ్రీ చెప్పిన మరో ప్రపంచమే అనుకోడానికి విషాదమే లేని కేంద్రం, గడ్డకట్టడం కాదు ప్రవహించు, ముడుచుకోవడం కాదు వికసించు లాంటి వాక్యాలున్నాయి. అదేమిటో స్పష్టంగా తేల్చుకోవాల్సింది. ఆయన విరుద్ధభావనలైన ప్రగతిశీలతకీ, ఆధ్యాత్మికతకీ ముడిపెట్టాలని ప్రయత్నించారు. 'ధ్యానం' పద్యం చూడండి. ఆయన ప్రకృతికి దూరంగా జరిగిన మానవప్రవృత్తిలో మార్పుకోసం ధ్యానిస్తున్నాడట. తన ధ్యాన వస్తువులు ప్రజలేనట. సమూహా లతో మమేకమయ్యేందుకు... విశ్వమానవ శ్రేయస్సు కోసం నడుస్తున్నాడట. శాసన బంధనాలను త్యజించి విముక్తికోసం సాగిపోతున్నాడట. ఇంతా చేస్తున్నది దివ్యత్వపు అర్థాన్ని అందుకోలేకపోతున్న తన వారి కోసమట. పైగా ఆ దివ్యత్వపు దారిలో నడవనివాళ్ళని దారి తప్పిన వాళ్ళని పేర్కొన్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన నిజంగానే ఆధ్యాత్మికతవైపు అందరినీ మళ్ళించాలని అనుకుంటున్నారా? లేదా ప్రగతిశీలత్వం వైపు మళ్ళించడానికి మ్యాజిక్‌ రియలిజాన్ని ఆశ్రయిస్తున్నారా? అని సందేహం కలుగుతుంది. ఇలాంటి జంజాటమే తన్మయత్వం, బరువు, ఆఖరి మజిలీ పద్యాల్లో కనబడుతుంది.
     కామేశ్వరరావు గారిలో ఒక ఒరలో ఇమడలేని ఉలిపికట్టె తనం ఉన్నది. 'మూసలో పోసి/ నన్ను ముస్తాబు చేయకండి/ ఒక వరుసలో ఒదగలేను/ ఒక సూత్రానికి కట్టుబడలేను/... ఏదో ఒక ముద్ర వేసి/ ఇరుకున పెట్టకండి/ కాలానికీ/ కొలతలకీ అతీతుణ్ణి' (నేను - నేనే) అని ఆయన అంటారు. నిజానికది అనిశ్చితి. సంప్రదాయ సాహితీవేత్తల సహవాస దోషం. తనది సహజమైన ప్రజాస్వామ్య స్వభావం. కానీ తన నేపథ్యానిది ఫ్యూడలిస్టు స్వభావం. ఈ రెండింటి మధ్య తన పక్షం ఏదో తేల్చుకోలేక పోవడం, స్పష్టత లేకపోవడమే ఆయనలోని తన్నుకులాటకు కారణం. తనది ఏ పక్షమో తేల్చుకోలేని ఊగిసలాట అని 'మంచులా' పద్యంలో మరింత స్పష్టంగా కనబడుతుంది. మాకినీడు సూర్యభాస్కర్‌ 'ఈ కవిత్వానికి లోతు, గాఢత హైందవ ధర్మాన్ని భూమికగా చేసుకోవడం వల్ల వచ్చింది. మనిషి ధార్మిక జీవనానికి ఆలంబనమైనది సనాతన హిందూ ఆధ్యాత్మిక తత్త్వం' అనడాన్ని బట్టి మనం దీనిని అర్థం చేసుకోవచ్చు. అలాంటి మెరమెచ్చుల ప్రభావం నుంచి కామేశ్వరరావు గారు త్వరలోనే బయటపడ్డారు గనుకనే క్షతగాత్ర, ముఖారి సంపుటాల్లో లాంటి ప్రగతిశీలమైన కవిత్వం వారి కలం నుంచి వచ్చింది.
     కామేశ్వరరావు ప్రశాంతతే నా చిరునామా అంటున్నారు. కానీ ఆయన చుట్టూ అశాంతి ఆవరించి ఉంది. లేదంటే ఇన్ని రాతలు రాసేవారు కాదు. అసలు అశాంతిలోంచే కవిత్వం పుడుతుంది. ఆయన తాను నిత్యం విస్తరిస్తున్నానని అంటారు. తాను వెలుగునంటారు. మరి తను విస్తరిస్తుంటే అన్నింటిలోకి దూరడానికి తానెందుకు ప్రయత్నిస్తున్నాడు? నువ్వు విస్తరించడం నిజమైతే నువ్వే అన్నట్టు అన్నీ నీలో వచ్చి చేరుతాయి. నువ్వు అన్నింటినీ నీలోకి ఆహ్వానిస్తావు. ఆ అవకాశం ఇస్తావు. నువ్వు వెలుగువైతే అన్ని జీవులు నిన్ను చేరుకోవాలని చూస్తాయి. మరి నువ్వెందుకు అన్వేషిస్తూ, నలువైపులా చేతులు చాస్తూ పరిగెడుతున్నావు? అని ఆయనని ఆయన ప్రశ్నించుకోవాల్సింది. రొక్కం వారి కవిత్వాన్ని విశ్లేషిస్తూ సీతారాం 'శృంఖలాబద్ధ జీవితమో, ఉనికో, అస్తిత్వమో, అనుభవమో, అనుభూతియో, ఏదైతేనేం తన చేతన తనకు ఆటంకంగా పరిణమించింది. ఈ చేతన, ఈ జాగృతి తన ద్ణుఖానికి మూలం. తన సంఘర్షణకు మూలం... ఎన్నో ద్వంద్వాలనుంచి మనిషి విమోచన పొందవలసి ఉంది. ఆ ద్వంద్వాతీత స్థితిని కవి కామేశ్వరరావు కనుగొంటున్నారు'' అనడం గమనించదగ్గది. కానీ సీతారాం అన్నట్లు కామేశ్వరరావు గారి చేతన, దాని మూలంగా కలిగిన అశాంతి, దాని మూలంగా చేస్తున్న అన్వేషణ ఆధ్యాత్మికమైంది కాదు. లోకంలో తాను నిత్యం చూస్తున్న అసహజత్వాలకూ, అసమానతలకూ, అన్యాయాలకూ, అణచివేతలకూ, దోపిడీకీ సంబంధించినది. దీనిని గుర్తించి ఉంటే (ప్రమేయం ఉంది) వారి ప్రయాణం మరోలా ఉండేది. వారు చెప్పిన విశాలమవ్వడం, వర్షించడం, ప్రవహించడం, ముడుచుకోకుండా విచ్చుకోవడం, చిగురించడం, పుష్పించడం, ఫలించడం అన్నవి సాకారమై వారి కలం మరో స్థాయిని చేరుకునేది. కామేశ్వరరావు గారి నేపథ్యం అప్పటికి తనని ప్రజాసమూహాల్లోకి పోనీలేదు. దాన్ని ఛేదించి వెలుపలకు పోవడానికి ఆయన శక్తి చాల్లేదు. అందుకే తను 'ఈ గది మహా చెడ్డది/ గిరి గీసి/ ఒంటరిని చేసి/ బంధిస్తుంది/ ఊపిరాడదు/ ఊసుపోదు' అని వాపోయారు. ఆయన చెప్పిన ఆ గది ఆయన సామాజిక నేపథ్యమే. దాని నుంచి బయటపడడానికి ఆయన కిటికీ తెరుస్తాడు. అప్పుడు 'అంత గాలి, ఇంత వెన్నెల, కొన్ని నక్షత్రాలు' కళ్ళకి కనబడతాయి. ఆ రాత్రి గడిచిపోతుంది. ఉదయం అన్నీ ప్రశ్నలే. అంటే ఆయన ప్రయత్నం ఎప్పుడూ విజయవంతం కాలేదు. ఆయన నిర్ణయం అంత గట్టిది కాదు. ఉదయం కాగానే ఆయన చెప్పింది తప్పనేవాళ్ళు, తన్ను తప్పుకోమనేవాళ్ళు, పెదవి చిట్లిస్తూ నొసటితో వెక్కిరిస్తూ చెప్పడమే తన నేరంగా భావించేవాళ్ళు ఎదురవుతారు. వాళ్లని ఎదిరించే శక్తి లేక మౌనవ్రతం పాటిస్తాడు. ఈ కవి సాహసం చేసి తనచుట్టూ గిరిగీసి, తనని బంధించిన ఆ గదిని దాటుకుని బయటపడాల్సింది. అప్పుడు ఆయనే అన్నట్టు 'కొండ ఎక్కనంత వరకే/ ఎక్కిన తర్వాత అన్నీ దారులే' అని అనుభవంలోకి తెచ్చుకుని ఉండేవారు.
కామేశ్వరరావు అప్పట్లో తనకు అవసరమైన దాన్ని తాను చేరుకున్నానని అంటారు. 'అనంతమైన/ ప్రయాణం/ తొలి అడుగుతోనే/ సాకారం' అని అనుకున్నారు. అప్పట్లో... ఓ కామేశ్వరరావు గారూ మీరు ప్రయాణించాల్సింది అనంతమై ఉండగా తొలి అడుగులోనే తృప్తి పడిపోతే ఇక మీరు సాధించేది ఏముంది? మీరు ఇన్నాళ్ళూ మీ నేపథ్యంలోనే మిగిలిపోయారు. కానీ అందుకు మీ ఆత్మసాక్షి ఒప్పుకోలేదు. మీరు జనం పక్షం వహించకుండా, ప్రగతిశీలవాదంలోకి దిగకుండా మీరే అన్నట్టు సంస్కృతి, నాగరికతల మాటున ఎన్నోనాళ్ళు దాక్కోలేరు. లక్ష్యాలు, ఆదర్శాల సాయంతో పారిపోలేరు. ప్రగతిశీల భావాల 'సహస్ర బాహువులు/ నిన్ను చుట్టుముట్టినప్పుడు/ ఉక్కిరి బిక్కిరి కాక తప్పదు/... ఓ అశరీరమైన స్వరం/ అనుక్షణం నీలో నీకే వినిపిస్తూ ఉంటుంది/ వెన్నాడుతూనే ఉంటుంది/ శాసిస్తూనే ఉంటుంది/ ఎక్కడికి పారిపోతావు?' అని ఇదివరకే మీకు మీరే చెప్పుకున్నారు. గుర్తుందా? అని ఆయన మాటల్ని ఆయనకే అప్పజేప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండుండాల్సింది. ఆ ఎరుకలోకి రండని తెలియజెప్పేవాళ్ళు ఒకళ్ళు ఎదురుపడాల్సింది. చిదాకాశం సంపుటాన్ని సమీక్షిస్తూ విరియాల లక్ష్మీపతి 'ఇందులో గల కవితలన్నీ ఉత్తమ కవితలే అని నేను అనడానికి సాహసించను. కొన్ని కవితలు పరిపక్వత చేరకుండానే అచ్చుకెక్కి భంగపాటు చెందాయి' అన్న మాటల్ని సానుకూలంగా స్వీకరించారు కాబట్టే రొక్కంవారి కవిత్వం ఆ తర్వాత మరో స్థాయికి చేరుకుంది. క్షతగాత్ర, ముఖారి సంపుటాల్లో లాంటి ప్రగతి శీలత్వం ఉన్న కవిత్వం వెలువడింది. కామేశ్వరరావు గారి ప్రగతిశీల రచనలైన బ్లో-అవుట్‌, పదహారు, క్షతగాత్ర, ముఖారుల్లో కవిత్వం పాళ్ళు కొరతగా ఉండుగాక.. వాటిల్లో కేవలం వ్యంగ్యం, అనుప్రాసలే మళ్ళీ మళ్ళీ చక్కర్లు కొట్టుగాక - అంతర్ముఖంలోని కవిత్వం గొప్పగా ఉండుగాక ... అందులోని తత్వం అందరికీ బాగా నచ్చుగాక.. పాఠకుల ఆదరణ పెద్ద ఎత్తున లభించు గాక .. అంత గొప్ప ప్రగతిశీల కవిత్వం వెలువరించాక మళ్ళీ తనలోని భావవాద భావనలకు ప్రాతినిధ్యం వహించే పాత కవిత్వాన్ని వెలికితీసి అంతర్ముఖం లాంటి పుస్తకం ఎందుకు వెలువరించారో అర్థం కాదు. ఆయన మొదట్లో చివర్లో అణుబాంబు విస్ఫోటనం లాంటి ప్రగతిశీలవాద కవిత్వం రాసి, మధ్యలో భావవాదంలోకి ఎందుకు పరకాయ ప్రవేశం చేశారో, ఎవరిని మెప్పించడానికో అస్సలు అర్థం కాదు. ఇలా అన్నంత మాత్రాన అంతర్ముఖంలో ప్రగతిశీలత్వం లేదని కాదు. అందులో లేశమాత్రంగా ఉన్న ఆధ్యాత్మికతని పక్కనే పెడితే రొక్కం కామేశ్వరరావు అసలు సిసలు ప్రగతిశీలవాది. తెలుగునేలపై ప్రస్తుతమున్న ప్రగతిశీలవాద కవుల్లో ఒకరు.
 

- కవితశ్రీ
94946 96990