ఎవడి శరీరం వాడిదైనట్టు
ఎవడి భాష వాడిది
భాషని అగౌరవపరిచినవాడిని
భాషపై అధికారం నెరిపేవాడిని
భాషని మాంత్రిక కొయ్యకి వేలాడదీసి
ఉరితీయాలనుకునేవాడిని
లోకం ఒప్పదు
లౌకికత్వం ఈ నేల రక్తం
భిన్నత్వం ఈ నేల సౌరభం
ఎవడి ఆకలి వాడిదైనట్టు
ఎవడి ఆహారం వాడిదైనట్టు
ఎవడి భాష వాడిది
లిలిలి
భాష నా అస్తిత్వ వాచకం
లిలిలి
నా ఆకాశం మీద
నా అస్తిత్వ శిఖరం తప్ప వేరే ఏ శిఖరం
మొలకెత్తడాన్ని ఒప్పుకోను
నా దారిలో వేరేవాళ్లెవరో విసిరే
ముళ్లూ రాళ్లనూ ఒప్పుకోను
నా భాష మీద ఇంకో భాష పెత్తనాన్ని
ఎలా ఒప్పుకుంటాను?
భాష మా అమ్మ తినిపించిన
అన్నం ముద్ద
నా ఆకలి బాధ మా అమ్మకు
తెలిసినంత ఇంకెవరికి తెలుస్తుంది
భాషది కూడా అమ్మ స్థాయి
నా భాష రెక్కలను విరిచి
ఇంకో గొడుగు కింద నిద్రపొమ్మంటే
ఎలా ఒప్పుకుంటాను?
నా భాషంటే నా రక్తం నా ఊపిరి
నా భాషలో నేను ఏడుస్తాను
నా భాషలో నేను నవ్వుతాను
నా భాషంటే నేనే.. నేనంటే నా భాషే
నా భాషంటే నా బతుకే!
బతుకునే చెరిపేస్తానంటే
నువ్వే గీతలు గీసినా చెరిపే తీరుతాను
ఏ పీఠాలనైనా కూల్చే తీరుతాను!
- చంపావతి
96764 93680










