Jun 13,2022 07:54

పల్లా పరదేశి నాయుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. పేరు పొందిన నఖచిత్రకారుడు. గీతలతో చిత్రాలు గీసే ఒక మంచి చిత్రకారుడు. ఇంకా స్వర మాధుర్యం కలిగిన పాటగాడు. వీటన్నింటిని మించి పిల్లలపై అమిత ప్రేమను కలిగిన బాలల ప్రేమికుడు. అందువల్లనే ఏడున్నర దశాబ్దాల వయసులో 'పూల రేకులు' అనే బాలగేయ సంపుటిని ప్రచురించారు. ఈ సంపుటిలో 46 గేయాలు న్నాయి. ప్రతి గేయం ఈ కవి స్వయంగా వేసిన చిత్రంతో అలరారింది. పాడగలిగే కవి కాబట్టి ప్రతి గేయం లయబద్ధంగా పాడడానికి వీలుగా రాశారు. ఉపాధ్యాయ వృత్తి అనుభవం వల్ల పిల్లలకు ఏమి అవసరమో ఎరిగి ఈ బాలగేయాలు రాశారు. ఇందులో మొదటి గేయం ' కమ్మనైన తెలుగు భాష'. ఈ గేయంలో...
'ఎంత కమ్మనిదమ్మ మన తెలుగు భాష
ఎంత తియ్యనిదమ్మ మన తెలుగు పలుకు' అనే పాదాలను పల్లవిగా తీసుకుని ఘనమైన మన తెలుగు భాషకు అక్షరాభిషేకం చేశారు కవి. 'పిల్లలం పిడుగులం' అన్ని గేయం పిల్లల ప్రతిజ్ఞ గేయమనిపిస్తుంది. గేయంలో పిల్లల మనస్సును ఆవిష్కరిస్తూ...
'మంచిని పెంచుతాం/ వంచన నెదిరిస్తాం
పరుల మేలు కోరుతాం/ ప్రగతిని సాధిస్తాం
విజ్ఞతతో మెలుగుతాం/ వివేకాన్ని చూపుతాం
భారతావని ఖ్యాతిని/ దిగంతాల చాటుతాం'
అని పిల్లల ప్రతిజ్ఞతో ముగించారు.
'అమ్మ' అనే గేయంలో ...
'ఎంత కమ్మని మాట అమ్మ
అమృత తుల్యం అమ్మ
అనురాగ తరంగం అమ్మ
ఆనంద సాగరం అమ్మ' అని అమ్మ విశిష్టత తెలిపి
'అమ్మను మించిన దైవం
ఇలలో ఇంకెవరమ్మా ' అని అడుగుతూ
అమ్మ మీద ప్రేమను పిల్లలకు కలిగిస్తారు.
'రూపం కన్న గుణం మిన్న' గేయంలో
నల్లగా ఉన్నానని బాధపడుతున్న కొడుకుతో తల్లి ...
'నల్లని నేరేడు పండు/ అందరి నోరూరించెను
నల్లని నీళ్ళను చూడ/ ఎల్లరి దప్పిక తీర్చును
నల్లని కోకిల గానం/ చెవులకింపు కూర్చును ' అంటూ...
'నల్లని కృష్ణయ్య/ ఆరాధ్యుడు కాలేదా
రూపులోన ఏమి ఉంది/ గుణము లోని గొప్ప ఉంది
మంచి పనులు చేయు వారి / నాదరింతు రంతమంది' అని జీవిత సత్యం చెప్పి ఆత్మన్యూనత పోగొట్టింది. 'ఏమంటావు' అన్ని గేయంలో చెట్టు, ఏరు, కొండ, పువ్వు,గువ్వ, సంద్రం, హరివిల్లు మొదలైన వాటి నుంచి పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలు కవి ముచ్చటించారు.
ఈ గేయసంపుటిలో 'వానాకాలం' గేయం వర్షాకాలం ముచ్చట్లు తెలిపే గేయం. 'మబ్బులు' గేయం మబ్బుల ఆకారాలు వర్ణనతో ఆనందపరుస్తుంది. 'నా మంచి నేస్తం' గేయం ఒక మంచి మిత్రుడు ఎలా ఉంటాడో చెప్పింది. 'ఇలలో పిల్లలు' గేయం పిల్లలపై కవికి గల ప్రేమను తెలుపుతుంది. 'అలక-పిలక' గేయం అంత్యప్రాసలతో నడిపిన గేయం.
ఇలా గేయ సంపుటిలోని ప్రతి గేయం పాడుకోదగినది ,చదవదగినది, ఏదో ఒక సందేశం ఇచ్చేదే! ఇటీవల ఈ చక్కని పుస్తకాన్ని పార్వతీపురం స్నేహ కళాసాహితి వారు ప్రచురించి తెలుగు బాలబాలికలకు కానుకగా అందించారు. ఏడు పదులు దాటిన ఈ కవి తన అనుభవాల స్ఫూర్తితో మంచి బాలగేయసంపుటులు, బాలల కథా సంపుటాలు తీసుకురావాలని కోరుకుందాం.
 

- బెలగాం భీమేశ్వరరావు