Oct 24,2022 08:07

ఒక తలంపు ఒక సంకల్పం
ఒక ఆశ ఒక ఆశయం
ఈ ఆశయం నెరవేరాలంటే
ఈ స్వప్నం సాకారం అవ్వాలంటే..
ఈ ప్రస్థానం చివరికంటూ సాగాలంటే..
ఎంత తలపడాలి? ఎంత తగలబడాలి?
పాచిపోయిన పాతబడిన
మురిగి మూలబడిన
కుళ్ళి కంపు పట్టిన మెదళ్ళలో ఇంకిపోయిన
ఎన్ని సిద్ధాంత రాద్దాంతాల కొమ్ములు విరగాలి
ఎన్ని కోరలు ఊడాలి

నిర్మాణం ఒకటే! విధ్వంసాలు వెయ్యి
విజయం ఒకటే
అనేక అనేక సంగ్రామాలు
అనేక అనేక మరణాలు
ఎంత కాలం ఈ కుయుక్తులు!
ఎంత కాలం ఈ కుట్రలూ కుతంత్రాలు భరిస్తాం
కాలం రెప్పపాటిదే జరిగిన మోసం
బలిదానమయ్యే ముందు తరాల జీవితం
ఇప్పుడిక పగలే ప్రశ్నించే గొంతుకకు
బిగిసిన పిడికిలి ఊతమవ్వాలి
నరాలు ఉదయ స్వరాలై మోగాలి
నెత్తురు మరింత ఎరుపెక్కి మందారమై విరియాలి
ఏ గొంతు పాడిన పాట ఇది
ఏ తీరాల నుంచి
ఏ పిట్ట తన రెక్కలపై మోసుకు తెచ్చింది
వెచ్చ వెచ్చని ఈ సంధ్య గాలిలా
పద పదమంటూ ప్రతి పాదము
.....
పగ్గాలు పంజరాలు తెంపుకొని
రెక్కలు విచ్చుకొని ఎగిరే స్వేచ్ఛకోసం ..!
 

- లోసారి సుధాకర్‌
99499 46991