గురువంటే...
అజ్ఞానాన్ని పారద్రోలే వెలుగని
భవిష్యత్తుకు మార్గం చూపే అక్షరమని
సమాజ దార్శనికుడని కదా పెద్దలు చెప్పింది
మరి.. గుడి లాంటి బడిని అపవిత్రం చేసిందెవరు ?
విలువలకు నిలువ పాతరేసేలా చొరబడిందెవరు?
తరగతి గదిలోని వెలుగుల్ని చెరబట్టిందెవరు?
వికృత పోకడలకు నాంది పలికిందెవరు?
నిలువెత్తు అక్షరమై నిలబడాల్సిన వూరు బడిని
దూరం చెయ్యొద్దన్నందుకేగా ఈ అణిచివేతలు
హాజరు నుంచి బాత్రూం క్లీనింగ్ దాకా యాప్ ల
గోలేంటని నిలదీసిందుకేగా ఈ కక్ష్య సాధింపులు?
విధానపరమైన నిర్ణయాలను
వ్యతిరేకించినందుకేగా ఈ గృహ నిర్బంధాలు
విద్యారంగాన్ని కాపాడమన్నందుకేగా
మమ్మల్ని బైండో వర్ చేస్తూ...నాన్ బెయిలబుల్ కేసులు?
ఇచ్చిన మాటకు కట్టుబడమన్నందుకు
చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకో మన్నందుకు
నిరంకుశ వైఖరి ఎండ గడుతున్నందుకేగా ఈ దాష్టీకం!
మేమడిగింది.. మీరిచ్చిన హామీలే కదా!
గుర్తు చేసింది మీరు చేసిన వాగ్దానాలే కదా !
అమలు చేయమన్నది
వారంలో రద్దు చేస్తానన్న హామీనే కదా!
అది అవగాహన లేకుండా
ఇచ్చిన మాట అని...
కాడి వదిలేసినప్పుడే కదా!
ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది
శాంతియుత పోరాటానికి పిలుపు నిచ్చింది
మా ఆశలపై నీళ్లు చల్లినప్పుడే కదా
మేం హక్కుల సాధనకై నడుం బిగించింది
మా అస్తిత్వాన్ని
దెబ్బ కొట్టేలా అడుగులేస్తున్నప్పుడు కదా
మేం రోడ్డ్డెక్కింది, నిరసన స్వరమై నినదించింది
అధికారాన్ని అడ్డుపెట్టుకుని
మమ్మల్ని అభద్రతలోకి నెట్టేస్తున్నప్పుడే కదా
తిరుగుబాటు జెండా ఎగురేసి ఉద్యమబాట పట్టింది
ఫ్రెండ్లీ ప్రభుత్వమంటూ గొంతు నొక్కుతున్నపుడే కదా
గర్జించే గళాలమై ఉద్యమాన్ని హౌరెత్తించింది
ఆర్థిక ప్రయోజనాలన్నిటినీ
ఒక్కటొక్కటి గా కాలరాసినప్పుడే కదా
లక్ష గొంతుకల ఉద్యమం ఉప్పెనై కదలింది
ఆ నిరసన సెగతోనే... మాపై కత్తి గట్టారని తెలుసు
ఆ ఉద్యమ ఫలితంగానే
కక్ష్య సాధిస్తున్నారనీ తెలుసు
అందుకే...
'ఉపాధ్యాయ దినోత్సవ' వేడుక రోజు
మాకే పూజలూ వద్దు .. పురస్కారాలూ వద్దు
మీ సన్మాన సత్కారాలసలే వద్దు
మమ్మల్ని రోడ్డు మీద... దోషులుగా నిలబెట్టకుంటే చాలు
మాకే ఉత్సవమూ వద్దు వూరేగింపు వద్దు
మాకే దండా వద్దు.. దండమూ వద్దు
నలుగురిలో... మమ్మల్ని అవమానించకుంటే చాలు
మాకే గౌరవం వద్దు .. గుర్తింపూ వద్దు
పొగడ్తలూ వద్దు ప్రశంసలసలే వద్దు
మా మర్యాదను... మంటగలపకుంటే చాలు
కీర్తీ వద్దు కిరీటాలు వద్దు
అందలమెక్కించే పదవులసలే వద్దు
సమాజంలో నేరస్తులుగా చిత్రీకరించకుంటే చాలు!
ఆఖరుగా ఒక్కమాట...
'బడి' పిల్లల ముందు..
మమ్మల్ని ఉపాధ్యాయులుగా గుర్తిస్తే చాలు
అది మా ఆత్మ గౌరవానికి ప్రతీక
అదే మాకు మీరిచ్చే గురుపూజోత్సవ కానుక.!
(టీచర్స్ డే బహిష్కరణ నేపథ్యంలో...)
- ఆది ఆంధ్ర తిప్పేస్వామి
77802 63877










