Aug 19,2022 06:43

మేం అధికారం లోకి వచ్చాక సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామన్న వై.యస్‌.ఆర్‌.సి.పి. ప్రభుత్వం దాని ఊసే మరిచింది. దశల వారిగా క్రమక్రమంగా నిషేధం విధిస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టింది. అది నమ్మి ఎందరో మహిళలు ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి ఆ పార్టీని గెలిపించారు. అధికారంలోకి వచ్చాక ఆ విషయం మరచి మడమ తిప్పినట్లు అయింది. మద్య నిషేధం చేయకపోగా ధరలు అమాంతం పెంచేసింది. ఇక్కడ ప్రభుత్వం ఒకటి తలిస్తే మరొకటి అయింది. మద్యం ధనికులే కాదు. కూలి, నాలి చేసుకునే పేదలూ సేవిస్తారు. అయితే వచ్చిన డబ్బంతా తాగుడుకు ఖర్చు పెట్టి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. మేం అధికారంలోకి వస్తే కుటుంబాలను గుల్ల చేస్తున్న మద్యాన్ని దశల వారీగా నిషేధించి అడపడచుల కళ్ళల్లో కాంతి రేఖలు పూయిస్తామని ఎన్నో ఆశలు కల్పించారు. ఇప్పుడు వై.యస్‌.ఆర్‌.సి.పి అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. మద్యం అనే మాటే ఎత్తడం లేదు. కల్తీ మద్యం తాగి చనిపోయినప్పుడు వివిధ ప్రసార మాద్యమాలలో ఆ కుటుంబాన్ని చూపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటుందే తప్ప మద్య నిషేధంపై ఎలా అడుగేయాలో ఆలోచించడం లేదు. మాటలతో వచ్చిన ప్రభుత్వం మాట తప్పింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునైనా మద్య నిషేధాన్ని అమలు చేయాలి.
 

- కనుమ ఎల్లారెడ్డి