Oct 03,2022 07:50

ల్లావుద్దీన్‌ అద్భుతదీపం ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో - అలాంటి అద్భుతమైన చలనచిత్ర పోకడలను ఈ 'అల్లాఉద్దీన్‌ సినిమా అద్భుతం' పుస్తకంలో పరిచయం చేశారు ప్రముఖ రచయిత డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌. ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసం సినిమాల గురించి, వాటి పోకడలు, నటీనటుల గురించి సదృశ్యంగా వివరిస్తుంది.
       మొదటి వ్యాసం 'అల్లావుద్దీన్‌ సినిమాద్బుత దీపం'లో చాలా సినిమాల్లో హీరోలు ఎక్కువగా బిఏ చదువుతారని చెప్పారు రచయిత. బియ్యం, కందిపప్పు అమ్మడంలో ఎంత సందేశం ఉంటుందో.. సినిమా నిర్మాణంలో కూడా అంతే సందేశం ఉంటుందని రచయిత చెప్పారు. ఓ ఐఎఎస్‌ అధికారి ... సినీ హీరో బిఏ చదివాడు కాబట్టి తాను కూడా బిఏ చదివి ఆపై ఐఎఎస్‌ అయిన వైనాన్ని చెప్పారు రచయిత. అంత ప్రముఖ వ్యక్తిపై కూడా సినిమా ప్రభావం ఉందని చెప్పడం ఈ ఉదాహరణ ఉద్దేశం. అలాగే సినిమాని రాకెట్‌తో పోల్చి చెప్పారు. 'మహానటి' సినిమా విషయంలో మీడియా, సోషల్‌ మీడియా విస్తృత ప్రచారం చేశాయని, మహానటి సావిత్రి గురించి చెప్పడం అంటే తరగని పెన్నిధి అని అంటారు. అప్పట్లో సినీ నటీనటుల గురించి రాసిన పత్రికలను పంచాంగంలా దాచుకునేవారు. కానీ ఇప్పటి వారు టీవీ ఆండ్రాయిడ్‌తో కాలక్షేపం చేస్తున్నారంటారు. అలాగే ఈ మధ్య మహానటి మీద సినిమా హిట్‌కి కాలువ ప్రయాణంలో తెడ్డును ఉపయోగించుకున్న రీతిలో మీడియాను బాగా వినియోగించుకోవడమే ఈ సినిమా విజయ రహస్యమని చెప్పకనే చెప్పారు వేణుగోపాల్‌.
        'సర్వ సమర్ధులూ... కాసింత ఆలోచించాలి'లో ఒకటి కన్నా రెండు మిన్న అంటే ఒక బుర్రకన్నా రెండు బుర్రలు మెరుగని అధిక భారాన్ని మోయడంలో ఉన్న అర్థం, పరమార్థమని చెప్పారు రచయిత. దర్శకత్వం, సంగీతం, కథ, స్క్రీన్‌ ప్లే, నిర్మాణం, గానం అన్నింటా ఒకరి పేరే కనబడితే ఉన్న పేరు కూడా పోతుందని చక్కగా చెప్పారు. ఎస్వీ కష్ణారెడ్డి డైరెక్షన్‌ చేద్దామని మ్యూజిక్‌ చేయలేదని చెప్తూనే గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, ఆపై హీరోగా మారి మెల్లగా కనుమరుగయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాఘవేంద్రరావు నటుడిగా రాణించాలని సినీ రంగ ప్రవేశం చేసి దర్శకుడుగా మారి దర్శకత్వంపై ఎక్కువ దృష్టి సారించి సక్సెస్‌ సాధించిన విషయం గుర్తు చేశారు. నటి భానుమతి సకల కళాకోవిదులుగా వినతికెక్కారని, ఇప్పుడు కూడా సాహసం చేయకురా డింభకా అన్న చందాన విజయ పరంపరలో ముందుకు దూసుకు వెళ్ళొచ్చని సూచించారు. అలాగే 'మాకు కాసులు వస్తే చాలు' వ్యాసంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను హింసాత్మక ప్రాంతాలుగా చిత్రీకరించి నిర్మాతలు కాసుల వర్షం కురిపించుకుంటున్నారని, ఆయా ప్రాంతాలకు చెడ్డ పేరు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఉండే కొన్ని కుటుంబాల మనోప్రవృత్తిని అశ్లీలత జోడించి భూతద్దంలో చూపించడం ఎంతవరకు సబబని దర్శక నిర్మాతలను ప్రశ్నించారు.
'ప్రేక్షకుడి విజ్ఞత' వ్యాసం చాలా అర్థవంతంగా ఉంది. హంగు, ఆర్భాటాలు లేకపోయినా చక్కని కథనం ఉంటే ఏ సినిమా అయినా వినూత్న రీతిలో ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే యథార్థాన్ని చెప్పారు. సినిమాలో సత్తా లేకపోతే ఎంత పబ్లిసిటీ ఇచ్చినా అది విజయం సాధించదని, అదే మంచి చిత్రం అయితే విజయవంతం చేస్తారని, అదే ప్రేక్షకుల విజ్ఞతని పేర్కొన్నారు.
        'అశ్లీలత తెర నుంచి...' వ్యాసంలో తారల పరిస్థితి కొంత బాధాకరంగా అనిపించినా ఉన్న వాస్తవాలను చాలా చక్కగా చెప్పారు నాగసూరి. షూటింగ్‌ అయిపోయాక కూడా కొంతమంది పెద్దలు తారలతో అసభ్యంగా ప్రవర్తించడం సబబు కాదని, మీడియా తప్పుడు వార్తలతో నటీనటులను కించపరచరాదని చెప్పారు. 'తెరపై సాంకేతిక విప్లవం' వ్యాసంలో సాంకేతికత అభివృద్ధి చెంది బుల్లితెర, వెండితెర పోటీపడి పాత సినిమాలను ప్రసారం చేయడం వల్ల అలనాటి వెండితెర నటీనటులకు చక్కని గుర్తింపు వచ్చిందని చెప్పారు రచయిత.
'మౌన ప్రచారం కెమెరా ప్రయోగం' వ్యాసం వాస్తవానికి దగ్గరగా ఉంది. సినిమా హిట్‌ అవ్వాలని చేసే ప్రచారానికి సినిమా అసలు కథకు ఏమాత్రం సంబంధం ఉండదు. హింస, ప్రతీకారం, గొడవలు, పగలు ఇవి అసలు కథలో ఉంటే వేరే కాన్సెప్ట్‌తో పబ్లిసిటీ ఇస్తే లాభాలు కాదు కదా మామూలుగా కూడా ఆడదంటారు రచయిత. గాంధీజీ ఆశయాన్ని ప్రధానంగా తీసుకొని 'సదా మీ సేవలో' సినిమా రూపొందించారని, హాస్యం, మంచి సంభాషణలు చేరిస్తే అప్పుడే సినిమా బాగా ఆడుతుందనడంలో దర్శకుడి స్థితప్రజ్ఞత కనిపిస్తుందని అంటారు. 'ఏ మూసా లేని దాశరధి కష్ణమాచార్య' వ్యాసం చాలా ఆసక్తిదాయకంగా ఉంది. ఇందులో దాశరధి గారి సినీ పాటల్ని ఖుషీఖుషీగా నవ్వుతూ, పూలు విరిసిన తేనె కురిసెను, నడిరేయి ఏ ఝాములో పాటల్ని ప్రస్తావించారు. 'సినీ గీతార్ణంలో వేటూరి సప్తపది' వ్యాసం బాగా హైలైట్‌ అయింది. వారి సినీ గీతాల్లో వైవిధ్యం, వైశిష్ట్యాన్ని చక్కగా పొందుపరిచారు రచయిత. 'ఆరేసుకోబోయి, అబ్బనీ తీయని దెబ్బ, మానస వీణా, శంకరా... నాద శరీరాపర, ఈ దుర్యోధన దుశ్శాసన...' లాంటి ఎన్నో పాటల గురించి సవివరంగా వివరించారు.
        ఇంకా 'సర్వ సమర్థులు కాసింత ఆలోచించాలి, వాణిజ్య దృష్టి వికటిస్తే, ఎన్ని కలకు సినిమాలకు ఎంత పోలిక, తెలుగు విశేష రూపం ఎన్టీఆర్‌, నవ్విపోదురు గాక, మారిన సినిమా రంగపు స్వరూపం...' లాంటి వ్యాసాలు చాలా విషయాలను వివరించాయి. ఈ రచయిత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి గిడుగు రామ్మూర్తి భాషా పురస్కారం, సైన్స్‌ రచనలకి పరుచూరి రాజారాం పురస్కారం, తాపీ ధర్మారావు జన మాధ్యమాల పురస్కారం అందుకుని పురస్కారాలకే వన్నె తెచ్చారు. ప్రతులకు 94407 32392 నెంబరులో రచయితను సంప్రదించవచ్చు.
 

- పింగళి భాగ్యలక్ష్మి
97047 25609