వారిలో ఒక నాగలి పలుకుతుంది
అది ఎప్పటిదో
పూడ్చి పెట్టబడింది కాయంలో
ఎక్కడో చాలా దూరం
ప్రయాణించిన తర్వాత
ఇక ఇప్పటికి పిలిచింది
లోపలి నుంచి
ఎద నిండా పచ్చిక మొలుస్తున్నట్టుంది
నుదుటిపై తడి పేరుకుంది
కళ్ళు సూర్యచంద్రులయ్యాయి
చేతులు జోడెడ్లయ్యాయి
కాళ్లు చక్రాలయ్యాయి
గుండె పంపయ్యింది
రోజుకో అవయవం రూపాంతరం చెందుతూ
పేగులు కాలువలయ్యాయి
ఇక లేచి వాళ్ళని వాళ్ళు
మట్టి కాన్వాస్ లోకి నెట్టుకోవడమే
గింజలనే రంగులు నాటి
కుంచెలను మొలిపియ్యడమే తరువాయి
గీస్తారు ప్రపంచ పటంపై వాళ్ళదైన ముద్రతో
మానవాళి ఆకలి తీర్చడానికి ఒక చిత్రం
అది ఏ డాలర్ కు లొంగదు
ఏ ప్రాజెక్టులకు తల వంచదు
ఏ ప్రణాళికలకు దొరకదు
అది నిఖార్సైన శ్రమ చిత్రం
వాళ్ళని వాళ్ళు పంటై ఉత్పత్తి చేసిన
విశ్వ మానవ వర్ణపటం
అది నిరంతరం వెలిగేది
ఏ ఒక్కరిదో కొందరిదో కాదు
అందరిదీ హస్తగతం చేసుకోలేనిది
అభాగ్యుల అన్నార్తుల పంచన చేరేది
దోసిలితో దోసిళ్ళని పంచేది
దేహంతో దాహార్తిని తీర్చేది చైతన్యం కురిపించేది
పిడికిళ్ళతో జ్ఞానజ్యోతిని వెలిగించేది
మానవులను సమానులను చేసేది.
- రఘు వగ్గు










