Oct 17,2022 07:58

ఈ నేలపై
న్యాయం అప్పుడప్పుడూ
ఒంటి కాలిపై లేచి
కళ్ళను ఎర్రగ చేసి వెర్రిగా నవ్వుతుంది
నిజానిజాలు గుర్తించక
వ్యక్తి శక్తిని, కుయుక్తి కుట్రలుగా మలచి
కటకటాల పాలు చేస్తుంది!
ఇక్కడ ప్రశ్నించడం నేరం
ఎదురొడ్డి నిలబడడం ఘోరం
సమాజాన్ని జాగృతపరచడం హేయం
పాలకుల వికృత చేష్టల్ని ఖండించడం
తీవ్ర తప్పిదం

అన్నీ మరచీ
గొంతో, కలమో కదిపితే
చట్టాన్ని నడిపే చుట్టం
వ్యక్తి స్వేచ్ఛా రెక్కల్ని విరిచి
గోడల మద్య బంధించి
వికటాట్టహాసం చేస్తుంది

ఆరోపణలు కత్తిలాంటివి
గుచ్చాయో, కోసాయో
నిగ్గు తేల్చి శిక్షించాలి కదా
కక్షతో ఒక జీవితాన్ని
అకారణంగా జైల్లో
నిర్బంధించడం నేరమే కదా
విలువైన జీవితం కర్పూరంలా
దు:ఖంలో కరగడం క్రూరత్వం కదా?

న్యాయానికి నాలుక ఉంటే
సమ సమాజ పోరాట యోధులతో
నాలుగు నిజాల్ని పంచి
పోరాట బాటపై నిలిపి నడిపించేది...!

- మహబూబ్‌ బాషా చిల్లెం