Oct 17,2022 07:49

బద్దలౌతుందనుకున్న చీకటిని
మళ్ళీ ఫాసిజం కమ్మేస్తోంది
చిమ్ముతున్న వెలుతురును
అలముకున్న మేఘాలు
ప్రచండ గాలి అవసరం మేఘాలను పారద్రోల
సమయం ఎక్కువైనా ఎప్పటికైనా వీచు గాలి

ప్రశ్నకి రెండు కోణాలు
ఒకటి రాజ్యం వెన్నులో వణుకు
మరొకటి సమాజ ప్రక్షాళన
మూఢత్వంలో బతకటమే రాజ్యానికి ఊతం
మౌఢ్యాన్ని తరిమే ఏ మెదడునైనా
ఒంటరిని చేయబూనే రాజ్యం!

కావాల్సిన బెంచీలు కావాల్సిన చోట
రావాల్సిన చోట టిక్కెట్లు లేని సీన్లు
కత్తిరింపులతో రంగరించి కాగితాలపై
కసాయి రాతల మేళవింపు
రసవత్తర రాజకీయ సినిమా
బెంచీల్లో కుట్రల బెంచీలు వేరయ్యా!

గంపగుత్తగా నెత్తిన మోయమంటున్న
మతం తాలూకు దేశ భక్తి ముసుగు
హేతువును తాకకుండా పరచిన కంచె
అక్షరం అందరికీ చేరనీయదు
అబద్ధాల పుట్టను కదిపి దశ దిశలా వ్యాపింప చేయు
అదే నిజమని భ్రమింపచేయ నిర్విరామ ప్రయత్నం

వ్యవస్థలన్నింటినీ
గుప్పిట బంధించిన రాజ్యానికి
భయం పులుముకుంది
ఎక్కడో ఓ చోట పుట్టే నిప్పు కణిక
బడబాగ్నియై దహించక మానదు
చరిత్ర పుటల్లో కడు భద్రమా దిగంబర సత్యం!

- గిరి ప్రసాద్‌ చెలమల్లు
94933 88201