Oct 02,2023 20:43
  • విస్తృత సమావేశంలో సిఐటియు జాతీయ నాయకులు ఎస్‌ వరలక్ష్మి

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ (గుంటూరు జిల్లా) : దళిత, గిరిజన, బలహీనవర్గాలకు చెందిన మున్సిపల్‌ పారిశుధ్య ఇంజనీరింగ్‌ కార్మికుల ఉద్యోగాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్మినెంట్‌ చేయాలని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు ఎస్‌ వరలక్ష్మి డిమాండ్‌ చేశారు. ఐక్య పోరాటాలకు మున్సిపల్‌ కార్మికులందరూ సిద్ధమవ్వాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కొరటాల బాపనయ్య భవన్లో సోమవారం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర వర్క్‌ షాపులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రయినేజీ శుభ్రం చేస్తూ, ఆ కాలువల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు బజారున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య హక్కులను ఖూనీ చేస్తున్నాయని విమర్శించారు. దేశ ప్రజలకు సేవ చేస్తున్న మున్సిపల్‌ పంచాయతీ కార్మికులు, అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం కార్మికుల సేవలను గుర్తించకుండా, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించకుండా ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని తెలిపారు. పాలకుల మోసాలను తిప్పికొడుతూ కార్మిక వర్గం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ లక్షలాది మంది కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు పర్మినెంట్‌ చేస్తామన్న సిఎం జగన్‌ వాగ్దానాలను తుంగలో తోక్కారని అన్నారు. రాష్ట్ర వర్క్‌షాప్‌లో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్‌ కె ధనలక్ష్మి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్‌సిహెచ్‌ శ్రీనివాసరావు, మున్సిపల్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె నాగభూషణం తదితరులు ప్రసంగించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కలిసి వచ్చే సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని మున్సిపల్‌ కార్మికులకు రాష్ట్ర వర్క్‌ షాప్‌ పిలుపునిచ్చింది.