Sep 26,2022 07:37

చూరెక్కి కూతెట్టి సూర్యుణ్ణి నిద్రలేపి
రెక్కలాడిస్తూ కొమ్మల్లో, రెమ్మల్లో
నిద్దరోతున్న పక్షులకి పాట అప్పజెప్పి
చీకట్లను పారిపొమ్మని హెచ్చరించిన పుంజుని
గుమ్మాల ముందు కల్లాపి జల్లుతున్న కోడళ్ళు
నానా శాపనార్ధాలు పెడుతున్న వేళ ...

నోట్లో వేప్పుల్ల పెట్టుకుని, నాగలి భుజానేసుకుని
కాడెద్దుల వెనుక నడుస్తున్న రైతన్నని
గర్వంగా గంతులేస్తూ చూస్తుంది ఊరి చెరువు
కోవెల మెట్టులాంటి చేనుగట్టు మీద
కంజీరాలు మోగిస్తున్న పాదాలు నెత్తిన మోస్తున్న
చద్దన్నం బుట్టల్లోకి తొంగిచూసే ప్రయత్నంలో
సగం నేలకి వాలిన తాటిచెట్ల నీడదాటి
నెమళ్ళబారులా నడిచొస్తుంటాయి పల్లె అందాలు
క్షామ ఛాయలు తాకని ఊరి క్షేమం కోసం
గ్రామదేవతకు పాల పొంగళ్ళు పెడతారు అమ్మలు
భూమి యజ్ఞం రధానికి చక్రాలైన బసవన్నలు
ఉల్లి మిరపని సద్దిలో నంజుకుంటున్న రైతన్నని చూస్తూ
యాగక్షేత్రంలో నిరాఘాటంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి

రేపటి నేలంతా పచ్చ దుప్పటి కప్పుకున్న కలని సాక్షాత్కరించుకుని
యజ్ఞ భూమిని అలికి పేడ నీళ్ళను జల్లను గాలితో జతకూడి
సూర్యుణ్ణి చుట్టుముట్టి కిరణ రాజ్యాన్ని ఆక్రమిస్తున్న మబ్బులు
చెట్టుచెట్టుకీ కోటికోటి పచ్చనాకుల జెండాలు ఎగిరేస్తున్నాయి
పొలం గుండెల్లోకి ఇనుప పిడికిలితో దిగుతున్న అరక
మెరకను చదును చేస్తూ మెత్తని పూలకత్తిలా మారిపోతుంది
విత్తు కొరకు, పెదవులు విప్పిన చేనంతా చేవతో
వళ్ళు విరుచుకుంటున్న నల్ల బంగారు గనిలా అనిపిస్తుంది
పొలం కవి చేను నిండిన కవితల పంటను నిండుగా చూసి
గగనానికి కృతజ్ఞతలు తెలుపుతూ మట్టిని ముద్దాడుతాడు!

- డాక్టర్‌ పెరుగు రామకృష్ణ
98492 30443