పాతికేళ్ళ చదువును
విప్పుతుంటే
లోపలంతా గుల్లగుల్లగా కనబడుతోంది !
నలభై మంది.. పది రోజుల్లో చేసే పని
ఇరవై మంది ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారన్న
ప్రశ్న అడుగును తడుముతుంటే
మెత్తని మోసమేదో చేతులకు అంటుకుంటోంది
కూలీల సంఖ్యా పనిపూర్తయ్యే రోజులూ
ఒక దానికొకటి విలోమాలు సరే
అదనపు శ్రమకీ రూకలకీ మధ్య
ఉండాల్సిన అనుపాతం మాటేమిటి?
నిమిషంలో ప్లాట్ ఫామ్‌ని దాటెళ్లిపోయే రైలుది
ఎంత వేగమో లెక్కుంది కానీ
ఊళ్ళో ఆగని రైలులోకి దూకే ఆకలి పేగుకు
ఎంత వేగం ఎంత తెగింపో లెక్క ఉండదు!
తీసుకున్న అప్పు ఎన్నేళ్ళల్లో
రెట్టింపవుతుందో చెప్పే వడ్డీ సూత్రం
అన్నే ఏళ్ళల్లో ఆత్యహత్య చేసుకున్న నాగళ్ళు
ఎన్ని రెట్లయ్యాయో చెప్పలేక నీళ్ళు నములుతోందే ..!
ఒక డాలర్ పువ్వులోని రూపాయి రేకుల్ని
విడదీసి చూపే ఆధునిక ద్రవ్యమానం
ఒక రాజధాని ఈక్వల్ టూ రెండు జెండాల తీసివేత అనో
వేల ఎకరాల రాజకీయ స్వార్థ సంకలనమనో
ఏ ప్రమాణాల్లో కొలవాలో తేల్చనే లేదే
బడ్జెట్ లెక్కలన్నీ
బతుకుల చుట్టూ పేర్చిన అసమీకరణాలేనని
కొన్ని కల్పిత సంఖ్యల గారడీ లేనని
ఏ చాప్టరూ చెప్పదు
కనీసం రుణ సంఖ్యల్ని నేర్పేటప్పుడైనా
అనుమానించాల్సింది
ఇక తలపై మోపేదంతా 'రుణ'భారమేనని
అభివృద్ధి గుర్రాలన్నింటిదీ 'రివర్సు' పరుగేనని ..
ప్రతిక్షేపణ ఒక పద్ధతేనని పొరబడ్డాను
ప్రజల స్వేదాన్నంతా
ప్రైవేటుతో ప్రతిక్షేపిస్తున్నప్పుడే తెలిసింది
ఇవాళ్టి విధ్వంసాన్ని
చిన్నప్పటి నుంచే అలవాటు చేసే విధానమని ..!
ఒక నిర్వాసితుడి కంటికి
దేశాన్ని ఉన్నతంగా చూపే కోణం కోసం
త్రికోణమితి నిష్పత్తులన్నీ గాలిస్తూనే వున్నాను
నా గోల్డ్ మెడల్లూ ఏ ప్లస్ గ్రేడ్లూ డిస్టింక్షన్లూ
అద్దాల అల్మరాల్లో గొంగళి పురుగులు!
- సాంబమూర్తి లండ










