Jun 30,2023 11:26

న్యూయార్క్‌ : అమెరికాలో ఈ ఏడాది 4వ త్రైమాసికంలో మాంద్యం సంభవించే అవకాశం ఉందని బ్రిటిష్‌ బ్యాంకు హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. వచ్చే సంవత్సరంలో పశ్చిమ ఐరోపాలోనూ మాంధ్యం ఏర్పడే అవకాశం ఉందని కూడా హెచ్‌ఎస్‌బిసి అంటోంది. అనేక ఆర్థిక వ్యవస్థల స్టాక్‌, బాండ్‌ మార్కెట్లు విత్త, ద్రవ్య విధానాలతో సరిపోలకపోవటంవల్ల మాంధ్యం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్‌ఎస్‌బిసి ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ సంవత్సరం మధ్యలో అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికీ కొన్ని విభాగాలు పటిష్టంగా ఉన్నప్పటికీ మిగిలిన విభాగాల క్షీణత మాంధ్యం సంభవించే అవకాశాన్ని చూచిస్తోంది. అమెరికాతో పోల్చినప్పుడు ఐరోపా పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ స్థూలంగా చూసినప్పుడు వీటి మధ్య సారూప్యత కనపడుతోందని హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్‌ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌, జోసెఫ్‌ లిటిల్‌ తన నివేదికలో పేర్కొన్నారు.
         బ్రిటీష్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ద్రవ్యోల్బణాన్ని అరికట్టటం కోసం బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ (బిఒఇ) తన వడ్డీరేటును గత 15 సంవత్సరాలలో ఎన్నడూలేనంతగా 5శాతానికి పెంచిన తరువాత వారానికి ఈ హెచ్చరికను చేయటం జరిగింది. మే నెలలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి వడ్డీరేటును 5.25శాతానికి పెంచింది. ఇది 2007 తరువాత అత్యంత అధికం. ఇదే కాలంలో యూరో జోన్‌లో ద్రవ్యోల్బణాన్ని అరికట్టటానికి యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఇసిబి) యూరోజోన్‌ వడ్డీరేటును 3.75 శాతానికి పెంచింది. ఇవన్నీ పశ్చిమ దేశాలలో మాధ్యం ఆగమనానికి సూచికలుగా ఉన్నాయి.