తోటమాలి ఊరెళ్ళాడు
పది రోజులైంది
మొక్కలు తలలు వాల్చేసాయి
ఆశలు రాల్చేసాయి
తోటమాలి ఊరెళ్ళాడు గానీ
మొక్కల గురించి ఆలోచన లేదు
నీళ్లు ఎవరుపోస్తారు? తోటమాలికి
పని ఉండొచ్చు, కారణాలు ఏవైతేనేం?
అడవులే నశించిపోతై
సంరక్షించే వాడు లేకుంటే
సాదా మొక్కలవి
టాంక్‌లో జలనిధి వున్నా నీటినిల్వ వున్నా
సరఫరా లేక గొంతెండిపోతూ
నోరులేని మొక్కలు పేరులేని మొక్కలు
నెలలు వయస్సు వాటికి
గుంపు గుంపే అల్లాడుతూ
దినదిన ఎదుగుదల దేవుడెరుగు
మొక్కలు నిరసంతో ఉన్నాయి
అక్కడే ఉన్న ఒకటి రెండు చెట్లతో
మాట్లాడడం మొదలెట్టాయి
అవి జాలిగా ఔనౌనని సానుభూతి
ప్రకటించి సలహా ఇచ్చాయి
ఆశలు ఆవిరవుతున్నవేళ
ఇక తోటమాలికై ఎదురుచూపులు మాని
మొక్కలు భక్తి శ్రద్ధలతో ఆకాశాన్ని ప్రార్థించాయి
మబ్బులొచ్చి ఆ పిల్లలకి పాలిచ్చాయి !
- కోటం చంద్రశేఖర్
94920 43348










