Jun 29,2023 07:59
  •  బలహీనమైన సామాజిక భద్రతా వ్యవస్థే కారణం
  •  ట్రస్సెల్‌ ట్రస్టు నివేదిక వెల్లడి

లండన్‌ : బ్రిటన్‌లో ప్రతి ఏడుగురిలో ఒకరు గతేడాది ఆకలి బాధలను ఎదుర్కొన్నారు. వారి వద్ద తగినంత డబ్బు లేకపోవడమే ఇందుకు కారణమని ఆహార బ్యాంక్‌ చారిటీ సంస్థ ట్రస్సెల్‌ ట్రస్టు బుధవారం ప్రచురించిన నివేదిక పేర్కొంది. అంటే దాదాపు కోటీ 13లక్షల మంది గతేడాది ఆకలి బాధకు గురయ్యారని తెలిపింది. ఇది స్కాట్లాండ్‌ జనాభాకు రెట్టింపు కంటే ఎక్కువేనని పేర్కొంది. పనిచేయని సామాజిక భద్రతా వ్యవస్థ ఇందుకు కారణమని తెలిపింది. దీనికి తోడు జీవన వ్యయ సంక్షోభం కూడా నెలకొందని నివేదిక పేర్కొంది. ఈ సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే సూచనలు కూడా కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. బ్రిటన్‌ది ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఇక్కడి ప్రజలు ఏడాదికి పైగా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు కార్మికులందరి వేతనాల పెంపు కన్నా ఎక్కువగా ఈ ద్రవ్యోల్బణం మించిపోయింది. 1950ల నాటి రికార్డులతో పోలిస్తే గత రెండేళ్ళ కాలంలో బ్రిటన్‌ కుటుంబాల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ట్రస్సెల్‌ ట్రస్ట్‌కి బ్రిటన్‌వ్యాప్తంగా 1300 ఫుడ్‌ బ్యాంక్‌ సెంటర్లు వున్నాయి. ఈ ఫుడ్‌ బ్యాంక్‌లు మార్చితో ముగిసిన ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో 30లక్షల ఆహార పార్శిళ్ళను అందచేశాయి. ఐదేళ్ళ క్రితం అందచేసిన పాకెట్ల కన్నా ఇది రెట్లింపుగా వుంది. దేశంలోని సామాజిక భద్రతా వ్యవస్థ బలహీనంగా వుండడమే ఇందుకు ప్రధాన కారణంగా వుందని ఆ నివేదిక తెలిపింది. దేశంలోని ఏడు శాతం మంది ప్రజలకు ఫుడ్‌ బ్యాంకులతో సహా స్వచ్ఛంద సంస్థల నుండి ఆహార తోడ్పాటు అందుతోందని తెలిపింది. అయినా 71శాతం మంది ప్రజలు ఆకలి బాధలను ఎదుర్కొన్నారని వారికి ఎక్కడ నుండి ఎలాంటి సాయం అందలేదని తెలిపింది.