ఉదయాన్నే
ఆమె మనసు కొలనులో
ఒక పసిమొగ్గ తలెత్తి
ఉత్సాహపు ఊపిరులూదింది
అతడి అరుపుకు
ప్రశాంతంగా పరచుకున్న నీరు
అలలు అలలై చెదిరిపోయింది
మధ్యాహ్న వేళలో
కాగితం ఆమెకై ఎదురుచూపైంది
కలం పిలిచి పిలిచి అరిగిపోయింది
గదుల నిండా పరచుకున్న
అలసటతో కూడిన విసుగు ధూళికి
లోపలేదో ముడుతలు పడింది
మొగ్గ ఇక విరియలేనంటూ అలకబూనింది
సాయంత్రం రాత్రి నిరాసక్తంగా వచ్చి
లెక్కలేనన్ని గాయాలను
పరిచయం చేసి వెళ్ళాయి
పడిన రెప్పకూ
తెల్లవారుఝాముకూ నడుమ
చిత్తుకాగితంపై చివరకు
ఒక కన్నీటి కవిత ఒలికింది
చేతిలోంచి జారిపోయిన కాలం
ఆమెను చూసి జాలిగా నవ్వింది!
- పద్మావతి రాంభక్త
99663 07777










