వాన ఏకధాటిగా కురుస్తూ
ప్రకృతి తలారా స్నానించి
తళతళలాడుతూ ...
మొగ్గ విరియడానికి
ఉవ్విళ్ళూరుతూ ...
కొమ్మ
తడిసిన పూల బరువుకు
నేల గుండెపై తలవాల్చి
విత్తులు ప్రసవిస్తూ
మునుపుటి వేడిసెగలకు
చింతపడిన చిగురులు
చినుకుల చక్కిలిగిలికి
మనోహరంగా నవ్వుతూ ...
రంగురంగు దృశ్యాల
ఆకుపచ్చని వర్ణచిత్రం
లిలిలి
రోజులను రాలుస్తూ
మబ్బుల పురి విప్పిన ఆకాశం
మట్టితో ఎడతెగని మంతనాలాడుతూ
లిలిలి
వానకు
వాకిట్లోని ముగ్గు చెరిగి
అందమైన దృశ్యం చెదిరి
రోడ్లు వరదలను మింగలేక
పాదాలు ప్రవాహాలను ఈదలేక
గొడుగులు వానధాటిని జయించలేక
కాలువలు సముద్రాలై
అంతా అతలాకుతలం!
పిట్ట
ఎండిన డొక్కనెగరేసి
రెక్కలారబెట్టుకుంటూ
నింగిని పలకరించడానికి
అదనుకై చూస్తూ ...
వాళ్ళు
పొట్ట తడుముకుంటూ
చిల్లుల చూరుకు
చూపులను గుచ్చి
పనిని పలవరిస్తూ
ఎండపొడకై ఆత్రపడుతూ ...
నాణానికి మరొక ముఖం ఉంటుంది
దాని పేరే ఆకలి !
- పద్మావతి రాంభక్త
99663 07777










