Oct 10,2022 08:06

ళల కాణాచి తెనాలి వారి విపంచి సాంఘిక నాటికల పరిషత్‌ ... సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 4 వరకూ ఐదు రోజుల పాటు వైవిధ్య భరితమైన ఇతివృత్తాలతో సాగింది. ఈ వైవిధ్యం ప్రదర్శన పద్ధతుల్లో కొత్త పంథా, పాత్రలు - వాటి మనస్తత్వాలు, రంగస్థలంపై వాటి అభివ్యక్తిలో ప్రస్ఫుటించింది. వర్తమాన సమాజం పోకడలకు అద్దం పట్టడంలోనూ, స్త్రీ పాత్రలను తీర్చిదిద్దటంలోనూ కనిపించింది.

Mirrors-of-the-present-strong-voices


         గతంలో నాటికల్లో స్త్రీ పాత్రలు టీ కాఫీ కప్పుతో ప్రవేశించడం, ప్రేక్షక పాత్ర వహించడం, ఏదైనా చెప్పబోతే మగపాత్రలు 'నువ్వు లోపలికి వెళ్ళు' అని కసురుకోవడంతో నిష్క్రమించడం జరిగేది. అందుకు భిన్నంగా ఈ నాటికల్లో స్వేచ్ఛ కోసం గొంతు విప్పి ప్రతిఘటించి ఎదుర్కోవటం; అవసరమైతే తీవ్రస్వరంలో ఆక్రోశాన్ని, తమ కార్యాచరణ చూపడం సంతోషాన్ని కలిగించింది. తెలుగు నాటక రంగం ఆధునికంగా ఉంది, అప్డేట్‌గా ఉంది, ఆశాజనకంగా ఉంది. అడుగులు ముందుకే పడుతున్నాయి అన్న భరోసా కలుగుతుంది
      ఈ పోటీ నాటికల్లో మొదటిది 'వెండి అంచులు'. అరవింద తాడేపల్లి వారిది. కథా రచన పి.సత్యవతి. నాటకీకరణ వల్లూరు శివప్రసాద్‌. దర్శకత్వం గంగోత్రి సాయి. గోమతి పాత్రలో వసంత యామిని నటించారు. గోమతికి కుటుంబ ఆర్థిక కారణాల వల్ల, భార్య పోయి ఇద్దరు ఎదిగిన పిల్లలు ఉన్న లాయర్‌ సుందర్రావు రెండో పెళ్లి జరుగుతుంది. ఆమె గర్భవతి అయితే, ఆమెకు తెలియకుండానే అబార్షన్‌ చేయించాలని అతడు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటాడు. దానిని గోమతి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 'నేను కేవలం మీ కామోద్రేరేకాలను చల్లబరిచే మాంస కండరాలని కాదు. ఒక బిడ్డకు జన్మనిచ్చే తల్లిని. అది నా జన్మ హక్కు. ఒక మగాడిగా మీరు ఒక జీవకణాన్ని నాకిస్తారు. ఆ కణాన్ని ఒక పిండం చేసి అవయవాల్ని ఇచ్చి ఆకృతిని ఇచ్చి ఆయువు పోసి తొమ్మిది నెలలు కడుపులో దాచి పురిటి నొప్పులు భరించి చావుకు తెగించి ఒక జీవిగా జన్మనిచ్చే మాతృమూర్తిని నేను. మగాడిగా మీరు సంపదను పోగేస్తే, నేను తల్లిగా మానవ వనరులను సృష్టిస్తాను. ఈ సృష్టిలో తండ్రి అవసరం లేని సంతానం ఉంది కానీ, తల్లి కనని సంతానం లేదు. ఒక తల్లిగా బిడ్డను కానే హక్కు అధికారం, నాకు లేనప్పుడు నేను నా బిడ్డ కలిసే చస్తాం' అంటుంది.
         'నెట్‌' నాటికను వెలగలేరు థియేటర్‌ ఆర్ట్స్‌ వారు ప్రదర్శించారు. రచన దర్శకత్వం శ్రీనివాసరావు పోలుదాసు. ఇందులో శారద పాత్రను సురభి లలిత పోషించారు. భర్త పోయి గౌరవంగా ఉద్యోగంతో జీవిస్తున్న శారదను జయరాం ట్రాప్‌లోకి లాగుతాడు. అతడి అసలు స్వరూపం తెలుసుకొని తన కొడుకు రఘు, అతని స్నేహితుడు సూర్యతో కలిసి, అతడి ఎత్తును చిత్తు చేస్తుంది. ఆ సందర్భంలో శారద 'ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే నీలాంటి నీచుడిని నడి బజారులో ఉరితీయాలి. ఎక్కడిదిరా? మీకు ఇంత ధైర్యం. ఆడది అంటే ఏమీ చేయలేని బలహీనురాలు అని భ్రమపడి మీకు మీరే బలవంతులుగా ఫీలై మీకు ఎదురు లేదని రెచ్చిపోతార్రా! నీ పనులు చేయించుకోవడం కోసం ఒక ఆడదాన్ని మభ్యపెట్టి మోసం చేసి ఇరికిస్తావా? ... ఇలా ఎంతమందిని మోసం చేస్తావురా.. ఈ విషయాలు బయటపడితే సమాజంలో పరువు పోయి చావాల్సి వస్తుందన్న భయంతో ఎంతోమంది ఊరుకుండి పోతున్నారు. నీ పాపం ఈనాటికి పండి నీ పాలిట పడ్డవాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చారు. ఇక నీ బతుకు.. కుక్కలు చింపిన విస్తరే' అంటుంది.
         చైతన్య కళా స్రవంతి విశాఖ వారు ఎస్‌11 నాటికను ప్రదర్శించారు. రచన పరుచూరి వెంకటేశ్వరరావు. దర్శకత్వం పి.బాలాజీ నాయక్‌. కొత్తగా పెళ్లయిన రాజేష్‌, వాసంతిల మధ్య ఈగోతో కూడిన మనస్పర్థల వల్ల విడిపోవాలనుకుని కోర్టులో విచారణకు హాజరు కావడానికి ఎస్‌11లో ప్రయాణిస్తుంటారు. అనుభవజ్ఞుడైన మాస్టారు వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చబోతే, కంపార్ట్మెంట్లో వారిద్దరి మధ్య వాగ్యుద్ధం జరుగుతుంది. వాసంతి తన వాదం ఇలా వినిపిస్తుంది.. : 'చెప్పండి! మీరు కట్టుకోమన్న చీర కట్టుకోవాలి. మీరు ఎంగిలి చేసిన అన్నాన్ని పరమాన్నంలా తినాలి. మీరు తాగి వదిలేసిన కాఫీ గ్లాసులోనే పరమాన్నం అనుకుంటూ తాగాలి. జాంపండులా ఉన్నావంటే పొంగిపోవాలి. అందంగా లేవంటే ఏడుస్తూ పడుకోవాలి. తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. మరి నేను చెప్పినట్లు చేయగలరా? నాకు కాళ్లు నొప్పి పెడితే కాళ్లు పట్టాలి. అప్పుడప్పుడు నాకు వండి పెట్టడానికి వంట పనులు నేర్చుకోవాలి. ... నా పర్మిషన్‌ లేకుండా నా పక్కనే కాదు, నా పరిసరాల్లో కూడా ఉండకూడదు. ఏదో వంకతో నన్ను ముట్టుకోకూడదు. పాతిక లక్షలు పెట్టి నిన్ను కొనుక్కున్నాను, నీకే అంత ఈగో ఉంటే నిన్ను కొనుక్కున్న దాన్ని. నీలాగే ఉద్యోగం చేస్తున్న దాన్ని. మరి నాకెంత ఉండాలి? ఉద్యోగం మానేసి నీ దగ్గర బానిస బతుకు బతికేది కల్ల. మనం విడాకులు తీసుకుందాం' అంటూ తన స్థిర నిశ్చయాన్ని వెలిబుచ్చుతుంది.
         గంగోత్రి పెదకాకాని వారు ప్రదర్శించిన 'పేగు రాసిన శాసనం' నాటిక రచన డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావు, దర్శకత్వం నాయుడు గోపి. ఇందులో వెంకటేశ్వరరావు కమలాక్షి దంపతులు. వారి కుమారుడు సుదర్శన్‌, వారి నమ్మినబంటు శంకరం. కన్న కొడుకు నిరాదరణ వారిని బాధిస్తుంది. శంకరం చూపే ఆపేక్ష సంతోషపెడుతుంది. శంకరాన్ని, తనతో సమానంగా చూసుకోవడం సుదర్శన్‌కి ఇష్టం ఉండదు. అతడు శంకరాన్ని ఇంటి నుంచి గెంటేయడంతో ఎంతో కళవళపడిపోతారు. సుదర్శన్‌ తన వాటా ఆస్తి కోసం కోర్టుకు వెళ్తానంటే.. ''అది మీ తాత ముల్లెం కాదు, మనవడిగా ఎగబడ్డానికి. మా కష్టార్జితం. మా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చుకుంటాం. తలకొరివి పెడతాడనే సెంటిమెంట్‌కి లొంగిపోవడం వల్లే ఎందరో కన్నవారు, బిడ్డల్ని బలవంతంగా భరిస్తున్నారు. .. నీతో మాట్లాడినప్పుడల్లా పేగు చిట్లిన చప్పుడే వినిపిస్తోందిరా. ప్రేమ మరి పరిమళం వీసమెత్తు వీయడం లేదు' అంటుంది తల్లి. ఈ తరం తల్లిదండ్రులు, అర్థం పర్థంలేని ప్రేమల లోకానికి విముక్తి లభించేలా అమ్మానాన్నలంతా చిట్లిన తమ పేగులతోనే కొత్త శాసనాలు రాయాలి అన్న సందేశం ఈనాటిక ద్వారా కమలాక్షి పాత్ర పోషించిన జ్యోతిరాణి నిర్ద్వందంగా చెబుతుంది.
మద్దుకూరి ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ చిలకలూరిపేట వారి 'మృత్యుపత్రం' నాటిక రచన దర్శకత్వం : మద్దుకూరి రవీంద్రబాబు. ఇందులో శాంతమ్మ పాత్రధారి వై.భవాని. మరణ ధృవీకరణ పత్రాల జారీ కోసం అవినీతికి పాల్పడేవారిని చూసి ఆవేదన చెందుతుంది పల్లె పడతి శాంతమ్మ. తన కడుపులో గడ్డ తీయించుకోవడానికి తెచ్చుకున్న డబ్బును ముక్కూ ముఖం తెలియని పసివాడి శవం విడిపించడం కోసం.. లంచంగా ఇవ్వాల్సి వస్తోంది. అప్పుడిలా అంటుంది : 'సచ్చినోడిని సచ్చాడు అని రాసి ఇవ్వడానికి నాకాడ 10 వేలు తీసుకున్నావే.. నిన్ను ఏమనాలి? అమ్మా నువ్వూ బిడ్డలను కన్న తల్లివే అయుంటావు. కానీ ఆడతనంలోని జాలి, అమ్మతనంలోని ప్రేమ, నీలో నాకు ఏడా కనిపించలేదమ్మా. ... నీ బిడ్డల్లో ఒక బిడ్డ లాగా ఈ బిడ్డ కనిపించలేదా అమ్మా? డబ్బు- చచ్చిన మనిషిని బతికించలేదు. బతకడానికి ఏం కావాలమ్మా!.. పిడికెడు మెతుకులు. ఇదే పరిస్థితి మీ వాళ్లకు వస్తే అప్పుడు కూడా ఇలాగే డబ్బు వసూలు చేస్తారా? ... చెప్పండి ఎవరిది ఈ సావు కాగితం? చచ్చిపోయిన ఆ పసిబిడ్డదా? శవాల మీద డబ్బులు సంపాదించుకోవాలని చూస్తున్న ఈ మనుషులదా? ఎవరిదీ సావు కాయితం?..'
         యంగ్‌ థియేటర్‌ ఆర్గనైజేషన్‌ విజయవాడ వారి 'క్రైమ్‌ కథ' రచన, నాటకీకరణ : పిన్నమనేని మృత్యుంజయరావు. మూల కథ : గంధం నాగరాజు. దర్శకత్వం : ఆర్‌ వాసుదేవరావు. ఇందులో చీటీల బేబమ్మ పాత్రధారి జ్యోతి రాణి. అమాయకురాలైన బేబీ జీవితంలో డక్కా మొక్కీలు తిని బెల్టు సూరి ఆశ్రయంలోకి వస్తుంది. అక్కడా ఆమెకు ప్రేమ దొరకదు. భర్త, డ్రైవర్‌ కలిసి అక్రమ ఆస్తి సంపాదనకు ప్రయత్నిస్తే, నిశ్శబ్దంగా వాళ్లను మట్టు బెడుతుంది. కనిపించకుండా పోయిన వారి కోసం పరిశోధిస్తున్న అధికారి, బేబీని బ్లాక్‌ మెయిల్‌ చేస్తాడు. తన కూతురి పెళ్ళికి 50 లక్షలు ఆమె ద్వారా తీసుకుని నిజాన్ని కప్పి పెడదామనుకుంటాడు. బేబీ తన జిత్తులమారి స్వభావంతో నెగ్గుకొస్తుంది. ఆ పాత్ర మన్ణ ప్రకృతిలోని వివిధ కోణాలను జ్యోతి రాణి చక్కగా పోషించింది, పిల్లి పులి నక్క అన్నీ తానై. చివరగా భవతి హైదరాబాదు వారి నాటిక 'దారుణం'. రచనా దర్శకత్వం : పరమాత్ముని శివరాం. ఇందులో సింధు పాత్రను పోషించింది సునయన. రుణ యాప్‌ల దారుణాలపై ఈ నాటిక సాగింది. రికవరీ ఏజెంట్ల దారుణాలకు ఎందరో బలవుతున్నారు. సింధు అలా బలైపోయిన అమాయక యువతి. తండ్రి చేసిన అప్పు తీర్చమని రికవరీ ఏజెంట్‌ రావడం, బంధువులందరినీ సోషల్‌ మీడియాలోకి లాగడం, సింధు ఫొటోను మార్ఫింగ్‌ చేసి తోటి విద్యార్థుల మధ్య అవమానపరచడం.. అది తట్టుకోలేని సింధు ఆత్మహత్యకు పాల్పడడం వర్తమాన పరిస్థితులకు అద్దం పడుతుంది. మరణ వాంగ్మూలం లాంటి మాటల్లో సింధు .. 'ఆ లోన్‌ యాప్‌ వాళ్లు నా ఫొటో మార్ఫింగ్‌ చేసి నగంగా చిత్రీకరించి, నా ఫ్రెండ్స్‌కి, చుట్టాలు అందరికీ పంపించారు. ఫేస్‌ ఒక్కటే నాది నాన్నా... కింద ఉన్న ఏ బాడీ పార్ట్‌ నాది కాదు. ఆ ఫొటో పెట్టి ఏం రాశారో తెలుసా? 'మా నాన్న నా చదువు కోసం అప్పు చేశారు. తీర్చలేక బాధపడుతున్నారు. దయచేసి నన్ను ఎవరన్నా బుక్‌ చేసుకుని నాకు హెల్ప్‌ చేయండి' అని. నిన్నటిదాకా నాకు రెస్పెక్ట్‌ ఇచ్చే నా ఫ్రెండ్స్‌ కూడా ఆ పోస్ట్‌ చూసి నాకు ఫోన్‌ చేసి.. చండాలమైన భాష ఉపయోగిస్తున్నారు. ఇంత జరిగాక అందరిలో నేను ఎలా తలెత్తుకు తిరగ్గలను? నన్ను క్షమించండి నాన్నా..' అని చెప్పి తండ్రి ఒళ్ళో ప్రాణాలు విడుస్తుంది. అది తట్టుకోలేని ఆ తండ్రి గుండెపోటుతో అలాగే ఒరిగిపోతాడు.
... ఇలా వర్తమాన సామాజిక అంశాలను రచయితలు, దర్శకులు, నటీమణులు అత్యంత సహజంగా పాత్ర పోషణ చేసి 'నాటకం సమాజానికి దర్పణం' అన్న నానుడిని నూటికి నూరు శాతం నిజంగా చేసి చూపించారు.
 

- మల్లేశ్వరరావు ఆకుల
79818 72655