అంతా
అలికేసినట్టుంది
కొన్ని మురికి చారలు
ఎక్కిరిస్తాండాయి.
మూడు
రాతి గుండ్ల పైన
మూత లేని మట్టి కుండ
నాల్గు మెతుకుల్ని
లోపలే వేసేసుకుని
మింగలేక చావలేక
ఆడనే కూచుంటాది.
ఆ కూసం పక్కనే
కొక్కీకి మెడ తగిలించి
జీవచ్ఛవమై
ఒట్టి జేబుతో
అంగీ వేలాడుతుంటాది.
పూరింటి పైచూరు
పొగబారి
నిండా మునిగిపోతా
కునుకు లేని కంటికి
జోల పాడుతుంటాది.
ఎల్లకిలా పడిన తట్ట
ఆకలి పేగుల్ని లెక్కెడతా
ఓ మూలకు ఒరిగి
కన్నీటిని తాగుతుంటాది.
మా పూరింటి
ఆ కూసం పక్కనే
కూసింత జాగాలో
రవ్వంత ఎసరు
ఎప్పుడూ
మరుగుతుంటాది.
ఆ పక్కనే
వంగిపోయిన తాళ్ళతో
వయసైపోయిన
చిన్న కట్టె మంచం
తూలుతుంటాది.
గబ్బిలాలు
తుర్రుమని లేచినా
నిగ్రహానికి
పట్టాభిషేకం చేసి
అదిగో
ఆ పూరింట్లో
ఆ కూసం పక్కనే
ఆఖరి దాకా తొంగోవాల్సిందే.
- నరెద్దుల రాజారెడ్డి,
సెల్ : 9666016636










