Jun 13,2022 07:13

పంచ స్తంభాలపై
ప్రజాస్వామ్య భవన నిర్మాణం
పట్టమహిషిగా ప్రజాస్వామ్యానికి
పంచమార్గాలు కలసిన చోట
మహా పట్టాభిషేకం !
మతంలో మనిషి కరిగాక మనిషి మాయం
మతం మనిషిగా మారి ఓటై ప్రజాపాలనకో దారి !
కులాల తులాభారంలో
ఆధిపత్య కులం ఓట్ల సంపదై
అన్నిటిని శాసించి అగ్రభాగాన నిల్చి
జనపాలకో రహదారి !
నేలను బట్టి భూసార పరీక్షలు మారినట్టు
అక్షరాస్యుల్ని నిరక్షరాస్యుల్ని లెక్కతీసి
రూపాయి ఓటుగా మారి
ప్రజాస్వామ్యానికో రహదారి !
పల్లెలు పట్టణాలు నివాసాలు విభజనై
అభిప్రాయాలు భాగమై
ఓటు సంశయమైన చోట
మూకుమ్మడి ఓట్ల రద్దు
జనస్వామ్యానికో రహదారి !
చైతన్యం పల్లవించి ఎలుగెత్తిన చోట
మారణకాండై
కాంతిని మూసి గాలిని తరిమి
మూకుమ్మడి రిగ్గింగు
ప్రజాపాలనకోదారి !
గుడ్డి సూత్రంగా
ఐదు దార్లుకే పరిమితం కాదు
కాలానుగుణంగా
సూత్రాలు సంధిస్తూ సంధిస్తూ ...
 

- అడిగోపుల వెంకటరత్నమ్‌
98482 52946