ఈ దేశ నేల మీద మట్టికణాలు ఉన్నంతవరకు బ్రిటీషువాడితో పోరాడిన వీరుల చరిత్రలు చిరస్మరణీయంగా ఉంటాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవస్ఫూర్తిని బాల్యంలోనే తన శ్వాసగా మార్చుకుని తెల్లవాడి మీద తిరుగుబాటు జెండాను ఎగురవేసిన పోరాట యోధుడుగా, బహుభాషా అధ్యయనవేత్తగా, భూపోరాటాల చైతన్యమూర్తిగా, రాజకీయ రంగంలో చివరి శ్వాసదాకా మచ్చ లేని నేతగా తన ప్రత్యేకతను నిలుపుకున్న ఒక స్మరణీయుడి జీవితగాథ ఆధారంగా ఎస్.డి.వి.అబ్దుల్ అజీజ్ రచించిన స్వాతంత్య్రోద్యమ నవల 'అల్లూరి సత్యనారాయణరాజు'. ఈ నవలలో ఒక వ్యక్తి జీవిత విశేషాలే కాదు, స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న ఎందరో దేశభక్తుల వివరాలు, సత్యాగ్రహాలు, జైలుశిక్షలు, ఉరితాళ్ళ విన్యాసాలు, కాల్పులు, ప్రజల నినాదాలు, నేతాజీ నేతృత్వ సైనిక సమీకరణాలు, దేశభక్తి గీతాలు, భగత్సింగ్ విప్లవ పోరాటాలు, పోలీసుల హింసలు, తెలుగు నేల మీద కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ సన్నివేశాలు, స్వాతంత్య్రానంతరం దేశంలో జరిగిన మత కలహాలు, వాటి పరిణామాలు; ఆ తరువాత రాజకీయాల్లో చోటుచేసుకున్న కుట్రలు, కుతంత్రాలు, వివిధ పార్టీ నాయకుల పోకడలు, పరిణామక్రమంలో పలు మార్పులు చెందిన ప్రజాజీవన సాంఘిక, సాంస్క ృతిక, వ్యవహారాల సంగతులు ఎన్నో ఉన్నాయి.
పుట్టగానే ఏ మనిషీ అసమాన్యుడు కాలేడు. తన చుట్టూ వున్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని, వాటికి స్పందించి, సామాజిక స్పృహను ఏర్పరచుకుని, దైనందిక సంసారిక అవసరాలను, ఒత్తిళ్ళను అధికమించి, త్యాగాల వైపు జీవితాన్ని నడిపించిన సాధనలే మనిషిని మహానీయుడిగా నిలబెడతాయి. అలాంటి చరిత్రను సొంతం చేసుకున్న అల్లూరి సత్యనారాయణ రాజు మన్యం వీరుడు, విప్లవనేత అల్లూరి సీతారామరాజు వంశస్థుడు. 25 జనవరి, 1913లో పశ్చిమ గోదావరి జిల్లాలోని వాలమర్రు గ్రామానికి చెందిన అల్లూరి సోమరాజు, సూరమ్మ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. ఆయన తన బాల్యంలోనే స్వాతంత్య్ర ఉద్యమం వైపు ఆసక్తి చూపటానికి కారణం, వాళ్ల పాఠశాల ఉపాధ్యాయుడు. ఆ ప్రభావంతో తన బాల్య స్నేహితుడు ఉద్ధరాజు రామరాజుతో కలిసి ఉద్యమ కార్యకలాపాల్లో చాలా చురుకుగా పాల్గొనేవాడు.
గాంధీ పాలకొల్లు వస్తున్నారని తెలిసి ఆ మిత్రులిద్దరూ 8 మైళ్ల దూరంలో వున్న పాలకొల్లుకు కాలినడకన వెళ్లి, గాంధీ గారిని దగ్గరగా చూసే అవకాశం దొరక్క, మళ్లీ గాంధీ తణుకు వస్తున్నారని తెలిసి, రాత్రికి రాత్రే బయల్దేరి, ఒక కాంగ్రెస్ కార్యకర్త సహాయంతో వేదిక దగ్గరదాకా వెళ్లి, గాంధీని దర్శించుకుని, సంతోషపడతారు. 7వ తరగతి పాసై, 8వ తరగతిలోకి ప్రవేశించాక పూర్తిగా సత్యనా రాయణరాజు మనసు ఉద్యమం వైపు లగమైపోతుంది. తండ్రి పలుమార్లు హెచ్చరించినా, తన ఆలోచనల్లో ఏమాత్రం మార్పు రాదు.
1930లో బ్రిటీషు ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించటంతో దానికి వ్యతిరేకంగా భీమవరంలో జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపు వస్తుంది. వెంటనే మిత్రుడు రామరాజుతో కలిసి ప్రయాణమవుతాడు సత్యనారాయణ రాజు. మూడోరోజు తనను వెతుక్కుంటూ తండ్రి సోమరాజు భీమవరానికి వచ్చి, తన తల్లి కిందపడి ప్రమాదానికి గురైందని చెప్తారు. ఇంటికి వచ్చాక తల్లికి ఏ ప్రమాదం జరగలేదని తెలుసుకుని, మళ్లీ కొద్దిరోజులకే భీమవరం శిబిరానికి చేరుకుంటాడు. అక్కడే పుచ్చలపల్లి సుందరయ్యకు చాలా ఆత్మీయుడుగా మారిపోతాడు. ఆ శిబిరంలో మద్యపాన నిషేధంపై చర్చలు సాగుతాయి. కల్లుకు కారణమైన తాటిచెట్లను కూలగొట్టాలనే నిర్ణయం మేరకు అత్యధికంగా చెట్లను నరికిన వ్యక్తిగా సత్యనారాయణ రాజు గుర్తించబడతాడు. తరువాత కాకినాడలో బ్రిటీషువారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో పోలీసులు అరెస్టు చేసి, సత్యనారాయణ రాజు, రామరాజు మైనర్లు అయినందున నెలరోజులు జైలుశిక్ష విధించి, రాజమండ్రి జైలుకు పంపుతారు. అక్కడే భగత్‌సింగ్ అనుచరులైన విజయకుమార్ సిన్హా, శివవర్మ ... పరిచయమవుతారు. హిందీ, ఇంగ్లీషు భాషల్ని బాగా అధ్యయనం చేయండని శివవర్మ సలహా ఇస్తాడు. ఇంగ్లీషులో అర్థం కాని పదాలను విజయకుమార్ సిన్హా వివరించేవాడు. వాళ్లు అందజేసిన రాహూల్ సాంకృత్యాయన్ 'ఓల్గా సే గంగా' పుస్తకం సత్యనారాయణ రాజును ఎంతగానో ఆకర్షిస్తుంది.
జైలుశిక్ష పూర్తయ్యాక బులుసు సాంబమూర్తి సలహా మేరకు నేరుగా సీతానగరంలో ఉన్న సత్యాగ్రహ ఆశ్రమం చేరుకుంటాడు సత్యనారాయణ రాజు. కొన్ని రోజులకు తండ్రి వచ్చి, ఇంటికి తీసుకువెళతాడు. అయినా సరే, ఉద్యమంలో పాల్గొంటూనే ఉంటాడు రాజు. ఆ సమయంలో రహస్యంగా వెలువడిన 'వీరభారతి' పత్రిక ప్రతులను గ్రామ గ్రామాన అందజేస్తూ వస్తాడు. ఒకరోజు పోలీసులు పట్టుకుని, స్టేషన్‌కు తీసుకొస్తారు. అక్కడ ఇన్‌స్పెక్టర్ రంగనాయకులు పత్రిక వివరాలు చెప్పమంటూ చిత్రహింసలు పెడతాడు. స్ప ృహ కోల్పోతూ, నోట మాట రాక, గొంతు తడారి పోతూ వుంటే మెల్లగా 'దాహం, దాహం...' అంటూ అరుస్తాడు రాజు. ఒక కానిస్టేబుల్ నీళ్లు అందివ్వబోతే, ఇన్‌స్పెక్టర్ ఆ నీళ్లను విసిరికొట్టి, 'తాగరా' అంటూ మూత్రాన్ని రాజు ముఖం మీద పోస్తాడు. ఆ ఇన్‌స్పెక్టర్ ముఖమ్మీద ఘాటుగా ఉమ్మేస్తాడు రాజు. ఇన్‌స్పెక్టర్ మరింత కోపంతో ఊగిపోతూ విచక్షణారహితంగా కొడతాడు. ఈ క్రూరమైన చర్యలను చూడలేక, ఒక కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోతాడు. కొన వూపిరితో ఉన్న రాజును స్టేషనుకు దూరంగా రోడ్డుమీద వదిలేస్తారు పోలీసులు. ఆంధ్రపత్రిక విలేకరి, కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాజును గుర్తించి, ప్రథమ చికిత్స అనంతరం రాజమండ్రిలో ఉన్న డాక్టర్ రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారు. నెలరోజుల ట్రీట్మెంట్ తరువాత రాజు కోలుకుంటున్న సమయంలో, పోలీసులు రాజును తిరిగి అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెడతారు.
ఆ సమయంలో జైలులో ఖైదీలందరికీ మెరుగైన భోజన, వైద్య సౌకర్యాలు అందించాలని లాహెరు కుట్రకేసులో నిందితుడైన జితిన్‌దాస్ జైల్లో నిరాహార దీక్ష ప్రారంభిస్తాడు. 65 రోజుల దీక్ష తరువాత ప్రాణాలు కోల్పోతాడు. అందుకు నిరసనగా ఖైదీలు చేపట్టిన కార్యక్రమంలో రాజు ముఖ్య భూమిక పోషిస్తాడు. నిరసనకు కారకులైన వారందరినీ అండమాన్ జైలుకు పంపమని పై అధికారుల నుంచి ఉత్తర్వులు వస్తాయి. రాజును కూడా అండమాన్ జైలుకు పంపాలని జైలు అధికారి నిర్ణయించుకుంటాడు. అయితే మైనర్‌ని అక్కడికి అవకాశం లేనందున, ఒక గవర్నమెంటు డాక్టరును జైలుకు పిలిపించి, రాజు వయసు 19 సంవత్సరాలుగా రికార్డు తయారు చేయించి, అండమాన్‌కు పంపిస్తారు. అండమాన్ జైలు అధికారి ఫెర్రర్ నరరూప రాక్షసుడు. ఖైదీలను చంపి, అంటురోగాలతో చచ్చారని రికార్డులు పుట్టించి, ఆ శవాలను సముద్రంలోకి విసిరేస్తూ ఉంటాడు. ఆ జైల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డా ఉద్యమం పట్ల ప్రేమను మరింతగా పెంచుకుంటాడు రాజు. తండ్రి సోమరాజు డాక్టర్ రాజు గారితో కలిసి మైనర్ బాలుడ్ని అండమాన్ జైలుకు పంపిన దుర్మార్గం మీద న్యాయపోరాటానికి దిగుతాడు. రాజమండ్రి కోర్టులో కేసు ఓడిపోతారు. అయినా దిగులు పడకుండా ఉన్నత చదువుల కోసం ఇంగ్లండు వెళ్తున్న విద్యార్థులకు కేసు ఫైలు ఇచ్చి దానిని అక్కడి లేబరు పార్టీ సభ్యులకు అందజేయించి, అక్కడి పార్లమెంటులో చర్చకు వచ్చేలా చేస్తారు. ఇలా అనేక పోరాటాల ఫలితంగా రాజు అండమాన్ జైలు నుంచి విడుదలవుతాడు.
ఇంటికొచ్చాక మోగల్లుకు చెందిన వెంకటపతి రాజు ఆఖరి కుమార్తె అన్నపూర్ణతో వివాహం జరిగింది. వీరిద్దరి దాంపత్య వైభవాన్ని ఈ నవలలో అద్భుతంగా అందించారు రచయిత అజీజ్. తరువాతి కాలంలో సత్యనారాయణ రాజు రాజమండ్రి, బీహార్‌లోని ఆర్మోరా, మధ్యప్రదేశ్‌లోని దామో, మహారాష్ట్రలోని ఆమోట్ ... జైళ్లలో స్వరాజ్య ఉద్యమకారుడిగా శిక్షను అనుభవిస్తారు. అలాంటి రోజుల్లో ఇంట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చేవి. నూలు వడికి, ఆ వచ్చిన డబ్బుల్తో అన్నపూర్ణ సంసారాన్ని నడిపేది. 1937లో కొత్తపట్నంలో సుందరయ్య గారి సూచనలతో ఏర్పాటు చేసిన రాజకీయ పాఠశాలకు తన ఇద్దరు చిన్న పిల్లలను భుజాన వేసుకుని హాజరవుతుంది. ఉద్యమంలో పోలీసులు అరెస్టు చేసి, మండుటెండలో 15 కిలోమీటర్ల దూరంలో వున్న రాజమండ్రి జైలు వరకు నడిపించినప్పుడు, ఇద్దరి పిల్లల్ని ఎత్తుకొని, నినాదాలు చేసుకుంటూ, ముందుకు సాగుతూ, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది అన్నపూర్ణ. కాళీపట్నం జమిందారుకు వ్యతిరేకంగా జరిగిన భూపోరాటాల్లో సైతం పాల్గొని లాఠీ దెబ్బల్ని ఎదుర్కొంది. ఈ కష్టాలన్నింటిని దేశసేవలో భాగంగానే భావించేది.
స్వాతంత్య్రం అనంతరం సత్యనారాయణరాజు పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఉమ్మడి ప్రాంతాల శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా సేవలందించారు. నాగార్జున సాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు రావటానికి ప్రధాన కారకుల్లో ఈయన ఒకరు. 1960లో పి.డబ్ల్యు.డి శాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో చెక్ డ్యాంల నిర్మాణానికి కారకుడయ్యాడు. భూసంస్కరణల అవసరం గురించి తన గళాన్ని చాలా బలంగా సభల్లో వినిపించేవాడు. ఒక దశలో కాంగ్రెస్‌లో ఉంటూ కమ్యూనిస్టులా ఆలోచిస్తున్నాడని పార్టీ ఆయన్ని దూరం పెడుతుంది. తాము చేసింది తప్పని, ఆయన లేకపోతే పార్టీకి ఎంతో నష్టమని అధిష్టానం తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తుంది. జీవితకాలమంతా నిస్వార్థ సేవకే అంకితమైన సత్యనారాయణరాజు, 1963 సెప్టంబరు 3వ తేదీన ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఈ నవల ద్వారా ఇటు రాష్ట్ర రాజకీయాలను, అటు దేశ రాజకీయాలను ఎంతో ప్రభావితం చేసిన ఒక అసాధారణ ప్రతిభావంతుడి గురించి తెలుసుకుంటాం. ముఖ్యమంత్రి పదవి తలుపు తట్టినా, ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించిన వైనాన్ని తెలుసుకుంటాం. సుభాష్ చంద్రబోసును తెలుగు నేలకు ఆహ్వానించి, ఆయన ప్రసంగాల చేత ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన ఒక గొప్ప కార్యశూరుడి గురించి తెలుసుకుంటాం. 9 సార్లు జైలుకెళ్లి, అత్యధిక కాలం జైలు జీవితం అనుభవించిన వారిలో రెండవ వ్యక్తిగా చరిత్రకెక్కిన ఒక దేశభక్తుడి గురించి తెలుసుకుంటాం. రాహూల్ సాంకృత్యాయన్ 'ఓల్గాసే గంగాతక్' హిందీ నవలను అత్యద్భుతంగా తెలుగులోకి అనువాదం చేసిన ఒక సాహితీవేత్త కరచాలన అనుభూతిని పొందుతాం. బతికింది 50 సంవత్సరాలే అయినా గొప్ప విలువలు పాటించి, చెరగని ముద్ర వేసి, నమ్మిన సిద్ధాంతానికి ఒక శిలాఫలకంలా నిలబడిన ఒక దేశభక్తుడి విశ్వరూపాన్ని ఈ నవలలో దర్శించుకుంటాం. ఈ నవలా రచనలో రచయిత సంకల్పం చాలా గొప్పది. రెండేళ్ల పాటు ఈ కార్యాన్ని ఒక తపస్సుగా భావించి ఐదు వందల పేజీల నవలను చక్కగా, చిక్కగా, నాణ్యంగా, సాహిత్య విలువలతో పూర్తి చేయటం, స్వాతంత్య్ర ఉద్యమ స్వరూపాన్ని సజీవంగా, స్ఫూర్తిదాయకంగా అందివ్వటం అభినందనీయం.
- డాక్టర్ కె.జి.వేణు,
98480 70084










