Oct 24,2022 08:16

పదే పదే అవే పాత కతలను
ఎంతకాలమని చెప్పుకుందాం!?
వాస్తవ వర్తమానాన్ని వదిలేసి
గతాల గోతాల్లో ఎన్నినాళ్లు దాక్కుందాం!?

మన చుట్టూ ఉన్నారు నరకాసురులు
ఇక్కట్ల చీకట్లను జనం గుండెల్లోకి నెట్టే
చట్టబద్ధ బకాసురులు మహా మహా బాహుబలులు
లాభాలను తివాచీలా చుట్టే
నానా విధ అద్వానీలూ ఘోర అఘోరీలూ
మెదళ్లను మౌఢ్యం చెదలా చెరబడుతున్న తరుణమిది!
వెలుగు రవ్వలు పొడుపు చువ్వలు కావాల్సింది ఇప్పుడే!

పదో పాతికో కాదు;
శత సహస్ర కంఠాలు వికటాట్టహాసం చేస్తున్నాయి
వికృతంగా విద్వేష చరిత్రను రాస్తున్నాయి
నిన్ను నిన్నలోకి జోకొట్టి
రేపటిని అంధయుగంలోకి గిరాటేస్తున్నాయి
క్రాంతి ఖడ్గాలు అక్షరాలుగా వెలగాల్సింది ఇప్పుడే!

నవ్వుల మతాబులు పూయాల్సిన
పసిపాపల గుండెల్లో
భయ బీభత్సాలు బాంబులై పేలుతున్నాయి
పాఠాల వల్లెవేతలు కిలకిలలుగా రవళించాల్సిన తోట
మహా భయంకర నిశ్శబ్దంతో రోదిస్తోంది!
శాంతి పావురాలు రక్తం కక్కుకుంటూ
రహదారుల నిండా వెక్కి వెక్కి ఏడుస్తున్నాయి!

పదే పదే అదే పనిగా పారాయణం చేస్తుంటే
పాత కతలు పగలబడి నవ్వుతున్నాయి
వర్తమానపు వాస్తవ దృశ్యం
దిక్కులు పిక్కటిల్లేలా హృదయాలను తాకుతోంది!
పురాణపు కాలపు కిరాణా కొట్టులో
తాకట్టు పెట్టిన తలకట్టును విడిపిద్దాం!
ఈ దీపావళి రోజున ఈ ధరాతలాన
ఓ రెండు జ్ఞానదీపాలను వెలిగిద్దాం
ఓ చేతనా స్వరాన్ని వినిపిద్దాం ..!
 

- శాంతిమిత్ర