Oct 22,2022 07:40

వడగళ్ల వానలో
కన్నీటి వాగులు పారుతూ
మట్టి ముట్టిన చేతులు
ఒట్టిపోయి కనిపిస్తున్నాయి
కంకి మీద నవ్విన గింజ
యేటి పాలై ఏడుస్తుంటే
రైతు బతుకు కంట నీటి చుక్క
వెక్కిళ్లు పెట్టి అలసిపోయినాది
మట్టిని ముద్దాడిన నాగలి
చేను కోతల రైతు రాతను చూసి
గుండె పగిలి నేలకొరిగినాది
రెక్కలిప్పిన పిట్ట
పొలం స్నేహాన్ని విడిచిపెట్టి
శూన్యంలోకి ఎగిరిపోతుంటే
సెలక గట్టు అంగలార్చినాది
పేగులెండిన కడుపుతో
అరువు కుంపటి ఎత్తుకున్న రైతు
బిక్కు బిక్కు మంటూ చూస్తుంటే
నేలతల్లి మోము నల్లబడినాది
చేయూత లేని కాలం
కాలనాగై తిరగబడుతుంటే
హృదయం ద్రవించిపోయినాది
చదును చేసిన గడ్డపార
రాశికి రాని పంటను చూసి
నెత్తిన చేయి పెట్టుక్కూర్చున్నాది
నాసిరకం విత్తులు పగలబడి నవ్వుతుంటే
పలుగు పార బిత్తరపోయినాయి
రైతు బ్రతుకు సంద్రమై
కెరటాలై పడి పడి లేస్తున్నా
ఏ చూపుకు కనికరం
ఇసుమంత లేకపోయిందే అని
కాడెద్దుల బండి
మోకాళ్ళపై కూర్చుండి పోయినాది.

- నరెద్దుల రాజారెడ్డి,
సెల్‌ : 9666016636000