పచ్చని చెట్లు
ఏపెత్తు పెరిగి విరిగిపోతున్నాయి
కాపులేని కొమ్మల్ని విదిలిస్తూ
రైతును వెక్కిరిస్తున్నాయి
పెట్టుబడి ఏలుబడి
ఏకమై రంకెలేసినాక
నారుమడి నాసిరకపు గింజల్ని
భయంతో విసిరేసి
రాశి వైపు కన్నార్పక చూస్తుండాది
దుక్కి లేని చేను వైపు చూసి
పంట కార్తి నవ్వుకుండాది
నట్టింట్లోకి అరువు తొంగి చూస్తే
పొయ్యిమీద కుండ ఏడ్చినాది
చొక్కా కున్న ఖాళీ జేబు
మొరవిడిచి మొక్కుకుండాది
ఆకలి రాజ్యంలో రాచరికం
పడగలిప్పి బుసలు కొట్టినాక
కడుపున పేగు వణికినాది
సగటు గోడ కూలిపోయినాది
వెన్ను విరిగిన రైతు
మన్ను ముట్టుకుని అంగలార్చితే
భరోసా గుడ్డ కంటి తుడుపైనాది
మింగ మెతుకును మరచిపోయినాది
అన్నం మెతుకెట్లా వచ్చిందని
తీరా మింగేసినాక ఆలోచిస్తే
ఆరగింపు అలిగి కూర్చుండాది
రైతు కాళ్ళకు ప్రణమిల్లినాది
గుట్ట రాళ్ళకు మొక్కినా బాగుండని
అలసిపోయిన నాగలి
దు:ఖాన్ని మింగి కూర్చుండాది
గొప్పలు పోయిన ఏలిక చిక్కులో
వెక్కిళ్లు ఉబికి ఉబికి వస్తావుంటే
ఆకలి రాజ్యం గుర్తుకొచ్చినాది.
- నరెద్దుల రాజారెడ్డి,
సెల్ : 9666016636










