Sep 01,2022 12:25

ప్రజాశక్తి - మైలవరం (ఎన్‌టిఆర్‌ జిల్లా) : భవన నిర్మాణ కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా, నిర్మానుషంగా వ్యవహరిస్తుందనిబిల్డింగ్‌ వర్కర్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి నరసింహారావు అన్నారు. మైలవరం మండలం వెల్వడం గ్రామంలో రెయిన్బో పెయింటర్స్‌, అక్షర తాపీ వర్కర్స్‌ కార్మికులతో సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పిల్లి నరసింహారావు మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో పనులు లేక, ఒక ప్రక్క అధిక ధరలతో, ఇసుక అందుబాటులో లేక పనులు కోల్పోయి వందలాది మంది కార్మికులు మరణించారని, అయినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఈ నెల 13వ తేదీ జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల దగ్గర భారీ స్థాయిలో ధర్నాల నిర్వహిస్తున్నామని తక్షణమే పెండింగ్లో ఉన్న క్లైమూలన్నీ పరిష్కరించాలని, సంక్షేమ బోర్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరలించిన నిధులను 430 కోట్లు తిరిగి చెల్లించాలని, సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తూ తీసుకువచ్చిన జీవో నెంబర్‌ 1214 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్‌ సుధాకర్‌, రెయిన్బో పెయింటర్స్‌ యూనియన్‌ నాయకులు, ప్రత్తిపాటి నాగేశ్వరరావు, రవికుమార్‌, శ్రీను, వరప్రసాద్‌, తాపీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.