Sep 12,2022 07:09

నుష్యుల్లో ఉండే దోపిడీలు, దౌర్జన్యాలు, మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లు, అత్యాచారాలు, దేవుళ్ల వ్యాపారం... కుక్కల్లోనూ, నక్కల్లోనూ లేవే అని డి.ఆర్‌.ఇంద్ర సూత్రీకరించడానికి తన జీవితానుభవాలే కారణం. ఆ అనుభవాల్ని గుదిగుచ్చి ఆత్మకథ 'ఇంద్రప్రస్థానం'గా మన ముందుంచారు. పాతికేళ్ళ క్రితం డి.ఆర్‌.ఇంద్ర రాసిన 'ఉత్తుత్తి మనుషులు' కథ చదివినపుడు అనేక విషయాలు చర్చకు రావడం గుర్తుంది. సమాజానికి అవసరమైన ఏ వస్తుసేవల ఉత్పత్తిలోనూ పాలుపంచుకోని, ఎంత మాత్రం శ్రమించని పరాన్నబుక్కుగా ఆ వస్తుసేవల్ని అనుభవించే ఒక సామాజిక వర్గం వారిని ఉత్తుత్తి మనుషులుగా ఎండగడుతూ రాసిన కథ అది. వాళ్ళ సంస్క ృతే శ్రమకు దూరంగా ఉండేలా చేసిందని అని చెప్పిన కథ. అలాగే ఆయన రాసిన వివాదాస్పదమైన 'రావణ జోస్యం' కథ ఎంతో దుమారం రేపింది. పురాణ గాథలకు నేటి సమాజ పోకడల్ని దృష్టిలో పెట్టుకుని పునర్మూల్యాంకనం చేయడం కొత్త కాదు. ఊహాశాలితతో ఆలోచనాత్మక విశ్లేషణ చేయడమే ఇది. ఆ సంగతి అలా ఉంచితే ... ఒక వ్యక్తి బాల్యావస్థలో ఎదుర్కొన్న కష్టాలూ దు:ఖాలూ కుటుంబంలో కోల్పోయిన ఆసరా, చుట్టూరా అలుముకున్న దుర్భర వాతావరణం, ఏమీ పట్టనట్టుగా భార్యాపిల్లల్ని వదిలేసి వెళ్లిపోయిన తండ్రి అనబడే అమ్మమొగుడు... వీటన్నింటినీ అధిగమించి నిలబడి పైకి ఎగసిన విధానం తెలుసుకోవాలంటే నేటితరం యువత ఈ ఆత్మకథ చదవాలి. ఈ ఆత్మకథ నిండా మనం ఎంతో కీర్తించే, ఆదర్శంగా తీసుకునే రామాయణ, భారతాల పురాణ పురుషుల్నే ఉదాహరణగా చూపిస్తుంటారు డి.ఆర్‌.ఇంద్ర. మనం ఎరిగిన కథల పాఠాల సారాంశాన్ని గుర్తు చేస్తుంటారు. తనకు ఎదురైన ప్రతి సంఘటననూ వాటితో పోల్చి న్యాయాన్యాయాలు నిర్ణయించమని చెబుతారు.
     ఎవడు బతికేడు మూడు ఏభైలు అన్నట్టు మనిషి తన ముందు తండ్రి, తాత, ముత్తాత... కంటే ఇంకా ఎన్ని తరాల్ని అన్వేషణ చేసి కనుక్కోగలడు? ఎవరూ నాలుగైదు తరాలకు మించి చెప్పడం కష్టమే! ఇంద్ర భరద్వాజ గోత్రానికి చెందినవాడు. భరద్వాజుని పుట్టుపూర్వోత్తరాలు వెలికి తీయడానికి ఆర్య, అనార్య చరిత్రను బయటకు తీసి అసంభావ్యతను నిరూపించడంతో మొదలౌతుంది ఆత్మకథ. అందరిలో ప్రవహించే రక్తం ఒకటే. అందరూ సమానులే. సమాజంలో ఒక వర్గం వారు వర్ణవ్యవస్థను సృష్టించారు. జనాల్ని మతం మత్తులో అజ్ఞానంలో భయంలో ముంచి మోసగిస్తూ శ్రమించకుండా పొట్టపోసుకోడానికి పురోహిత వర్గం పన్నిన ఎత్తుగడల ఫలితమే ఈనాటి సమాజం. అగ్రకులాల ఆధిపత్యం, దిగువ కులాల అణచివేత, స్త్రీల అమానవీకరణ, అత్యాచారాలతో పితృస్వామ్య భావజాలానికి పెద్ద పీట వేయడం తప్ప పురాణాల్లో ఇతిహాసాల్లో మరొకటి ఉండదని ఘంటాపథంగా తన జీవితానుభవాల సాక్షిగా ఇంద్ర ఆత్మకథలో చెప్పడానికి ప్రయత్నించారు.
    డి.ఆర్‌.ఇంద్ర నమ్మకాలూ, విశ్వాసాలూ గట్టివే. తగిన కారణాలతో బలంగా నమ్మినవే. అయితే ఆయన జీవితం వైరుధ్యాల పుట్ట. ఈ మాట అనడానికి కారణముంది. తను ఎన్నింటినో అసహ్యించుకుంటాడు. ఎండగడతాడు. చీదరించుకుంటాడు. తీవ్రంగా విమర్శిస్తాడు. మనసా వాచా నమ్మిన దాన్ని ఇతరుల కోసం మళ్లీ తనే పలు కారణాలతో సమర్ధిస్తాడు. రాజీ పడిపోతాడు. ఎదుటి వ్యక్తి నమ్మకాల్ని గౌరవించాలనే ఆయన మనస్తత్వం అందుకు కారణమై ఉంటుంది. ఈ ఆత్మకథ నిండా అట్లాంటి సర్దుబాట్లు చాలా ఉండటం గమనిస్తాం.
     తనకు నమ్మకం లేకపోయినా తాత్కాలికంగా జంధ్యం వేసుకోవడం (చిన్న వయసులో పెంట మీదకు విసిరేసాడు), సత్యనారాయణ వ్రతం- పీటల మీద కూర్చోవడం (ఇతర కుటుంబ సభ్యుల్ని సంతృప్తి పరచడం కోసం), దేవాలయాలు సందర్శించడం (భక్తితో కాదు; ప్రశాంత వాతావరణం, శిల్ప సౌందర్యం)... ఇవన్నీ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరించి మనల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. వైయక్తిక పరిధిలో కూరుకుపోయే ఇంట్రోవర్టులు సమాజంలో మార్పులకు బాధ్యులు కాకపోవడం వల్ల భావ విప్లవకారునిగా పరిగణించలేం. అవిశ్వాసాలు, అపనమ్మకాలు జీవితంలో నెగ్గుకు రావడానికి అడ్డం కాలేదు.
అతి సాధారణంగా కనిపించే డి.ఆర్‌.ఇంద్ర... లోలోపల అగ్నిగోళాల్ని మోస్తున్న వాడు. అనేకానేక సంచలనాలకు మారుపేరుగా నిలిచినవాడు. తను నమ్మిందే వాస్తవమని చెప్పి వివాదాలకు చిరునామా అవుతాడు. నిర్భయం, నిర్మొహమాటం ఆయన సొత్తు. యధార్థవాది లోక విరోధి అన్నట్టు ఎంతోమంది మిత్ర శత్రువుల్ని పోగుచేసుకున్నారు. ఆయన మానసిక ప్రవృత్తి మంది దృష్టిలో అరాచకం. నిజానికి హేతువాదులెవ్వరూ అరాచకులు కాలేరు. అరాచకునిగా చెప్పుకున్న ఇంద్ర దీనికి మినహాయింపు. బాల్యం నుంచి సైన్సు పట్ల ఆపేక్ష కలిగినవాడు. శాస్త్రీయమైన ఆలోచనలతో దేన్నైనా ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకున్నాడు. బ్రాహ్మణీయ భావజాలాన్ని దూరంగా విసిరి కొట్టి మానవతావాదం, భౌతికవాదం వైపుగా నడిచాడు.
    సగటు బ్రాహ్మణ స్త్రీల మనోవేదనకు దర్పణంగా ఉండే వారందరూ తన దగ్గర బంధువులే. వాళ్ళ జీవితాల్లోని దైన్యస్థితి బాధాకరంగా విషాదంగా ఉండటాన్ని చిన్నప్పట్నుంచీ గమనించాడు. ముందు నుంచీ ఇంద్రకు స్త్రీలంటే అపారమైన ప్రేమ, అభిమానం. ఇది అమ్మ, భార్యల వల్ల మరింత పెరిగింది.
    ఎదురైన ప్రతి సంఘటన లోంచి ప్రశ్నల ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునేవాడు. ఉపాధ్యాయ వృత్తిని చిన్నప్పట్నుంచీ నిరసించాడు. పాఠం చెప్పే పద్ధతులు నచ్చేవి కావు. వెనక బెంచీలో కూచుని పుస్తకాలు చదివేవాడు. డిగ్రీ తర్వాత వేరే ఉద్యోగంలో చేరినా కుదురుగా ఉండలేకపోయాడు. కానీ రాజమండ్రి, గోదావరి మీద ఉండే ఇష్టం ఆ ప్రాంతం విడిచి కదలక్కర్లేని టీచరుగా మలచింది. తన జీవిత కాలమంతా మున్సిపల్‌ ఉపాధ్యాయునిగా గడిచింది.
పెద్ద మేనత్త బాల్య వివాహం చేసుకోవడం, ఆ భర్త గుటుక్కుమనడం, ఆమె జీవితాంతం బోడిగా బతకడం, అర్థం కాని మంత్రాలు చదివి పొట్ట పోషించుకోవడాన్ని సిగ్గుగా తలచడం (అర్థం తెలియకుండా మంత్రాలు వల్లె వేయడం), వైదిక నిష్ఠలను ఈసడించుకోవడం, నిష్పూచీగా బాధ్యతారహితంగా వ్యవహరించిన తండ్రి పట్ల ఏవగింపు కలిగి ఉండటం... అలాగే ఉపాధ్యాయులు చెప్పేదంతా చెత్త అనుకున్నవాడల్లా తను అదే వృత్తిలోకి చేరడం, దేవుని నమ్మడు గానీ మనసును నిర్మలంగా ఉంచుకోవడం కోసం దేవాలయాల్ని సందర్శించడం, చారిత్రక స్థలాల్ని మక్కువతో ప్రత్యేక దృష్టితో చూడటం, ప్యూడల్‌ రాజుల నిర్మాణాల పట్ల ఆసక్తి కనపరచడం, అబ్బురపడటం... ఇవన్నీ విభిన్న వ్యక్తిత్వానికి ఉదాహరణగా నిలిచేవి. కడకు వీటివల్ల తనకు తోచినట్టు బతకాలనే తలంపును కలిగించాయి.
    'వేదాలంటే ఇవేనా?' అన్న వెలగా వెంటప్పయ్య పుస్తకం చదివి ఉత్తేజితుడయ్యాడు ఇంద్ర. అడుగడుగునా మాంసభక్షణం, సురాపానం ప్రసక్తులతో ప్రార్థనలు చికాకు కలిగించాయి. అర్థం చేసుకుంటే కాసింత విజ్ఞతతో ఆలోచిస్తే ఎవరైనా గుండెలు బాదుకుంటారని తలచాడు. వేదాల్లో పచ్చి బూతును ఆ వేదాల్లోంచే ఎత్తి చూపిన అరుదైన పుస్తకం అది. అందరూ చదివితే ఇదేనా వేదం అనుకుంటారనే ఉద్దేశంతోనే వేదాల్ని అందరూ చదవకుండా కొన్ని కులాలకే పరిమితం చేసి నిషేధించారని ఇంద్ర చెప్పడాన్ని ఈ ఆత్మకథలో చూస్తాం.
సాహిత్యానికి సంబంధించి తనదైన శైలితో తెలుగు కథాప్రియుల్ని ఆకట్టుకున్నారు. రావిశాస్త్రి కథనశైలిలో రాసి మెప్పించి బహుమతి సాధించారు. రావణజోస్యం లాంటి కథలతో పెద్ద వివాదానికే కేంద్ర బిందువు అయ్యారు. ఇంద్ర కాలక్షేప కథలు రాయలేదు. ఏ కథ రాసినా ప్రగతిశీలమైన అభ్యుదయమైన సందేశం ఇవ్వడానికే ప్రయత్నించారు. చెప్పదలుచుకున్న విషయాన్ని నసుగుడు లేకుండా స్పష్టంగానే చెప్పారు. వర్తమాన సమాజం తీరుతెన్నుల పట్ల వ్యంగ్యంగా అనేక వ్యాసాలు, గల్పికలు రాశారు. డార్లింగు (భార్య)కు ప్రేమతో రాసిన అసంఖ్యాక ఉత్తరాలు శాస్త్రీయ దృక్పథం అలవడటానికి బాటలు వేసేవే. ఆ ఉత్తరాల వల్ల భార్య ఎంతో నేర్చుకున్నారు. ఇది ఆయన వ్యక్తిత్వం పరిచయం చేయడానికి మాత్రం ప్రస్తావించడం జరిగింది. వ్యక్తిగతమే అయినా ఉదాత్త సంస్కారం అలవరచుకోడానికి ఉపయోగపడ్డాయని చెప్పడానికే ఇదంతా.
    డి.ఆర్‌.ఇంద్ర వ్యక్తిత్వాన్ని నెమ్మదితనంతో ఆయన చేసిన పోరాటాల్ని బేరీజు వేసుకుంటూ ఈ ఆత్మకథ చదవాలి. ఏదో కాలక్షేపం నవల చదివినట్టుగా చదివితే కుదరదు. ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం చుట్టూ తిరుగాడుతున్నట్టుగా చదవాలి. ఒక ప్రశ్నను తనలోంచి పుట్టించుకుని జవాబుల్ని రాబట్టుకోవడం ఎలాగో తెలుసుకోవడం కోసం ఈ పుస్తకాన్ని చదవాలి. లక్ష్యాల్ని ఏర్పరచుకుని గమ్యం చేరడం, కలల్ని సాకారం చేసుకోవడం, ఏదైనా సాధించగలమనే నమ్మకాన్ని కలిగి ఉండటం ఈ ఆత్మకథ సారాంశంగా చెప్పుకోవచ్చు.
    డి.ఆర్‌.ఇంద్రకు నిర్ధిష్టమైన అభిప్రాయాలున్నాయి. ఎవరి నమ్మకాలు విశ్వాసాలు వారివి గనుక దానితో ఎవరికీ పేచీ ఉండనక్కర్లేదు. ఇకపోతే- కథల్లోకి ఎంత నిడివైన జీవితాన్నైనా ఇమడ్చవచ్చనే అభిప్రాయం ఇంద్రకు ఉంది. అందుకే ఆయనకు కథలంటే గొప్ప ఇష్టం. తనను తాను కథల్లో చూసుకోవడమే కాదు, ఏదైనా రాసి తిట్టించుకోవడమూ ఇష్టమే! అలాంటి వాడు కథలు రాయడం మానేస్తే ఎలా? రాయకుండా ఉండలేనితనం తప్పక వస్తుంది. కథను వాహికగా చేసుకుని అపార అధ్యయన విశేషంతో సొంతంగా తీర్చిదిద్దుకున్న భావాల్ని ఇతరులకు పంచడానికైనా ఆయన రాయాలి. 'ఇంద్ర ప్రస్థానం' ఆలోచనాత్మకంగా ఉత్కంఠతో సాగుతూ మంచి పఠనానుభవాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు.

- దాట్ల దేవదానం రాజు
94401 05987